వైఎస్సార్సీపీ అభ్య‌ర్థుల జాబితా.. ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలో?!

ఏపీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది స‌మ‌యం కూడా లేదు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డానికి ఇంకో ప‌ది నెల‌ల స‌మ‌య‌మే ఉంది. అయితే అంత‌క‌న్నా ముందే కూడా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌నే…

ఏపీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది స‌మ‌యం కూడా లేదు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డానికి ఇంకో ప‌ది నెల‌ల స‌మ‌య‌మే ఉంది. అయితే అంత‌క‌న్నా ముందే కూడా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చార‌మూ జ‌రుగుతూ ఉంది. ముందుస్తుగా అంటే.. దాదాపు ఈ ఏడాది చివ‌ర్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గొచ్చ‌నే టాక్ ఉంది. అదే జ‌రిగితే ఇంకో ఆరు నెల‌ల్లోనే ఎన్నిక‌లు ఉండొచ్చు. మ‌రి ముంద‌స్తు ఉన్నా లేక‌పోయినా.. ఎన్నిక‌ల‌కు ఇంకో ప‌ది నెల‌ల స‌మ‌యం గ‌ట్టిగా ఉంది. ఈ లోపే పార్టీలు అన్ని ఏర్పాట్లూ చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌త్యేకించి అభ్య‌ర్థుల ఖ‌రారు అంశం ఇందులో అతి ప్ర‌ధాన‌మైన‌ది.

అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు అభ్య‌ర్థుల విష‌యంలో ఆలోచించుకోవాల్సిన స‌మ‌యం దాదాపు ఇదే. ఇన్నాళ్లూ ఒక ఎత్తు, ఇక మిగిలిన స‌మ‌యం మ‌రో ఎత్తు. ఇలాంటి నేప‌థ్యంలో ఎవ‌రు ఎక్క‌డి నుంచి బ‌రిలోకి దిగాల‌నే అంశంపై పార్టీల అధిష్టానాలు ఇప్పుడు తేల్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతూ ఉంది. సిట్టింగుల‌ను ప‌క్క‌న పెట్టాల‌న్నా, వారి అసంతృప్తిని చ‌ల్లార్చాల‌న్నా.. ఇదే త‌గిన స‌మ‌యం. పార్టీలు ఇప్ప‌టికే ఆ ప‌నిలో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇందులో నిమ‌గ్న‌మై ఉంద‌ట‌. చాన్నాళ్లుగా ఈ పార్టీ విష‌యంలో ఉన్న ప్రచారం చాలా మంది సిట్టింగుల‌ను ప‌క్క‌న పెడుతుంద‌నేది. 151 మంది ఎమ్మెల్యేల్లో సుమారు న‌ల‌భై మంది సిట్టింగుల‌కు వ‌చ్చేసారి టికెట్ ద‌క్క‌ద‌నే ప్ర‌చారం చాన్నాళ్లుగా సాగుతూ ఉంది. ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ ప్రామాణికాలు ఆయ‌న‌కు ఉన్నాయ‌నే విశ్లేష‌ణా ఉంది. మ‌రి ఇలాంటి మార్పుచేర్పుల విష‌యంలో జ‌గ‌న్ కూడా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డానికీ వెనుకాడ‌టం లేద‌ని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే స్ప‌ష్ట‌మైంది.

అసెంబ్లీ స‌భ్యుల కోటాలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ప్పుడు న‌లుగురు ఎమ్మెల్యేల‌పై వేటు వేసిన సంగ‌తీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ కు మునుపే స‌ద‌రు సిట్టింగుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కేటాయించ‌లేమ‌నే సంగ‌తిని తెలియ‌ప‌రిచిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని వారిలో కొంద‌రు బాహాటంగానే చెప్పారు. ఇలాంటి నేప‌థ్యంలో ఎన్నిక‌ల వ‌ర‌కూ ఏదో ఒక మాట చెప్పి.. చివ‌ర్లో వారికి అస‌లు సంగ‌తిని చెప్ప‌డం క‌న్నా.. జ‌గ‌న్ ముందుగానే వారి స్ప‌ష్ట‌త‌ను ఇస్తున్నార‌నే విష‌యం తేట‌తెల్లం అయ్యింది. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వారికి ద‌క్క‌ద‌నే విష‌యాన్ని ముందుగానే చెప్ప‌డానికి జ‌గ‌న్ వెనుకాడ‌టంల ఏద‌నే స్ప‌ష్ట‌తా వ‌చ్చింది. మ‌రి కేవ‌లం ఆ న‌లుగురికే కాదు.. ఇంకా చాలా మందికి ఈ విష‌యాన్ని సూఛాయ‌గా చెప్పేశార‌నే టాక్ కూడా న‌డుస్తూ ఉంది. వారికి వేరే మార్గాలు, ప్ర‌త్యామ్నాయాల్లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని.. పార్టీ నిల‌బెట్టిన అభ్య‌ర్థి గెలుపుకోసం ప‌ని చేయాల‌నే సూచ‌న సీఎం జ‌గ‌న్ నుంచి అందిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. మ‌రి ఈ మార్పు చేర్పులు ఎలా ఉంటాయంటే.. ఊహ‌కు అంద‌న‌ట్టుగా అనే మాట వినిపిస్తూ ఉంది! 

