వివిధ జాతీయ స్థాయి మీడియా సంస్థలు తమ సర్వేల ఫలితాలను వెల్లడిస్తూ ఉన్నాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఇలాంటి నేపథ్యంలో రాజకీయ పరిస్థితుల గురించి అధ్యయనం చేసే సంస్థలు, సర్వేలు చేసే మీడియా సంస్థలు తమ పరిశీలనల వివరాలను వెల్లడిస్తూ ఉన్నాయి. మరి ఈ సర్వే సంస్థలు తమ ఫలితాలు కచ్చితం అనే అంటాయి. తాము ఎంతో కూలంకషంగా సర్వే చేసి ఫలితాలను వెల్లడిస్తున్నట్టుగా అవి చెబుతూ ఉంటాయి.
మరి ఆ ఫలితాల గురించి కొన్ని పార్టీలు అనుకూలంగా, మరి కొన్ని పార్టీలు వ్యతిరేకంగా స్పందించడం మామూలే. ఆ ఫలితాలు నచ్చని పార్టీలు వాటిని ఖండిస్తాయి. ఆ ఫలితాలు సరి కాదని అంటాయి. అసలు పరిస్థితి వేరే అంటాయి. ఆ సర్వేల్లో సత్యసంధత లేదంటాయి. ఇక ఆ పార్టీల కార్యకర్తలు ఆ మీడియా సంస్థల గురించినే విమర్శలు మొదలుపెడతాయి. అవి డబ్బులు తీసుకుని ఫలితాలను వెల్లడించాయి అంటాయి. అదే సమయంలో ఆ సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటే మాత్రం అవి చాలా మంచి సంస్థలు అంటూ వీరు పాట అందుకుంటారు! ఇదంతా రొటీన్ గా జరిగేదే!
గత కొన్ని రోజుల్లో జాతీయ స్థాయి మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ ఉన్నాయి. అవి ఏపీ గురించి వెల్లడిస్తున్న ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందనే మాట చెబుతూ ఉన్నాయి. గత ఎన్నికలతో పోల్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత స్ట్రాంగ్ అయ్యిందంటూ ఆ సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లను సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే స్థాయి విజయాన్ని సాధిస్తుందని కొన్ని సర్వేలు, అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంటుంది వచ్చే ఎన్నికల్లో అని మరి కొన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి.
స్థూలంగా అవి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగుతూ ఉంది, తెలుగుదేశం పార్టీ అడ్రస్ వెదుక్కునే పరిస్థితుల్లోనే ఉందని చెబుతున్నాయి. గత ఎన్నికల ముందు కొన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాను అంచనా వేశాయి. అప్పుడు ఇండియా టుడే సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 ఎంపీ సీట్ల వరకూ లభించే అవకాశం ఉందని అంచనా వ్యక్తం అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకు మించి సాధించింది. ఇప్పుడు కూడా ఇండియాటుడే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందనే అంటోంది.
సాధారణంగా ఏ మీడియా సంస్థ కూడా సర్వేలతో తమ క్రెడిబులిటీని దెబ్బతీసుకోవాలని అనుకోదు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. ఇలాంటి సమయంలో టీవీ చానల్ చిన్న వార్తను తప్పుగా ప్రసారం చేస్తేనే నెటిజన్లు ఏకేస్తారు. అలాంటిది సర్వేలు, ఫలితాలు తేడా కొడితే.. ట్రోలింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకే చాలా సంస్థలు జాగ్రత్త వహిస్తాయి. దేనికో ప్రభావితం అయిపోయి సర్వేల ఫలితాలను ప్రకటిస్తే.. మళ్లీ బీభత్సమైన ట్రోల్ ను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే మీడియా సంస్థలు కూడా జాగ్రత్తగా ఉంటాయి.
ఇక సర్వేల్లో సానుకూలత వ్యక్తం అవుతోందని ఏదైనా పార్టీ పొంగిపోవడం కూడా తేడా కొట్టేందుకు ఆస్కారం ఇవ్వడమే. ఇంకేముంది అంతా అనుకూలమే అని ఏ పార్టీ అయినా.. పొంగిపోయినా, ఇక రిలాక్స్ అనుకున్నా.. అక్కడి నుంచినే కథ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అధికారం నిలబెట్టుకోవాలనే ప్రతిష్టతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేల్లో గెలిచేస్తున్నామనే ఆనందానికి పోకుండా.. గ్రౌండ్ లెవల్లో పని చేసుకుంటేనే.. పరిస్థితి నియంత్రణలో ఉంటుంది!