తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పదవికి ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి అశోక్ గజపతి రాజు. ఈయన ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకుడు. రెండవది బి ఆర్ నాయుడు. ఈయన టీవీ 5 ఛానెల్ అధినేత. చిత్తూరు జిల్లాకు చెందిన వారు. ఇంతకీ ఎవరి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారు అన్నది ప్రశ్న.
అశోక్ గజపతి క్షత్రియ కులానికి చెందిన వారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఆయన కుమార్తెకు అవకాశం ఇచ్చారు. ఈసారి మంత్రి వర్గంలో క్షత్రియులకు అవకాశం ఇవ్వలేదు కనుక, ఈ విధంగా భర్తీ చేస్తారని వార్తలు వున్నాయి. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే అశోక్ గజపతి ఇప్పటికే సింహాచలం దేవస్థానంకు వంశపారంపర్య ధర్మకర్త. అందువల్ల మరో దేవస్థానం కూడా ఆయనకే అప్పగిస్తారా అన్నది అనుమానం.
బిఆర్ నాయుడు విషయానికి వస్తే, ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ అన్నది ఒక్క సారి కూడా కమ్మవారికి ఇవ్వలేదు. ఇది కాస్త ఆశ్చర్యకరమన సంగతే. అందువల్ల తొలిసారి ఆ పదవిని ఆ కులానికి ఇస్తే ఎవరూ అభ్యంతర పెట్టడానికి లేదు. కానీ వైకాపా టైమ్ లో అన్నీ రెడ్లకేనా అనే కాంపైన్ నడిచింది. అందువల్ల ఇప్పుడు కమ్మవారికేనా అనే కాంపైన్ స్టార్ట్ అవుతుంది.
బిసిలను గట్టిగా పట్టుకుని వుండాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పవన్ ద్వారా కాపులను దగ్గరకు తీసారు. కానీ అది బిసిల్లో వ్యతిరేకత పెంచకూడదు. అందుకే పల్లా శ్రీనివాస్ కు దేశం పగ్గాలు అప్పగించారు. అందువల్ల టీటీడీ కూడా బిసి లకే ఇస్తారనే అంచనాలు కూడా వున్నాయి.
ఇదిలా వుంటే గతంలో టీటీడీ సభ్యుల సంఖ్యను వైకాపా దారుణంగా పెంచేసింది. కానీ ఈసారి అలా కాకుండా తగ్గిస్తారు. అయితే గతంలో తెలుగుదేశం హయాంలో వుండే సభ్యుల కన్నా కాస్త ఎక్కువ మందే వుంటారు. ఎందుకంటే భాజపాకు కోటా వుంటుంది. జనసేనకు కోటా వుంటుంది. తెలుగుదేశం సంగతి సరే సరి. అది కాక తెలంగాణ, ఇతర రాష్ట్రాల ఇండస్ట్రియలిస్ట్ ల నుంచి వత్తిడి వుంటుంది.
అందువల్ల టీటీడీ పాలక వర్గ నియామకం అంత సులువుగా జరిగే పని కాదు.