సిట్టింగుల‌కు టికెట్ నిరాక‌రించ‌డం అంటే.. ఏదో పేరుకు జ‌రిగే ప‌ని కాద‌ని, పార్టీలో కీల‌కం అనుకుంటున్న వారిని, గ‌త ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన వారిని కూడా మార్చ‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. జ‌గ‌న్ చేయ‌బోయే మార్పులు షాకింగ్ లెవ‌ల్లో ఉండేలా ఉన్నాయి విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.

అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా సీట్ల‌నే తీసుకుంటే.. అభ్య‌ర్థిత్వాలు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రీతిలో ఉండ‌బోతున్నాయ‌ట‌. మ‌రి య‌థాత‌థంగా ఇదే జ‌రుగుతుందో లేదో కానీ.. ఒక ప్ర‌చారం ప్ర‌కారం.. అనంత‌పురం జిల్లాలో అభ్య‌ర్థుల జాబితా అదిరిపోయే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. పార్టీలో ఉద్ధండ‌పిండాలు అనుకున్న వారిని కూడా మార్చేస్తార‌ట‌! వారి స్థానంలో సంచ‌ల‌న రీతిలో అభ్య‌ర్థుల‌ను జ‌గ‌న్ తెర‌పైకి తీసుకురానున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది.

రాప్తాడు విష‌యంలో పెనుమార్పు?

రాప్తాడులో గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. తెలుగుదేశం పార్టీ కంచుకోట‌ను బ‌ద్ధ‌లు కొడుతూ తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి విజ‌యం సాధించారు. 2009లో తృటిలో మిస్ అయిన విజ‌యం తోపుదుర్తి కుటుంబాన్ని 2019లో వ‌రించింది. ఇక ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప‌నితీరు ఎలా ఉన్నా.. జ‌గ‌న్ ఇమేజ్ మీదే వ‌చ్చే  ఎన్నిక‌ల్లో విజ‌యం ఆధార‌ప‌డి ఉంది. ప్ర‌త్యేకించి జ‌గన్ ఇమేజ్ తో ప‌ని లేకుండా సొంతంగా గెలిచేంత స్థాయిలో మాత్రం ప్ర‌కాష్ రెడ్డి ఎద‌గ‌లేక‌పోయారు! అనుచ‌ర‌వ‌ర్గం, సొంత క్యాస్ట్ కూడా గ‌తంతో పోలిస్తే ఇప్పుడు అండ‌గా లేదు. 

ప్ర‌కాష్ రెడ్డి కోసం చాలా మంది ఖ‌ర్చులు కూడా పెట్టుకున్నారు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు. అలాంటి వారి ఆద‌ర‌ణ‌ను ఇప్పుడు ప్ర‌కాష్ రెడ్డి క‌లిగి లేరు. ఒక‌వేళ రేప‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రెడ్డి గెలిచినా, ఓడినా అది కేవ‌లం జ‌గ‌న్ ఇమేజ్ మీదే న‌డవాలి. జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు ఫ‌ల‌ప్ర‌దంఅ యితే ప్ర‌కాష్ రెడ్డికి విజ‌యం ద‌క్కుతుంది, లేక‌పోతే లేదు. ఇందులో ఇంత‌క‌న్నా విశ్లేష‌ణ లేదు. మ‌రి ఈ సీటు విష‌యంలో జ‌గ‌న్ అభ్య‌ర్థి మార్పు చేయ‌బోతున్నార‌నేది టాక్! అది కూడా బోయ గిరిజ‌మ్మ‌ను రాప్తాడు నుంచి నిల‌బెట్ట‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది.

