తెలుగు సమాజం దృష్టంతా కాకినాడ జిల్లా పిఠాపురంపైనే. ఇక్కడ జనసేనాని పవన్‌కల్యాణ్ పోటీ చేస్తుండడంతో సహజంగానే అక్కడ ఏం జరుగుతుందోననే ఉత్సుకత నెలకుంది. పిఠాపురంపై అధికార పార్టీ వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. పవన్‌ను ఎలాగైనా మరోసారి ఓడించి, శాశ్వతంగా ఆయనకు సమాధి కట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారనే వార్తలొస్తున్నాయి.
పిఠాపురం మాత్రమే కాదు, 175 నియోజకవర్గాల్లో నెగ్గాలనేది వైఎస్ జగన్ నినాదం. పవన్‌ను ఓడించాలని జగన్ పట్టుదలతో ఉండడం ఆశ్చర్యం కలిగించదు. కానీ పిఠాపురంలో పవన్ ఓడిపోవాలని టీడీపీ కుట్రలకు తెరలేపిందంటే నమ్మగలరా?… ఔననే సమాధానం స్థానికుల నుంచి వస్తోంది. పిఠాపురం జనసేన నాయకులు, కార్యకర్తల్లోనూ అదే అనుమానం వుంది. వర్మను అడ్డు పెట్టుకుని చంద్రబాబు, లోకేశ్ నాటకాలాడుతున్నారనే చర్చకు తెరలేచింది.
పిఠాపురం లేదా భీమవరంలో పవన్ పోటీ చేస్తారని ఏడాది కాలంగా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో కాపుల ఓట్లు ఎక్కువగా వుండడంతో పోటీ చేసేందుకు పవన్ మొగ్గు చూపుతున్నారని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. పిఠాపురంలో పోటీ విషయమై చంద్రబాబు, లోకేశ్‌లకు పవన్ ముందే సమాచారం ఇచ్చారు.
అలాంటప్పుడు పిఠాపురంలో పవన్ సేఫ్‌గా ల్యాండ్ కావడానికి బాధ్యతాయుతమైన మిత్రపక్షం అధినేతగా చంద్రబాబు , లోకేశ్ చర్యలు తీసుకుని వుండాలి. పవన్ పోటీ చేస్తారని, భారీ మొత్తంలో పార్టీ కోసం ఖర్చులు పెట్టుకోవద్దని టీడీపీ ఇన్చార్జ్ వర్మకు సూచించి వుండాలి. కానీ అలా జరగలేదు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఇటీవల పవన్‌కల్యాణ్ ప్రకటించగానే, పిఠాపురం టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. తమ అధ్యక్షుడే పోటీ చేస్తామనే నియోజకవర్గంలో ఏంటీ అరాచకం అంటూ జనసేన శ్రేణులు నోరెళ్లబెట్టారు. టీడీపీ ఏదో చేస్తోందనే అనుమానం అందరిలో కలిగింది. బయటపడక పోయినప్పటికీ అదే నిజం. పిఠాపురంలో పవన్ పోటీ చేయడం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అసలు నచ్చలేదు. ఇక ఆయన గెలుపును మాజీ మంత్రి యనమల అసలు ఆకాంక్షించరు. సహజంగా కాపు వ్యతిరేకిగా యనమలను ఉభయ గోదావరి జిల్లాల వాసులు గుర్తిస్తారు.
పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ వర్మతో యనమలకు మంచి సంబంధాలున్నాయి. పవన్ ఓటమిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటే ఎక్కువగా చంద్రబాబునాయుడు, లోకేశ్, యనమల రామకృష్ణుడు కోరుకుంటున్నారంటే అతిశయోక్తి, ఆశ్చర్యం కలిగించొచ్చు. కానీ రాజకీయం అంటే ఇదే మరి. పైకి కనిపించేవి, మాట్లాడేవీ ఏవీ నిజం కావు.
పిఠాపురంలో పవన్ గెలిస్తే… కాకినాడ జిల్లాలో ఆయన పెత్తనం పెరుగుతుందని యనమల భయం. అలాగే పవన్ గెలిస్తే, అన్నింటికి అడ్డంకే అని చంద్రబాబు, లోకేశ్ భయం. పక్కలో బల్లెం పెట్టుకోడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? అసలే చంద్రబాబు నేపథ్యం తెలిసిన వారెవరైనా పవన్ గెలుపును కోరుకుంటారంటే నమ్మే పరిస్థితి వుండదు. అందుకే వర్మను గిల్లి, విధ్వంసానికి పాల్పడేలా చేశారనే బలమైన వాదన ఆ నియోజకవర్గంలో వుంది.
పిఠాపురంలో పవన్ పోటీ ప్రకటన ఆశ్చర్యం కలిగించేది కాదు. పవన్ ప్రకటించగానే వర్మ ఓవర్ రియాక్షన్ వెనుక కనిపించని కుట్ర వుందనే అనుమానం అందుకే. పిఠాపురంలో టీడీపీ వీరంగంతో పవన్‌తో పాటు జనసైనికుల్లో ఆందోళన కలిగింది. దీన్నే టీడీపీ కోరుకుంది కూడా. పాహిమాం అంటూ తమను పవన్, జనసేన కార్యకర్తలు, నాయకులు శరణు కోరాలని చంద్రబాబు, లోకేశ్ వ్యూహాత్మకంగా వర్మతో నాటకాన్ని రక్తి కట్టించారు. చివరికి అదే జరిగింది.
పిఠాపురంలో తనకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలని చంద్రబాబును పవన్ కోరారు. దీంతో వర్మను పిలిపించుకుని చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి సర్దుబాటు చేసినట్టు పిక్చర్ ఇచ్చారు. పిఠాపురంలో పోటీ చేస్తా అనే ప్రకటనతో రెచ్చిపోయిన వర్మ… ఒక్కసారిగా కూల్ అయ్యారంటే, ఆ మాత్రం కుట్రల్ని అర్థం చేసుకోలేని అమాయక స్థితిలో జనం వుంటారని ఎలా అనుకున్నారో మరి.
భవిష్యత్‌లో కూడా వర్మ ఎలా వ్యవహరిస్తారో అని బిక్కుబిక్కుమంటూ పవన్‌తో పాటు జనసైనికులు భయంతో బతుకుతూ, చంద్రబాబు, లోకేశ్‌లను బతిమలాడుతూ వుండాలనేది కుట్ర. ప్రస్తుతానికి చంద్రబాబు, లోకేశ్, యనమల, వర్మ కలిసి చేసిన కుట్ర విజయవంతమైంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు జగన్ ఏదో చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ పవన్‌ను ఓడించేందుకు చాపకింద నీరులా.. కనిపించని కుట్ర సజీవంగా వుంది. ఈ వాస్తవాన్ని జనసేన గుర్తించి, అప్రమత్తం అయితేనే, పిఠాపురంలో పవన్ పరువు నిలబడుతుంది.