ప్ర‌జ‌ల‌కు దూర‌మై… ప్ర‌జ‌లే దూర‌మై

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే భూమిక‌. నేల‌ని మ‌రిచి గాలిలో విహ‌రించేవాడు, బొక్క‌బోర్లా ప‌డ‌తాడు. జ‌గ‌న్‌కి జ‌రిగింది ఇదే. ప్ర‌జ‌ల్ని మ‌రిచిపోయారు. ప్ర‌జ‌లు ఆయ‌న్ని మ‌రిచిపోయారు. ఫ‌లితం ఘోర ఓట‌మి. Advertisement నిరంత‌రం ప్ర‌జ‌ల కోసం బ‌ట‌న్…

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే భూమిక‌. నేల‌ని మ‌రిచి గాలిలో విహ‌రించేవాడు, బొక్క‌బోర్లా ప‌డ‌తాడు. జ‌గ‌న్‌కి జ‌రిగింది ఇదే. ప్ర‌జ‌ల్ని మ‌రిచిపోయారు. ప్ర‌జ‌లు ఆయ‌న్ని మ‌రిచిపోయారు. ఫ‌లితం ఘోర ఓట‌మి.

నిరంత‌రం ప్ర‌జ‌ల కోసం బ‌ట‌న్ నొక్కాడు క‌దా, మ‌రి ప్ర‌జ‌ల‌కి దూరం ఎందుక‌య్యాడు? ప‌థ‌కాలు మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌ర చేయ‌వు. అదే నిజ‌మైతే జ‌గ‌న్‌కి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా అయినా ద‌క్కేది. ఉత్త‌రాంధ్ర నుంచి రాయ‌ల‌సీమ వ‌ర‌కూ ఎందుకు తిర‌స్క‌రించారు? జ‌గ‌న్‌ని జ‌నం వ‌ద్దూ అని ఏక వాక్యంతో తీర్మానించారు. ఎందుకంటే గ‌తంలోలా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి కాదు. జ‌నానికి భిక్షం వేసి ప‌బ్బం గ‌డుపుకోవాల‌నుకుంటున్న నాయ‌కుడ‌ని గ్ర‌హించారు. త‌న‌ని తాను చ‌క్ర‌వ‌ర్తిలా ఊహించుకుని తాడేప‌ల్లి రాజ‌భ‌వ‌నంలో విశ్రాంతి తీసుకునే ప‌లాయ‌న‌వాది అని అర్థం చేసుకున్నారు. అందుకే ప‌థ‌కాల ల‌బ్ధిదారులు కూడా వెంట లేకుండా పోయారు.

అస‌లు జ‌గ‌న్ బ‌లం ఏంటి? అంద‌రూ అనుకున్న‌ట్టు వైఎస్ వార‌స‌త్వం కాదు. అదే నిజ‌మైతే ష‌ర్మిల‌కి క‌నీసం డిపాజిట్ ద‌క్కేది. వార‌సుడిగా రంగంలోకి వ‌చ్చిన ఆయ‌న్ని వైఎస్ కుమారుడిగా మాత్ర‌మే గుర్తించ‌లేదు. సోనియాని ఎదుర్కొన్న ధైర్య‌శాలిగా మాత్ర‌మే ప‌రిగ‌ణించ‌లేదు. సామాన్య జ‌నంలో తిరిగే ఒక మంచి నాయ‌కుడు, పేద జ‌నాన్ని అక్కున చేర్చుకునే మాన‌వ‌తా వాది అని జ‌నం న‌మ్మారు. దీనికి నిద‌ర్శ‌నంగా 2009 నుంచి 19 వ‌ర‌కూ రోడ్ల మీదే ఉన్నారు. పాద‌యాత్ర‌లో తిరిగారు. జ‌గ‌న్ ప‌థ‌కాల కంటే, జ‌గ‌న్ త‌మ మ‌నిషి, క‌ష్టం చెప్పుకుంటే తీరుస్తాడ‌ని విశ్వ‌సించారు. దీని ఫ‌లిత‌మే అఖండ విజ‌యం.

అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ తండ్రిలాగా ప్ర‌జాద‌ర్బార్ పెట్టి వుంటే జ‌నం క‌ష్ట‌సుఖాలు విని వుంటే క‌థ వేరే వుండేది. 23 సీట్ల‌తో ఓట‌మి ప‌రాభ‌వంతో ఉన్న చంద్ర‌బాబుని, తెలుగుదేశం పార్టీని దూషించ‌డం, ఎగ‌తాళి చేయ‌డంతో ప్రారంభ‌మ‌య్యాడు. జ‌గ‌న్‌ని ఆరాధిస్తున్న వారు కూడా ప్ర‌జావేదిక కూల్చివేత చూసి నివ్వెర‌పోయారు. అది ప్ర‌భుత్వ ధ‌నం. అక్ర‌మ క‌ట్ట‌డం పేరుతో కూల్చేసే హ‌క్కు లేదు. అదే నిజ‌మైతే రాష్ట్రంలో ఉన్న అక్ర‌మ క‌ట్ట‌డాల‌న్నీ కూల్చేసి వుండాలి. కూల్చారా? లేదు క‌దా!

అన్నిటికంటే పెద్ద త‌ప్పు, పేద ప్ర‌జ‌లు ఈస‌డించుకున్న‌ది అన్నా క్యాంటీన్ మూసివేత‌. అన్నా అనే పేరు ఇష్టం లేక‌పోతే వైఎస్ లేదా జ‌గ‌న్ క్యాంటీన్ అని పెట్టుకుంటే ఎవ‌ర‌డ్డు చెబుతారు? పేద‌వాళ్ల‌కి నాణ్యంగా పెడుతున్న భోజ‌నాన్ని అకార‌ణంగా దూరం చేసి జ‌నానికి ఇంకో అడుగు దూరం జ‌రిగాడు.

పేద ప్ర‌జ‌లు తాగే మ‌ద్యం జోలికెళ్ల‌డం ఇంకో త‌ప్పు. మ‌ద్యం సిండికేట్ల‌ని రూపుమాపాల‌నుకుంటే క‌రెక్టే. కానీ జ‌రిగింది వేరు. నాణ్య‌త లేని మ‌ద్యం అధిక రేట్ల‌తో వ‌చ్చింది. ధ‌ర‌లు పెంచితే మందు మానేస్తారా?

ఇసుక దొర‌క్క భ‌వ‌న నిర్మాణ కార్మికులు హాహాకారాలు చేస్తూ వుంటే ఒక్క రోజైనా జ‌గ‌న్ జ‌నం ముందుకొచ్చి గోడు విన్నాడా? క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌లు అర్థం చేసుకుని ప‌రిష్కారం దిశ‌గా పూనుకున్నాడా?

తాడేప‌ల్లి నుంచి బ‌య‌టికి రాడు. వ‌స్తే జ‌నానికి అష్ట‌క‌ష్టాలు. షాపులు మూయించారు. చెట్లు న‌రికారు. ప‌ర‌దాలు క‌ట్టారు. పోలీసుల్ని ఎంత ద‌గ్గ‌ర పెట్టుకుంటే, జ‌నం అంత దూరం అవుతారు. చిన్న లాజిక్‌, జ‌గ‌న్‌కి చెప్పేవాళ్లు లేరు. చెప్పినా వినే ప‌రిస్థితి లేదు.

ఒక ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సొమ్ముని వేల కోట్లు ఖ‌ర్చు పెడితే, త‌ర్వాత వ‌చ్చే ప్ర‌భుత్వం ఆ నిర్ణ‌యాన్ని గౌర‌వించి డ‌బ్బు వృథా కాకుండా చూడాలి. ఎందుకంటే ప్ర‌జ‌ల సొమ్ముకి జ‌వాబుదారీగా వుంటార‌ని మిమ్మ‌ల్ని ఎన్నుకుంటారు. కానీ జ‌గ‌న్ అమ‌రావ‌తిని పాడు పెట్టాడు. కోర్టుల‌కి కోట్ల రూపాయ‌లు త‌గ‌ల‌బెట్టి, అమ‌రావ‌తి బాధితుల్ని భిక్ష‌గాళ్ల‌ని చేసి ఊరూరా తిప్పాడు.

