Advertisement

Advertisement


Home > Politics - Analysis

అప్పుల ఊబిలోకే ఏ రాష్ట్రమైనా

అప్పుల ఊబిలోకే ఏ రాష్ట్రమైనా

కర్ణాటక ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు భవిష్యత్ వ్యవహారాల మీద మీడియా దృష్టి సారిస్తోంది. కర్ణాటకలో గెలవడానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీల విలువ ఏడాదికి సుమారు 60 వేల కోట్లకు పైగానే అంచనాలు కడుతున్నారు. జనాకర్షక వరాలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా ఇదే చేస్తుంది. చేయాలి. 

అయితే గతంలో మాదిరిగా ఇచ్చిన హామీలు మరిచిపోతే జనం ఊరుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఇచ్చిన హామీలు పక్కాగా నెరవేర్చాల్సిందే. కర్ణాటక ఆర్థిక వనరులు ఎంత బలంగా వున్నా, ఖర్చులు కూడా అంతకు అంతా వున్నాయి. వస్తున్న ఆదాయంలో ఇరవై శాతం ఈ హామీలకే పోతుందని అంచనా కడుతున్నారు. అంటే మెలమెల్లగా కర్ణాటక కూడా అప్పుల జోరు పెంచుకోవాల్సిందే.

తెలంగాణలో ఏకంగా ఎస్ సి లకు పది లక్షల వంతున ఇవ్వడం అంటే చిన్న వరం కాదు. ఎన్నికల వేళ వచ్చే సరికి ఇలాంటి వరాలు మరిన్ని పుట్టుకురావచ్చు. తెలంగాణ అప్పులు ఏ మేరకు వున్నాయి, అవి ప్రమాద స్థాయికి చేరుకున్నాయా లేదా అన్న వార్తలను మీడియా వండి వార్చడం లేదు. అలా అని అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుకోలేదని అనడానికి లేదు.

ఇక ఆంధ్ర విషయానికి వస్తే అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని అర్థం అవుతూనే వుంది. ప్రతి నెలా ఏదో ఒక పథకం కోసం బటన్ నొక్కాల్సి వస్తూనే వుంది. అందుకోసం ఏదో ఒక విధంగా అప్పు తేవాల్సి వస్తోంది. ఇప్పటికే ఉద్యోగస్తులకు బోలెడు బకాయిలు పడింది ప్రభుత్వం. కొత్త నిర్మాణాలకు నిధులు గత నాలుగేళ్లుగా చాలా వరకు తగ్గిపోయాయి. పంచాయతీలకు నిధులు అందకుండా దారి మళ్లి పోతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు వస్తే ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలతో పాటు, మరిన్ని వరాలు వైకాపా ఇవ్వాల్సి వస్తుంది. వైకాపా సంగతి సరే, కేవలం ప్రజా వ్యతిరేకతను మాత్రం నమ్ముకోకుండా, స్కీములను కూడా నమ్ముకోవాల్సి వుంటుంది. ఇప్పటికే వైకాపా అమలు చేస్తున్న స్కీములు ఏవీ ఆపమని తేదేపా స్పష్టం చేసింది.

తేదేపా నమ్ముతున్నట్లు తాను అధికారంలోకి వస్తే కనుక చాలా పెద్ద టాస్క్ నే వుంటుంది. అంటే ఇప్పుడున్న అప్పుల సంగతి చూసుకోవాలి. ఆపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. ఉద్యోగస్తుల బకాయిలు తీర్చి వాళ్లని సంతృప్తి పరచాలి. ఆపై ఇంతో అంతో అభివృద్ది చూపించాలి. మీడియాలో వ్యతిరేకత వుండకపోవచ్చు. వార్తలు రాకపోవచ్చు. కానీ 2014-19 మధ్యలో కూడా ఇలాగే వార్తలు దాచారు. లేనివి రాసారు. కానీ జనానికి వాస్తవం తెలిసింది. ఇప్పుడు మరోసారి తెలియకుండా వుండదు.

అలా కాకూడదు అంటే అప్పులు మరింతగా చేయాల్సిందే. అటు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా, ఇటు వైకాపా అధికారం సాధించినా. ఆంధ్ర అప్పులు పెరగక తప్పదు. ఎన్నికలు ఎలా జరుగుతాయిు. జగన్ వుంటాడా? ఊడుతాడా? తెలుగుదేశం వ్యూహాలు ఫలించి అధికారంలోకి వస్తుందా? రాదా? ఇవన్నీ కాదు ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాల్సింది. ఆంధ్రతో సహా ఏ రాష్ట్ర భవిత్యత్ అయినా ఎన్నికల హామీల్లో వున్నాయని, వాటిని దూరం పెడితే తప్ప, ఏ రాష్ట్రం భవిష్యత్ అయినా శోభస్కరంగా వుండదని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

కానీ అలా జరుగుతుందని అని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఈసారి ఓటుకు వెయ్యి నుంచి అయిదువేలు వస్తాయని ఓట్లు వేసేవాళ్లలో మూడు వంతుల మంది ఆశగా వున్నారు. ఏ నియోజక వర్గం అయినా కనీసం వెయ్యి రూపాయల వంతున ఓట్లు కొనడానికే కనీసం ఒక్కో అభ్యర్థికి పాతిక కోట్లు అవసరం పడతాయని అంనచా వుంది. అంటే 175 నియోజక వర్గాలకు ఒక్కోదానికి అతి తక్కువగా చూసుకున్నా 50 కోట్ల వంతున ఖర్చు తప్పదు. ఇదంతా ఎన్నికల తరువాత రాష్ట్ర ఖజానా మీదనే పడుతుంది.

ఈ తరహా ఓటింగ్ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి రాష్ట్రాలను బహుశా ఎవ్వరూ ఎప్పటికీ కాపాడలేకపోవచ్చు. పరిస్థితి పూర్తిగా వికటించిన తరువాత జనానికి తమ ఆశల వల్ల జరిగిన తప్పిదం తెలిసి వస్తే తప్ప.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?