
భూమా కుటుంబం రాజకీయానికి దాదాపు తెరపడినట్టుగా కనిపిస్తోంది. ఒక దశలో నంద్యాలతో మొదలుపెట్టి కర్నూలు, హైదరాబాద్ వరకూ భూమా నాగిరెడ్డి పేరు మార్మోగింది. తన పేరు ను తనే చెప్పుకుంటూ ఆ పేరు చెబితేనే హడలిపోవాలన్నట్టుగా భూమా నాగిరెడ్డి బాహాటంగానే హెచ్చరించిన దాఖలాలున్నాయి. ఒకవైపు ఆధిపత్యంలో అయితేనేం, మరోవైపు రాజకీయంలో అయితేనేం.. భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు ప్రత్యేకంగా నిలిచారు. తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో ముఖ్యులుగా వ్యవహరించారు. వీరికి తోడు శోభ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో సీమలో ముఖ్యనేతగా వ్యవహరించారు. నంద్యాల ఎంపీ సీటు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే సీటు.. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఇలా భూమా నాగిరెడ్డి, శోభ, ఎస్వీ సుబ్బారెడ్డిలు రాజకీయంగా ఉనికిలో నిలిచారు.
2004లో తెలుగుదేశం పార్టీ ఓటమితో వీరి పొలిటికల్ రూటు మారింది. అంత వరకూ తెలుగుదేశం పార్టీలో గుర్తింపు పొందిన వీరు క్రమంగా రూటు మార్చారు. ముందుగా ఎస్వీ సుబ్బారెడ్డి వైఎస్ కు సన్నిహితులయ్యారు. 2004-09ల మధ్యన ముందుగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ వైపు మొగ్గు చూపిన వారిలో ఎస్వీ సుబ్బారెడ్డి ఉంటారు. అయితే వీరిని వైఎస్ చేరదీశారేమో కానీ, కాంగ్రెస్ లోకి అయితే చేర్చుకోలేదు.
అప్పటి వరకూ వీరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో ఉంటూ కష్టాలు పడిన వారిని వైఎస్ విస్మరించదలుచుకోలేదు. నంద్యాలలో అయినా, ఆళ్లగడ్డలో అయినా కాంగ్రెస్ తరఫున నిలిచి గెలిచిన కుటుంబాలకే వైఎస్ ఆనాడు ప్రాధాన్యతను ఇచ్చారు. ఆళ్లగడ్డలో గంగుల కుటుంబం, నంద్యాల్లో ఎస్పీవై రెడ్డి ఇంకా కాంగ్రెస్ లో వీరు చేరితో వీరి పొడ గిట్టని వారు ఇబ్బంది పడతారు అనే విషయాన్ని గుర్తించి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వీరు వస్తామని వర్తమానాలు పంపినా చేర్చుకోలేదు. అయితే అలాగని వదిలేయనూ లేదు. అండదండలు ఇస్తూనే, తెలుగుదేశం పార్టీకి వీరిని దూరం చేస్తే ఆ పార్టీకి మైనస్ అవుతుందనే విషయాన్ని గుర్తించి, ప్రజారాజ్యం ఆవిర్భావంతో ఆ పార్టీ వైపు పంపే మంత్రాంగాన్ని అమల్లో పెట్టారు వైఎస్. ఆ మేరకు వీరు 2009 ఎన్నికలకు కొన్ని నాళ్ల ముందు ప్రజారాజ్యం పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ నుంచి పాత కాపులు, ప్రజారాజ్యం నుంచి భూమా కుటుంబం నాటి ఎన్నికల్లో పోటీ చేసింది. అయినప్పటికీ భూమా శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. గంగుల కుటుంబం ఓటమి పాలయ్యింది.
ఇక వైఎస్ మరణం, జగన్ పార్టీ పెట్టడంతో భూమా నాగిరెడ్డి, శోభలు జగన్ కు జై కొట్టారు. ఆ పార్టీలో పని చేయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తున్న దశలో శోభ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ కుటుంబ పొలిటికల్ చాప్టర్ లో మలుపులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం, తెలుగుదేశం పార్టీ నుంచి కేసుల వేధింపులు తీవ్రతరం కావడంతో భూమా నాగిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆయన తుమ్మినాదగ్గినా తెలుగుదేశం పార్టీ వాళ్లు కేసులు నమోదు చేయించారు. శోభ ఉన్నంత వరకూ రాజకీయాన్ని ధైర్యంగానే ఎదుర్కొన్న నాగిరెడ్డి, ఆమె లోటుతో పరిణామాలను ఎదుర్కొనలేకపోయారనుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిపోతే.. అన్ని కేసులూ మాఫీ కావడమే కాదు, ప్రతిగా మంత్రిపదవి అనే ఆఫర్ కూడా చంద్రబాబు ఇవ్వడంతో నాగిరెడ్డి చివరకు అటు మొగ్గారు. అలాగని చేరిన వెంటనే ఊరటలు ఇవ్వలేదు!
కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఎలాగైనా తెలుగుదేశం అభ్యర్థి గెలవాల్సిందే, బలం లేకపోయినా గెలిపించుకురావాల్సిందే అని చంద్రబాబు వైపు నుంచి ఒత్తిళ్లు భూమా నాగిరెడ్డిని కుంగదీసినట్టున్నాయి. అదే సమయంలో ఆయన గుండెపోటుకు గురై మరణించారు. నాగిరెడ్డి మరణంతో తప్పక చంద్రబాబు నాయుడు ఆయన పెద్ద కూతురు అఖిలప్రియను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నంద్యాల బైపోల్ లో నెగ్గడానికి అలాంటి తంత్రాలను అమల్లో పెట్టారు. నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మాన్ని గెలిపించుకోవడానికి అఖిల వీధి వీధి తిరిగారు. తల్లీదండ్రీని కోల్పోయిన ఆ పిల్లలపై సానుభూతి వర్షించింది.
అయినప్పటికీ అఖిలప్రియ, ఆమె సోదరి, తమ్ముడి అనుభవం రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడలేదు. మంత్రిపదవితో ఆమెకు పరిణతి రాలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అటు నంద్యాల్లో బ్రహ్మానందరెడ్డి, ఇటు ఆళ్లగడ్డలో అఖిల ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఇక ఇదే సమయంలో నాగిరెడ్డి కూతుళ్లు, కొడుకు, అల్లుళ్లు వీళ్లెవ్వరూ స్థానికంగా ఆమోదం పొందే అవకాశాలు లేకుండా పోయాయి.
వ్యక్తిగత కారణాలు ఏవైనా నాగిరెడ్డి కూతుళ్లు విడాకులు తీసుకున్నారు. అఖిలప్రియ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది. ఇక మౌనిక కూడా మొదటి భర్తకు విడాకులు ఇచ్చి మంచు మనోజ్ ను పెళ్లి చేసుకుంటోంది. ఇదంతా వారి వ్యక్తిగతమే. అయితే వీళ్లకు రాజకీయం కూడా అవసరం! తమను చూసి ప్రజలంతా ఓట్లేయాలని వారు కోరుకుంటున్నారు. అయితే స్థానికులు తమ నేతలకు సంబంధించి అన్నింటినీ గమనిస్తారు. అదంతా వ్యక్తిగతం అంటూ ఎవరైనా వాదించినా, సంప్రదాయాలు, కట్టుబాట్లు, కులం ఇవన్నీ ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజులు వేసుకునే అంశాలు! మరో విశేషం ఏమిటంటే వీరి మొదటి భర్తలు రెడ్లు. రెండో పెళ్లి మాత్రం కులాంతరం. మరి ఆ భర్తలైనా రాజకీయంలోకి జోక్యం చేసుకోకుండా, తమ పని చూసుకుంటారా! అంటే అబ్బే అలాంటిదీ లేదు!
భూమా అఖిలప్రియ భర్త ఇప్పటికే చాలా రాద్ధాంతం చేశారు. ఒకవేళ రాజకీయం వైపు జోక్యం చేసుకోకుండా అతడు ఆమె భర్త, అప్పుడప్పుడే కనిపిస్తాడు, తన పనేదో తను చేసుకుంటాడు అనే పరిస్థితి ఉండి ఉంటే, ఆఖిలప్రియ కు రాజకీయంగా భవితవ్యం కచ్చితంగా ఉండేది. ఎప్పుడైతే స్థానికేతరుడు, ఆళ్లగడ్డతో బీరకాయ పీచు సంబంధం లేదని వ్యక్తి వచ్చి హల్చల్ చేయడం మొదలుపెట్టాడో అప్పుడే ప్రజలలో చర్చ మొదలవుతుంది. ఒకవేళ అఖిలప్రియ తన కులస్తుడినే రెండో పెళ్లి చేసుకుని ఉన్నా.. ఇది సమస్యే! తమదో సూపర్ పవర్ పొలిటికల్ ఫ్యామిలీ అని అఖిలప్రియ ఒకింత అహంకారం చూపడం, మరోవైపు ఆమె భర్త హల్చల్ చేయడం.. ఇవి బాగా ఎదురుదెబ్బలయ్యాయి.
మరి రేపు మంచు మనోజ్ కూడా రాజకీయాల్లోకి వేలు పెడితే మాత్రం పరిస్థితి మరింత తేడా అవుతుంది. భూమా మౌనిక భర్తగా మంచు మనోజ్ కు గౌరవమర్యాదలు దక్కవచ్చు. అయితే ఈ హోదాలతో వీరు ఎప్పుడైతే రాజకీయ జోక్యాలు మొదలుపెడతారో అప్పటి నుంచి సణుగుడు మొదలవుతుంది. ఇక భూమా తనయుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా తన వయసుకు మించిన రాజకీయంతో ఇప్పటికే వార్తల్లోకి నిలిచాడు. ఈ తీరు ప్రజలు హర్షించేది కాదు! హైదరాబాద్ లో అఖిలప్రియ భర్త, ఆమె తమ్ముడు చేసిన కిడ్నాపింగ్ డ్రామా, పరారీ ఇదంతా పొలిటికల్ గా బాగా డ్యామేజ్ చేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మంచు మనోజ్ కూడా స్థానిక రాజకీయంలోకి చొచ్చుకువస్తే మాత్రం .. భూమా కుటుంబీకుల రాజకీయానికి వేగంగా తెరపడుతుంది.
ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డ, నంద్యాల్లో వీరి కుటుంబాన్ని ఏదో ఒక నియోజకవర్గానికే పరిమితం చేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు ఉండనే ఉన్నాయి.