ఎన్నికల వేళ అత్యంత ఆలస్యంగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేయడంలో.. చంద్రబాబును మించిన వారు లేరు. కొన్ని నియోజకవర్గాల విషయంలో.. ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు టికెట్లు ఆశిస్తోంటే.. వారిలో ఎవ్వరికి ఇవ్వాలో, మిగిలిన వారికి ఎలా సర్దిచెప్పాలో చేతకాక ఆయన తల పట్టుకున్న సందర్భాలు కోకొల్లలు.
ఒకరి కంటె ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేసేసి.. చివరి రోజున బిఫారం ను హెలికాప్టర్ లో పంపిన సందర్భాలు కూడా చంద్రబాబు చరిత్రలో ఉన్నాయి. అలాంటిది.. ఈదఫా 2024 ఎన్నికలకు ఆయన భిన్నంగా ప్రిపేర్ అవుతున్నారు.
2024 ఎన్నికలకు మాత్రం చంద్రబాబు ఇప్పటినుంచే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఈసారి పోటీచేయబోయేది ఫలానా వ్యక్తే అని చంద్రబాబునాయుడు తన పర్యటనల్లో ప్రకటిస్తున్నారు. ఆ మధ్య చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ.. పుంగనూరులో ఈసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించబోయేది చల్లా బాబు అని ప్రకటించారు.
అలాగే తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ.. డోన్ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని ఓడించబోయేది ఈయనే అంటూ అభ్యర్థిని ప్రకటించారు. డోన్ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డిని నిలబెడుతున్నానని, అందరూ కలిసి పనిచేయాలని.. బుగ్గనను ఓడించడానికి సుబ్బారెడ్డి బుల్లెట్ లా దూసుకుపోయి పనిచేస్తారని చంద్రబాబు వెల్లడించారు.
ఇలా వేళ్లమీద లెక్కించగలిగేటన్ని స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు ముందే ప్రకటించడం బాగానే ఉంది. ఇది బాబు తీరుకు భిన్నంగా దూకుడుగా వ్యవహరించడం కింద లెక్క. కానీ ఈ దూకుడు అనబడే అతి.. పార్టీని ముంచేలాగా కనిపిస్తోందని టీడీపీ నాయకులే అంటున్నారు.
కొన్ని చోట్ల అభ్యర్థులను తేలుస్తున్నారు సరే.. అలా తేల్చలేని మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ గురించి పట్టించుకునేది ఎవ్వరు? అనేది అందరిలో మెదలుతున్న ప్రశ్న. పార్టీ ఇన్చార్జి హోదాలో ప్రతి నియోజకవర్గానికి ఒకరు ఉన్నప్పటికీ.. వారికి టికెట్ గ్యారంటీ అనే హామీ ఏమీ లేదు.
చివరి నిమిషంలో చంద్రబాబు ఎలాగైనా మాట మార్చగల నాయకుడే అని అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో అభ్యర్థులను తేల్చి ప్రకటించిన చోట ఓకే.. మిగిలిన చోట్ల అసలు పార్టీని ఎవరు పట్టించుకుంటారు? అనేది ప్రశ్న.
ఎక్కడైనా తేల్చి అభ్యర్థిని ప్రకటించలేదు అంటే గనుక.. అక్కడి ఇన్చార్జికి టికెట్ గ్యారంటీ లేనట్టే అని.. చివరి క్షణంలో అయినా సీన్ మారవచ్చునని వారే అంటున్నారు.
ఆనేపథ్యంలో.. అభ్యర్థిత్వం ఖచ్చితంగా ప్రకటించేదాకా పార్టీ కార్యక్రమాల గురించి ఖర్చు పెట్టడం గురించి పట్టించుకోకుండా ఉండడమే మేలని మిగిలిన చోట్ల పార్టీ నాయకులు అనుకుంటున్నారు. చంద్రబాబు కొత్త శైలి ఆయన పార్టీకే చేటు చేసేలా ఉంది.