ముప్పై యేళ్ల వ‌య‌సున్న ఈ బీసీ మ‌హిళ‌ను రెండేళ్ల కింద‌ట సంచ‌ల‌న రీతిలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌డ్పీ చైర్మ‌న్ గా చేశారు. అనంత‌పురం ప‌రిస‌ర ప్రాంతానికి చెందిన  గిరిజ‌మ్మ ఇంటి పేరును బ‌ట్టి బోయ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి అని స్ప‌ష్టం అవుతోంది. చిన్న వ‌య‌సులోనే రాజ‌కీయాల ప‌ట్ల ఆక‌ర్షితురాలైన గిరిజ‌మ్మ జ‌డ్పీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ గా ప‌ని చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ల‌పై దూకుడైన పోరాటాల‌కు కేరాఫ్ అయ్యారు. ఈ ధోర‌ణి ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది. 

అనంత‌పురం జ‌డ్పీ చైర్మ‌న్ ను చేసింది. మ‌రి అదే సంచ‌ల‌నం అనుకుంటే. .ఇప్పుడు రాప్తాడు టికెట్ ను గ‌నుక జ‌గ‌న్ ఆమెకు కేటాయిస్తే అది మ‌రింత పెనుసంచ‌ల‌నం అవుతుంది. ముప్పై యేళ్ల‌కు పై నుంచినే రాజకీయాల్లో ఉన్న తోపుదుర్తి ఫ్యామిలీకి ప్ర‌త్యామ్నాయంగా ముప్పై యేళ్ల వ‌య‌సున్న బోయ గిరిజ‌మ్మ‌ను జ‌గ‌న్ తెర‌పైకి తెస్తే.. ఆమె గెలిచినా ఓడినా అదో ఆస‌క్తిదాయ‌క‌మైన పొలిటిక‌ల్ మూవ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాప్తాడు నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిటాల కుటుంబ‌మే పోటీ లో ఉంటుంది. ఇలాంటి నేప‌థ్యంలో ఒక సాధార‌ణ బోయ మ‌హిళ వారిని ఢీ కొట్టాల్సి ఉంటుంది. 

నియోజ‌క‌వ‌ర్గంలో బోయ‌ల జ‌నాభాకు లోటేమీ లేదు. కురుబ‌, బోయ సామాజిక‌వ‌ర్గాల జ‌నాభా ఎక్కువ‌. ఆ త‌ర్వాత రెడ్లు. ప్ర‌కాష్ రెడ్డిపై రెడ్ల‌కు కూడా మునుప‌టి ఆద‌ర‌ణ లేదనేది బ‌హిరంగ స‌త్యం. గెలుపోట‌ముల విశ్లేష‌ణ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక బ‌డుగు కుటుంబానికి చెందిన మ‌హిళ‌ను రాప్తాడు బ‌రిలో నిలిపితే జ‌గ‌న్ రేపే రాజ‌కీయ సంచ‌ల‌నాల్లో ఒక‌ట‌వుతుంది అది.

క్లీన్ పొలిటిక‌ల్ ఫ్యామిలీకి అవ‌కాశం?

జ‌ర‌గ‌బోయే మార్పుల్లో మ‌రోటి పుట్ట‌ప‌ర్తిలో ఉండ‌వ‌చ్చ‌నేది టాక్. ఇక్క‌డ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో ఒక క్లీన్ పొలిటిక‌ల్ ఫ్యామిలీ ఉండేది. అదే పాముదుర్తి కుటుంబం. పాముదుర్తి బ‌య‌ప‌రెడ్డి హిందూపురం ఎంపీగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత పాముదుర్తి ర‌వీంద్ర‌రెడ్డి గోరంట్ల నుంచి ఎమ్మెల్యేగా విజ‌యాల‌ను న‌మోదు చేశారు. చివ‌రిసారి పాముదుర్తి ర‌వీంద్ర రెడ్డి 2004లో గోరంట్ల నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తెలుగుదేశం అభ్య‌ర్థి నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌పై ర‌వీంద్ర‌రెడ్డి విజ‌యం సాధించారు. 2009 నాటికి గోరంట్ల నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్దైంది.

