తెలుగు జర్నలిజంలో కిరాయి కలానికి పర్యాయ పదం. అలాంటి కలం ‘కిరాయి కథనం’ ఒకటి రాసుకొచ్చింది. పేక్ వార్ కోసం వైసీపీ సైబర్ ఆర్మీని ఏర్పాటు చేసుకుందనేది ఆ కథనం సారాంశం. అధికార పార్టీ కోసం పని చేసే వారంతా కిరాయి సైన్యమంటూ ..ఈ పచ్చదళ కిరాయి సైన్యాధ్యక్షుడి కరపత్రం కల్లు తాగిన కోతిలా ఏవేవో వండివార్చింది. తెలుగు జర్నలిజంలో పెయిడ్ వార్తలకు పేటెంట్ హక్కుల్ని కలిగిన మొట్టమొదటి మీడియా సంస్థగా దానికి పేరు వుంది.
ఎన్నికల్లో పెయిడ్ వార్తల్ని ప్రవేశ పెట్టిన ఘనత ఆ మీడియా సంస్థకే దక్కుతుంది. అలాంటి కిరాయి కలం… వైసీపీపై తన అక్కసును వెళ్లగక్కుతోంది. వైసీపీకి పాజిటివ్‌గా ఎవరేం చెప్పినా అదంతా ‘పెయిడ్’ అంటూ నింద వేస్తూ అపనమ్మకాన్ని కలిగించేందుకు ఎంత ‘పెయిడ్’ వసూలు చేస్తున్నదో సదరు ఎల్లో పత్రికే చెప్పాల్సిన అవసరం వుంది. అయినా ఎన్ని సోషల్ మీడియా సంస్థలైతే, దుష్ప్రచారం చేయడంలో తమకు దీటు వస్తాయో ఆ కిరాయి కలమో చెబితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అసలు జర్నలిజంలో అనైతికతకు, తమకు గిట్టని వారిపై బురద చల్లే చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టిందే తామని సదరు ఎల్లో మీడియా అలియాస్ కిరాయి కలం విస్మరించినట్టుంది. ఈ కిరాయి కలం ఎంతలా దిగజారిందంటే…. ఎన్టీఆర్‌ను కూడా అప్రతిష్టపాలు చేయడానికి వెనుకాడనంతగా. నందమూరి లక్ష్మీపార్వతిని సాకుగా చూపి, ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసే క్రమంలో ఆయనపై ఎల్లో మీడియా వండిన దుర్మార్గ కథనాలు అన్నీఇన్నీ కావు. ఎన్టీఆర్‌ను స్త్రీ లోలుడిగా, కామంధుడిగా చిత్రీకరించి, ఆయన్ను నగ్నంగా నిలబెట్టింది ఈ కిరాయి కలమే కదా!
జర్నలిజం ముసుగులో విశృంఖలత్వం, అక్షర వ్యభిచారానికి పాల్పడుతున్న వైనాన్ని సోషల్ మీడియా దిగంబరంగా నిలబెడుతోందన్న అక్కసుతో మరోసారి ‘వీకెండ్స్’ పత్రిక కిరాయి సైన్యం కథనం ద్వారా చాటుకుంది. నిత్యం ఫేక్ వార్తల్ని వండడమే వృత్తిగా పెట్టుకున్న సదరు ఎల్లో పత్రిక వైసీపీ ఆ పని చేస్తోందని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పత్రిక వాలకం చూస్తే… దొంగే దొంగా, దొంగా అని అరిచిన చందంగా వుంది.
అక్షరమే ఆదాయంగా భావించే సదరు మీడియా సంస్థ…నిజాలు రాస్తే, దాని యజమాని తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం ఉందనే వ్యంగ్య కామెంట్ వుంది. బహుశా ఇది నిజమే అనిపించేలా ఆ పత్రిక, చానల్ కథనాలుంటాయి. ఈ మీడియా ప్రచురించే, ప్రసారం చేసే వార్తల్లో నిజాలనేవి ఎండమావుల్ని తలపిస్తాయి. దీంతో చంద్రబాబుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం …కిరాయి వార్తల్ని రాసి, ప్రసారం చేసినా, జనాన్ని మోసగించలేమని ఎల్లో మీడియాకు భయం పట్టుకున్నట్టైంది.
దీంతో వైసీపీకి సానుకూలంగా సోషల్ మీడియాలో వస్తున్నవి నిజం కాదని, అవన్నీ పెయిడ్ అంటూ కొత్త దుష్ప్రచారానికి కిరాయి కలాలు తెరలేపాయి. కిరాయి పత్రిక రాసిన ప్రకారం …వైసీపీ ఏకంగా 265 యూట్యూబ్ చానెళ్లు, 25 న్యూస్ వెబ్‌సైట్లను వైసీపీ అద్దెకు తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందట! వీటికి రాబోయే 9 నెలల్లో కనీసం 70 కోట్ల రూపాయలు చెల్లించనున్నారట! ఇవాళ కిరాయి కథనంలో పేర్కొన్న ప్రకారం వైసీపీ సైబర్ సైన్యం 17 వేలు.