ఒక భ్ర‌మ‌లో మునిగిన‌ప్పుడు వాస్త‌వం త‌ల‌కెక్క‌దు. ఒక్కో వ‌ర్గాన్ని తెలివి త‌క్కువ‌గా దూరం చేసుకుంటూ వ‌చ్చిన జ‌గ‌న్‌, త‌న వెంట  మైనార్టీలు, మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నార‌ని భ్ర‌మ‌కి గుర‌య్యారు. వాళ్లంతా కూడా మొద‌ట ప్ర‌జ‌లు, త‌ర్వాతే వ‌ర్గాలు.

రాయ‌ల‌సీమ‌లో ముస్లిం ప్ర‌భావిత నియోజ‌క వ‌ర్గాల్లో కూడా జ‌గ‌న్‌కి ఓట్లు ప‌డ‌లేదు. కార‌ణం? బీజేపీ భ‌యం కంటే వైసీపీ వ‌దిలితే చాల‌ని ముస్లింలు కూడా అనుకున్నారు.

ఎందుకింత నిర‌స‌న‌? ఇది టీడీపీ గెలుపు కాదు, జ‌గ‌న్ ఓట‌మి కూడా కాదు. ప్ర‌జ‌ల తిరుగుబాటు. రాజ‌కీయ పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠం.

జ‌గ‌న్ పుట్టుక‌తో చ‌క్ర‌వ‌ర్తి కాదు. ప‌ల్ల‌వులో, కాక‌తీయులో, చోళుల రాజ‌వంశం కాదు. ఆయ‌న తాత ముత్తాత‌లు సాధార‌ణ రైతులు. ప్ర‌జాస్వామ్యం అనే బ‌ల‌మైన వ్య‌వ‌స్థ‌తో ముఖ్య‌మంత్రి అయ్యారు. దాన్ని గౌర‌వించ‌ని వాళ్లు నేల‌కు విసిరి ప‌డ‌తారు.

ఎవ‌రైతే త‌న వెంట సైన్యంలా నిలిచారో, ఎవ‌రు జేజేలు కొట్టారో, ఏ నాయ‌కులైతే క‌ష్టాలకు ఓర్చి జ‌గ‌న్‌ని భుజాల మీద ఎత్తుకున్నారో అంద‌ర్నీ మరిచి తాడేప‌ల్లి నాలుగు గోడ‌ల మ‌ధ్య పాల‌న సాగించిన జ‌గ‌న్‌ని అంద‌రూ క‌లిసి ఇంటికే ప‌రిమితం చేశారు. ఇపుడు ఆయ‌న బ‌య‌టికొచ్చినా ఎవ‌రికీ అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌ల‌కి అవ‌స‌రం అయిన‌ప్పుడు దూర‌మై, ఆయ‌న‌కి అవ‌స‌ర‌మై ద‌గ్గ‌ర అవుతానంటే జ‌నం అంత తేలిగ్గా అంగీక‌రించ‌రు.

పోరాటం జ‌గ‌న్‌కి కొత్త కాదు. నిజ‌మే. ఆయ‌న ద‌గ్గ‌ర సంప‌ద వుంది. ఎంత‌కాల‌మైనా పోరాడ‌తారు. ఆయ‌న్ని న‌మ్మి ఆస్తులు పోగొట్టుకుని, వైరం తెచ్చుకుని, యుద్ధం చేసి అవ‌మానాలు పొంది, పొంద‌డానికి సిద్ధంగా ఉన్న‌వాళ్ల మాటేంటి?

ఐదేళ్లు మీరు బ‌ట‌న్ నొక్కారు. ఐదేళ్ల‌కోసారి జ‌నం ఈవీఎం బ‌ట‌న్ నొక్కారు. చెల్లుకు చెల్లు.