దాని స్థానంలో పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం తెర‌పైకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ త‌ర‌ఫు నుంచి క‌డ‌ప‌ల మోహ‌న్ రెడ్డి పుట్ట‌ప‌ర్తి అభ్య‌ర్థి అయ్యారు. అలా సుదీర్ఘ నేప‌థ్యం ఉన్న పాముదుర్తి ఫ్యామిలీ పొలిటిక‌ల్ గా తెర‌మ‌రుగు అయ్యింది. రాజ‌కీయ అవినీతి మ‌కిలి అంట‌ని కుటుంబ‌గా పాముదుర్తి ఫ్యామిలీకి మంచి పేరు ఇప్ప‌టికీ ఉంది. ఊహాగానాల ప్ర‌కారం పాముదుర్తి ఫ్యామిలీకి ఈ సారి అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌ని టాక్. ర‌వీంద్ర రెడ్డి త‌న‌యుడు ఇంద్ర‌జిత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 

ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధ‌ర్ రెడ్డి స్థానంలో ఇంద్ర‌జిత్ కు అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌ని ప్ర‌చారం జరుగుతోంది. ఇది కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ ఊహ‌కు అంద‌ని వ్య‌వ‌హార‌మే! ప్ర‌స్తుతం ఇంద్ర‌జిత్ రెడ్డి బుక్క‌ప‌ట్నం మండ‌లం ఎంపీటీసీగా ఉన్నారు. అటు క‌డ‌ప‌ల కుటుంబం, మ‌రోవైపు 2014 లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి ఓడిన సోమ‌శేఖ‌ర్ రెడ్డి కూడా ఆశావ‌హుడే. అయితే వారి కన్నా ఇప్పుడు అనూహ్యంగా పాముదుర్తి కుటుంబం పేరు వినిపిస్తోంది!

కేవ‌లం ఇవి మాత్రామే కాదు మ‌రిన్ని మార్పులు కూడా ఉండ‌వ‌చ్చ‌నే టాక్ న‌డుస్తోంది. హిందూపురం ఎంపీ స్థానం నుంచి ఇక్బాల్ కు అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌ని, అనంత‌పురం ఎంపీ స్థానం నుంచి ప్ర‌స్తుత క‌ల్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌ర‌ణ్ పోటీ చేయ‌వ‌చ్చ‌ని స‌మాచారం. ప్ర‌స్తుత అనంత‌పురం ఎంపీ త‌లారి రంగ‌య్య ను క‌ల్యాణ‌దుర్గం పంపుతార‌ట‌. 

ఇక క‌చ్చితంగా టికెట్ పొందే సిట్టింగుల్లో ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి, తాడిప‌త్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి మాత్ర‌మే అని ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. అనంత‌పురం నుంచి అనంత‌వెంక‌ట్రామిరెడ్డి స్థానంలో వేరే అభ్య‌ర్థి తెర‌పైకి రావొచ్చ‌ని తెలుస్తోంది. ఉర‌వ‌కొండ‌, క‌దిరి, రాయ‌దుర్గం, పెనుకొండ‌, హిందూపురం, మ‌డ‌క‌శిర‌, గుంత‌క‌ల్ ఈ అసెంబ్లీ స్థానాల‌న్నింటిలోనూ కొత్త‌వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీలో ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. 14 అసెంబ్లీ సీట్ల‌కు గానూ 12 సీట్ల‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో నెగ్గింది. 12 మంది న‌లుగురైదుగురు సిట్టింగుల‌కు కూడా సీట్లు కేటాయిస్తార‌ని.. మిగ‌తా స్థానాల్లో అభ్య‌ర్థులు మారిపోయే అవ‌కాశాలే ఎక్కువ‌నేది స‌మాచారం. 

గ‌త ఎన్నిక‌ల్లో బీసీల‌కు మంచి ప్రాధాన్య‌త‌ను ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ల‌బ్ధి పొందింది. అనంత‌పురం ఎంపీ సీటు, హిందూపురం ఎంపీ సీటు బీసీల‌కు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కురుబ‌, బోయ‌ల‌కు మంచి ప్రాధాన్య‌త‌ను ఇచ్చింది. ఈ సారి ఆ ప్రాధాన్య‌త‌ను మ‌రింత పెంచే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. వ‌చ్చిన అవ‌కాశాన్ని దుర్వినియోగం చేసుకున్న బీసీ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేందుకు కూడా జ‌గ‌న్ వెనుకాడ‌టం లేద‌ని తెలుస్తోంది. అందులో భాగంగా ఒక సిట్టింగ్ ఎంపీకి జిల్లాలో ఎలాంటి అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. అలాగే బీసీ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కూడా కొత్త బీసీలు తెర‌పైకి రావొచ్చ‌ని టాక్.