‘అద్భుతం’ అంటే అర్థం తెలుసా పవన్ జీ?

చంద్రబాబు చంక ఎక్కి రాజకీయం చేయడానికి, చంద్రబాబు పల్లకీ మోస్తూ ఆయనను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి.. వచ్చే ఎన్నికల్లో తన శక్తివంచన లేకుండా కృషి చేయాలని పవన్ కల్యాణ్ ఆల్రెడీ ఫిక్సయిపోయారు. ఓటు చీలనివ్వను…

చంద్రబాబు చంక ఎక్కి రాజకీయం చేయడానికి, చంద్రబాబు పల్లకీ మోస్తూ ఆయనను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి.. వచ్చే ఎన్నికల్లో తన శక్తివంచన లేకుండా కృషి చేయాలని పవన్ కల్యాణ్ ఆల్రెడీ ఫిక్సయిపోయారు. ఓటు చీలనివ్వను అనే మాట ద్వారా ఆయన పొత్తులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. తాను పవన్ పట్ల వన్ సైడ్ లవ్ సాగిస్తున్నానని చంద్రబాబు చెప్పిన మాటలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. కాకపోతే అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. 

అయితే నంద్యాల పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ ను మీడియా మిత్రులు తెలుగుదేశంతో పొత్తుగురించి అడిగినప్పుడు ఆయన చిత్ర విచిత్రమైన సమాధానాలు చెప్పారు. ఒకవైపు బిజెపితో పొత్తు 100 శాతం ఉంటుందని అన్నారు. పొత్తుల్లో ఉన్నాం అంటూనే ఒంటరిగా పోరాడుతున్నారు కదా.. అని విలేకరులు అడిగితే.. ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం అనే పడికట్టు పదాలు వాడుతున్నారు. 

పవన్ తనంత తాను ఆల్రెడీ కార్యాచరణలోనే ఉన్నారు. బిజెపిని అసలు పట్టించుకోవడం లేదు. మరి ఉమ్మడి కార్యాచరణ అంటే ఏమిటో.. సదరు మిధ్యాపదార్థాన్ని ఎన్నడు ప్రకటిస్తారో ఆయనకు మాత్రమే తెలియాలి. 

ఇదొక తమాషా కాగా, తెలుగుదేశంతో పొత్తు గురించి అడిగినప్పుడు సూటిగా జవాబివ్వకుండా.. రాష్ట్రంలో ఓ అద్భుతం జరగబోతున్నదని సెలవిచ్చారు. ‘అద్భుతం’ అంటే అసలు అర్థం ఏమిటి? గతంలో ఎన్నడూ లేనిది అనే కదా! తెలుగుదేశంతో పొత్తు అనేది గతంలో కూడా ఉన్నది కదా..? మరి అద్భుతం ఎలా అవుతుంది? అనేది ప్రజల మెదళ్లలో మెదలుతున్న సందేహం. 

అద్భుతం అంటే అర్థం తెలియకుండానే.. మీడియా ప్రశ్నలకు ఏదో ఒక దాటవేత సమాధానాలు చెప్పి తప్పించుకోవాలి గనుక.. పవన్ కల్యాణ్ ఆ పదం వాడారేమో తెలియదు. అలా కాకపోతే.. త్యాగాలకు సిద్ధం అని ప్రకటించిన చంద్రబాబు.. ఆయన సీఎం కుర్చీని త్యాగం చేసి, తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించవచ్చునని పవన్ కలగంటున్నారేమో తెలియదు. అలా జరిగితే అద్భుతమే అవుతుంది.

కాదూ కూడదూ.. పొత్తులు కాదు.. అంతకు మించిన అద్భుతమే ఏదో జరగబోతున్నది అని అనుకుంటే మాత్రం.. అది జనసేన పార్టీని తెలుగుదేశంలో విలీనం చేసేయడమే! అన్న చిరంజీవి ఎటూ పార్టీని పెట్టి తర్వాత దానిని కాంగ్రెసులో విలీనం చేసేశాడు. ఇప్పుడు తమ్ముడి వంతు మిగిలింది. ఆయన స్థాపించిన జనసేన పార్టీని తెలుగుదేశంలో విలీనం చేస్తే మాత్రమే.. అది అద్భుతం అనిపించుకుంటుంది. ఆ సంగతి పవన్ కల్యాణ్ కు తెలుసో లేదో?