ఎన్నికలైనా, మరేదైనా ప్రత్యర్థుల బలం, బలహీనతల గురించి స్పష్టత వుండాలి. అప్పుడే గెలిచేందుకు వ్యూహ రచన పక్కాగా చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో వైసీపీ బలాన్ని కూటమి అంటచనా కట్టడంలో పూర్తిగా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ఎల్లో మీడియా కూడా కారణం. ఎల్లో మీడియాని నమ్ముకుని కూటమి సగం భ్రష్టుపట్టిందని టీడీపీ నేతలు వాపోతున్నారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న మొదలు… ఆయన ప్రభుత్వంపై ఎల్లో మీడియా నిత్యం విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంది. ఎల్లో చానెల్స్, పత్రికల్లో వచ్చే కథనాలే నిజమని , జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుందని చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ నమ్ముతూ వచ్చారు. దీంతో ఎన్నికలు జరగడమే ఆలస్యం, ఇక అధికారంలోకి వచ్చినట్టే అనేంత భరోసాతో ఆ ఇద్దరు నాయకులున్నారు.
ఈ నేపథ్యంలో అవినీతి కేసులో చంద్రబాబునాయుడి అరెస్ట్, అలాగే టీడీపీ-జనసేన పొత్తు రాజకీయంగా తమకు తిరుగులేని విజయాన్ని ఇస్తాయనే విశ్వాసం అంతకంతకూ పెరిగాయి. అయితే చంద్రబాబుపై అలిపిరిలో బాంబుల దాడి జరిగి, చావు అంచల వరకూ వెళ్లి వచ్చినా జనం కరుణించని సంగతి మరిచిపోయారు. అలాంటిది చంద్రబాబును అరెస్ట్ చేస్తే, సానుభూతి వెల్లువెత్తుతుందని ఎలా అనుకున్నారో వారికే తెలియాలి.
అలాగే బాబుతో పవన్ కలయిక, జనసేనాని పదేపదే తన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తుండడం వల్ల మిగిలిన సామాజిక వర్గాలు టీడీపీకి దూరం అవుతున్నాయని చంద్రబాబు, లోకేశ్ గ్రహించలేకపోయారు. వీళ్లకు బీజేపీ తోడు కావడంతో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లకు గండిపడింది. మరోవైపు లోకేశ్ యువగళం ప్రస్తానం ఏ రకంగానూ రాజకీయంగా ప్రయోజనం కలిగించలేదన్న అభిప్రాయం టీడీపీలోనే వుంది.
మరోవైపు జగన్‌పై వ్యతిరేకత వుందని కేవలం తమ భక్త మీడియాలో వార్తా కథనాల్ని చూసి ఒక నిర్ధారణకు రావడం తప్ప, వాస్తవ పరిస్థితుల్ని చంద్రబాబు, పవన్ అంచనా కట్టలేకపోయారు. తన పార్టీ ఎమ్మెల్యేలను రెండుమూడేళ్లుగా నిత్యం ప్రజల మధ్యే జగన్ తిప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధి పొందిన వివరాలను నేరుగా వారికే ఒక బుక్‌లెట్ ఇచ్చి, మరోసారి ఆశీస్సులు ఇవ్వాలంటూ రెండేళ్లుగా జగన్ ప్రచారం చేయించారు.
అలాగే నిత్యం సర్వేలు చేయిస్తూ, సిటింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేతక ఉన్న చోట మార్చేందుకు ఎంతో ముందుగానే చొరవ చూపారు. అలాగే సోషల్ ఇంజనీరింగ్‌లో తనకు సారి రారెవరూ అన్న రేంజ్‌లో అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఇందులో కూటమి పూర్తిగా విఫలమైంది. ప్రచారంలోనూ జగన్‌కు, చంద్రబాబు, పవన్ మధ్య తేడా స్పష్టంగా కనిపించింది.
బాబు విశ్వసనీయత గురించి జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలాగే ఐదేళ్ల పాలనలో తాను చేసిన పనులు, అందించిన సంక్షేమ పథకాల లబ్ధి గురించి పెద్ద ఎత్తున జగన్ ప్రచారం చేశారు. కానీ జనాన్ని భయపెట్టి, రాజకీయంగా లబ్ధి పొందాలని చంద్రబాబు, పవన్ ప్రయత్నించారు. కూటమి ప్రచారం వర్కౌట్ అయ్యినట్టు కనిపించలేదు. చంద్రబాబు విశ్వసించదగ్గ నాయకుడు కాదని నిరూపించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. 2014 నాటి కూటమి మేనిఫెస్టోపై జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బాబు చెప్పిందేదీ చేయడనేందుకు 2014 మేనిఫెస్టోనే నిదర్శనమని నిదర్శనమని ఊరూరా జగన్ ప్రచారం చేశారు. జగన్ ప్రచారాన్ని ఖండించలేని దుస్థితి బాబు, పవన్‌లది.
బీజేపీతో కలిశామని, దీంతో వ్యవస్థల మద్దతు, ఇతరత్రా అంశాలు కలిసొచ్చి గెలిచిపోతామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలలు కంటున్నారు. కానీ జగన్ తన విశ్వసనీయతను మాత్రమే నమ్ముకున్నారు. జగన్‌పై ప్రజాదరణను చంద్రబాబు, పవన్ తక్కువ అంచనా వేశారు. జగన్‌కు వెల్లువెత్తుతున్న జనం… గ్రాఫిక్స్ అంటూ ఎల్లో మీడియా ప్రచారం ద్వారా తమను తాము మోసగించుకుంటున్నామన్న స్పృహ బాబు, పవన్‌లో లేకపోయింది.
ప్రతి సందర్భంలోనూ జగన్‌ను తక్కువ అంచనా వేయడం వల్లే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు, పవన్ ధీమాగా చెప్పలేని దయనీయ స్థితి. అసలు జగన్ పని అయిపోయిందని ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ …ప్రజల నాడిని పసిగట్టడంలో ఫెయిలై, ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక నోరు మెదపడం లేదనే టాక్ వినిపిస్తోంది. జగన్‌పై నిజంగా జనంలో వ్యతిరేకతే వుంటే, ఈ పాటికి బయటపడేది. కానీ అలాంటిది కూటమి నేతలకు కనిపించలేదు. అందుకే ఎన్నికల ఫలితాలపై భయపడుతున్నారు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం వల్లే… నేడు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి.