Advertisement

Advertisement


Home > Politics - Analysis

వారాహి..మనల్ని మనమే ఆపేస్తాం

వారాహి..మనల్ని మనమే ఆపేస్తాం

‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ శివాలు తొక్కేస్తారు జ‌నసేన అధిపతి పవన్ కళ్యాణ్. తనను ఎవరూ అడ్డుకోకున్నా..దమ్ముంటే అడ్డుకోండి చూద్దాం అంటారు. తనను ఎవరూ ఏమీ అనకున్నా తనకు తానే అన్నీ ఫీలైపోతూ సవాళ్లు విసిరేస్తూ వుంటారు. తనను చంపడానికి కుట్రలు పన్నుతున్నారంటూ తనకు తానే ఓ భ్రమలో బతికేస్తుంటారు. కానీ చేతలు మాత్రం చిత్రాతిచిత్రంగా వుంటాయి.

వారాహి వాహనం..దానికి పంజాబ్ నుంచి రిటైర్డ్ మిలటరీ జ‌వాన్లు రక్షణ,  పూజ‌లు హడావుడి ముగిసిపోయింది. అన్ని కోట్లు పెట్టి వాహనం చేయించారు. మనల్ని ఎవరు ఆపేది అని అంటూనే తనకు తానే ఆగిపోతున్నారు. వారాహి రెడీగా వుంది..చకచకా రాజ‌కీయ యాత్రలు చేయవచ్చు కదా? రాజ‌కీయ యాత్రలకు నారసింహ యాత్రలు అనే కలరింగ్. మరి దేవుడి యాత్రలు చేస్తూ పొలిటికల్ విమర్శలు చేయచ్చా? పోనీ అవన్నా చేస్తన్నారా అంటే అదీ లేదు.

పవన్ కళ్యాణ్ తన భుజాలపై తెలుగుదేశం పార్టీని వుంచుకుని దాన్ని విజ‌య తీరం వరకు మోయడానికి సిద్దపడ్డారు అన్నది జ‌నాల అభిప్రాయం. అలాంటి తెలుగుదేశం యువరాజు, చంద్రబాబు తరువాత కాబోయే పార్టీ వారసుడు, పదవీ వారసుడు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. భారీ ఏర్పాట్లు, భారీ సైన్యం అన్నీ సమకూర్చుకుని 400 రోజుల యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ యాత్రకు మీడియా ఇస్తున్న ప్రచారమే అంతంత మాత్రం. ఇక పవన్ కూడా అదే టైమ్ లో యాత్ర సాగిస్తే ఎలా వుంటుంది?

పవన్ కు సహజంగానే ఎక్కువ మంది జ‌నాలు వస్తారు. సదరు యాత్ర ముందు లోకేష్ యాత్ర తేలిపోతుంది. అలా జ‌రిగితే వ్యవహారాలు అన్నీ బెడిసి కొడతాయి. అందువల్ల నారసింహుని ఆలయాల యాత్ర చేయాలన్నా కూడా పవన్  ముందు వెనుక ఆలోచించుకోవాల్సిందే. అందుకే మరో నాలుగు వందల రోజుల వరకు పవన్ ‘వారాహి’ కి పెద్దగా పని వుండదు. అప్పుడో..ఎప్పుడో ఓసారి అది కూడా లోకేష్ వెళ్లే మార్గంలో కాకుండా, ఆ ఉత్తరంలో వుంటే ఈయన దక్షిణంలో అన్నట్లుగా యాత్ర చేసానంటే చేసాను అని అనిపించుకోవాలి తప్ప అంతకు మించి వుండకపోవచ్చు.

అయినా పెద్దవాళ్లను ఎవ్వరూ ఆపనక్కరలేదు. ఆపకూడదు..వాళ్లకు వాళ్లే ఆగిపోతారు. అవసరాలు అలాంటివి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?