ఈ లెక్క ప్రకారం టీడీపీ, దాని అనుబంధంగా ఉన్న అన్ని రకాల మీడియా వ్యవస్థల్ని ఎదుర్కోడానికి వైసీపీ సర్వసన్నద్ధం అయ్యింది. ఇది వైసీపీ కోణంలో పాజిటివ్ అంశమే. సోషల్ మీడియా లేని కాలంలో టీడీపీ ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకుని, ప్రత్యర్థులపై నిత్యం దుష్ప్రచారానికి తెగబడేది. టీడీపీకి వ్యతిరేకంగా తమ వాయిస్‌ని వినిపించేందుకు మరో మాధ్యమం లేని కాలంలో ప్రత్యర్థులది అరణ్య రోదనగా మిగిలింది.
ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఆధిపత్యం చెలాయిస్తుండడంతో టీడీపీ , ఎల్లో మీడియా కథనాల వెనుక దురుద్దేశాలు వెంటనే లోకానికి తెలిసిపోతున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలనే చందంగా టీడీపీ, ఎల్లో మీడియాని దీటుగా ఎదుర్కోడానికి వారి పంథానే ఎంచుకున్నారు. టీడీపీ, ఎల్లో మీడియా కంటే బలంగా, శక్తిమంతంగా వారి దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. దీంతో టీడీపీ, ఎల్లో మీడియా గిలగిలా కొట్టుకునే పరిస్థితి.
తటస్థ మీడియా, ప్రజా మీడియా పేరుతో ఇంతకాలం ముసుగులేసుకుని, టీడీపీకి ప్రత్యర్థి పార్టీలు, నాయకులపై దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ, ఎల్లో మీడియానే సోషల్ మీడియాకు టార్గెట్ కావడం కాలం తీసుకొచ్చిన అతి పెద్ద మార్పు. అందుకే కాలం అనేది అందరి సరదాలు తీరుస్తుందని పెద్దలు చెప్పిన మాట ఎంత నిజమో… రామోజీరావు మంచంపై నుంచి ఆవేదనతో అన్నవి నిరూపించింది.
“ప్రతీ ఐదు లేదా పది నిమిషాలకు కార్పొరేట్ ప్రకటనలు వచ్చే చానళ్లకు రూ.10 నుంచి 20 లక్షలు… 15 నిమిషాలపైన వ్యవధిలో ప్రకటనలు వచ్చే వాటికి 510 లక్షలు, చానల్ ఖాతాదారులు 30 లక్షలు, అంతకంటే ఎక్కువగా ఉంటే నెలకు రూ.20 లక్షలపైనే చెల్లిస్తారని సమాచారం” అని రాసుకొచ్చారు. ఏఏ చానళ్లకు ఎంతెంత మొత్తం ఇస్తారో చెప్పిన సదరు కిరాయి కలానికి, ప్రతిరోజు అమ్ముకునే తన అక్షరానికి ఎంత వెల కట్టారో చెబితే బాగుంటుంది.
ఎల్లో పత్రిక, చానల్‌ను అడ్డు పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊరూరా కిరాయి కలాన్ని, కెమెరాను పెట్టుకున్న తాము ఎంత మొత్తం వెనకేసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సాధారణ జర్నలిస్టు ఏకంగా మీడియా అధిపతి అయ్యాడంటే… అక్షరాన్ని నమ్ముకున్నోడికి సాధ్యమయ్యే పని కాదు. కేవలం అక్షరాన్ని అమ్ముకున్నోడు తప్ప, మరొకడు తాను పని చేసిన మీడియానే కొనగలిగే స్థాయికి ఎదగడం సాధ్యమయ్యేది కాదు.
జర్నలిజాన్ని అమ్ముకోవడంలో సిద్ధహస్తుడైన ఎల్లో మీడియా యజమానికి అక్షరం ప్రచురించడానికి, ప్రచురించకపోవడానికి, అలాగే చానల్‌లో చూపించడానికి, చూపించకపోవడానికి కూడా రేటు కట్టడం బాగా తెలుసు. భవిష్యత్‌లో ఇలాంటి కిరాయి కథనాలు మరెన్నో చూడాల్సి వుంటుంది. జగన్‌కు వ్యతిరేకంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడమనే అంశంపై ఒప్పందం కుదుర్చుకుని దిగంబరంగా కథనాలు రాయడానికి, ప్రసారం చేయడానికి సిద్ధమయ్యారు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు జర్నలిజంలో పతివ్రత రాతలు రాస్తున్నారు. తమ చానళ్లలో చూపుతున్నారు. అప్రమత్తంగా వుండాల్సింది సమాజమే.