కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచేలా ఉన్నాయి. 224 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కర్ణాటకలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి.
కాంగ్రెస్, బీజేపీలు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నాయి. జేడీఎస్ కూడా దాదాపు అన్ని నియోకవర్గాల్లోనూ అభ్యర్థులను పెడుతున్నా.. ఆ పార్టీ ప్రధానంగా యాభై నియోజకవర్గాల్లో గట్టి పోటీని ఇస్తుంది. మిగతా నియోజకవర్గాల్లో కొంత శాతం ఓట్లను అయితే ఆ పార్టీ చీలుస్తుంది. అలాగే గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కూడా ఈ సారి పోటీలో ఉంది. అయితే దీని ప్రభావం నామమాత్రమే కావొచ్చు.
మరి పార్టీల సంఖ్య పరిమితమే అయినా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఖర్చు మాత్రం దేశంలోనే కొత్త రికార్డును సృష్టిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ కనీసం ఒక్కో అభ్యర్థి సగటున యాభై కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నారనేది పరిశీలకుల అంచనా! కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు యాభై కోట్ల రూపాయలకు కాస్త అటూ ఇటూ ఉండవచ్చు. మరి కొన్ని చోట్ల అంతకు మించి ఉండవచ్చు. డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా విజయం కోసం పార్టీలు ప్రతిష్టాత్మకంగా బరిలోకి దిగే నియోజకవర్గాలు కూడా బోలెడన్ని ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సరాసగటున ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి కనీసం యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడని అంచనా!
దేశంలో చాలా రాష్ట్రాల్లో ఖరీదైన ఎన్నికలే జరుగుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, తమిళనాడు.. ఇలా ఏ రాష్ట్రమూ తక్కువేమీ కాదు. అయితే ఇప్పుడు కర్ణాటక వీటి మధ్యన కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తున్నట్టుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఐదేళ్ల కిందట నియోజకవర్గానికి ఇరవై కోట్ల రూపాయలు కనీస స్థాయిలో ఖర్చు చేశారనే అంచనాలున్నాయి. సగటున తీసుకుంటే.. తెలుగురాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థి కనీసం పాతిక కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసి ఉండవచ్చని అంచనా. కొందరు అభ్యర్థులు ఇంకా ఎక్కువ ఖర్చులు కూడా పెట్టి ఉండవచ్చు. సగటున చూస్తే మాత్రం గత ఎన్నికల నాటికి తెలుగునాట అభ్యర్థుల సగటు ఖర్చు పాతిక కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చు.
ఇప్పుడు అదే సగటు కర్ణాటకలో యాభై కోట్ల రూపాయలను అందుకుందనేది పరిశీలన. ఒక్కో అభ్యర్థి ఓటుకు ఐదు వేల రూపాయల పంపకాలకు వెనుకంజ వేయడం లేదని సమాచారం. ఒక్కో ఓటుకు వారు ఐదు వేల రూపాయల చొప్పున సగటున ఖర్చు పెట్టడానికి సై అంటున్నారు. ప్రతి ఓటుకూ ఐదు వేల రూపాయలు ఇవ్వకపోవచ్చు. అయితే దాదాపు పక్షం రోజుల నుంచి అభ్యర్థులు విందులు, వినోదాల పేరిట భారీగా ఖర్చు పెడుతున్నారు. తిన్నవాడికి తిన్నంత, తాగినోడికి తాగినంత! అడిగినోడికి లేదనుకుండా అభ్యర్థులు ఖర్చులు పెడుతున్నారు. పది మందిని వెంట వేసుకు వచ్చేవారికి మరో రేటు. ప్రచారానికి తిరిగే వారికి రోజువారీ కూలీ. ఇవన్నీ లెక్కలేస్తే ప్రతి అభ్యర్థి సగటున ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది.
మరి యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా నెగ్గిన వారు ఆ డబ్బును రిటర్న్ చేసుకోవడానికి కూడా తమ తమ మార్గాలతో రెడీగా ఉంటారని వేరే చెప్పనక్కర్లేదు. కర్ణాటకలో రాజకీయ అవినీతికి లోటు లేదు. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చినా.. కర్ణాటకలో రాజకీయ అవినీతి ఎక్కువ! నేతల వసూళ్ల పర్వం, భారీ స్కామ్ లు.. ఇవన్నీ కర్ణాటకలో కొట్టిన పిండే. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల అధిష్టానాలు కూడా కర్ణాటకలో నేతల స్కామ్ ల గోలతో తలపట్టుకుంటూ ఉంటాయి! ఈ రేంజ్ కర్ణాటక నేతలది.
అలాగే ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఫిరాయింపుల పర్వం కూడా రొటీనే. దీంతో తాము పెట్టిన ఖర్చుకు ఎలాగైనా గిట్టుబాటు అవుతుందనేది కర్ణాటక అభ్యర్థుల ధీమాగా కనిపిస్తోంది. ఎంత భారీగా ఖర్చు పెట్టి గెలిచినా.. ఆ సొమ్ములను తిరిగి రాబట్టుకోవడం కష్టం కాదనేది వారి ధీమా. ఇందుకే ఎడాపెడా ఖర్చు చేయడానికి పాతిక కోట్ల రూపాయల సగటు ఖర్చును యాభై కోట్ల రూపాయల స్థాయికి తీసుకెళ్లడానికి కన్నడ నేతలు తమవంతు కృషి చేస్తూ ఉన్నారు. మరి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి యాభై కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేస్తూ ప్రజాస్వామ్య 'విలువ'ను పెంపొందించడానికి తమవంతు కృషి గట్టిగానే చేస్తున్నట్టుగా ఉన్నారు.