ఉత్తరాంధ్రలో మోగిన వైసీపీ శంఖారావం… రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతోంది. ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన వైసీపీ ఎన్నికల సన్నాహక భారీ సభలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల యుద్ధానికి తాను సిద్ధమంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. వైసీపీ శ్రేణుల నుంచి భారీగా స్పందన వచ్చింది. తాము సైతం మీ వెంటే యుద్ధ క్షేత్రంలో ప్రత్యర్థులతో పోరాడుతామని నలుదిక్కులు ప్రతిధ్వనించేలా అరిచారు. దీంతో జగన్ ప్రసంగం ఆద్యంతం అత్యంత ఉద్వేగభరిత వాతావరణంలో సాగింది.
సిద్ధమా…మరో చారిత్రిక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్‌ను మరింతగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని గెలిపించేందుకు మీరంతా సిద్ధమేనా? అని జగన్ ప్రశ్నించినప్పుడు.. జనం నుంచి సిద్ధమంటూ పిడికిళ్లు బిగించి నినదించారు. దుష్టచతుష్టయం మీద, మహా సంగ్రామానికి మీరంతా సిద్ధమేనా? అని జగన్ ప్రశ్నించగా.. సిద్ధమంటూ రెట్టించిన ఉత్సాహంతో అరిచారు. ఈ సందర్భంగా సీఎం… సీఎం అంటూ వైసీపీ శ్రేణులు నినదించడంతో సభా ప్రాంగణం అంతా కాసేపు మార్మోగింది.
రామాయణం, మహాభారతంలోని విలన్లంతా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి రూపంలో ఉన్నారని జగన్ విమర్శించారు. అలాగే ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టులు, తోడేళ్లు ఏకమై …మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకుని రెడీగా ఉన్నారన్నారు. వారి వైపు నుంచి చూస్తే జగన్ ఒంటరి వాడిగా కనిపిస్తాడన్నారు. కానీ ఇక్కడ కనిపిస్తున్నదే నిజం అంటూ అశేష జనసందోహాన్ని జగన్ చూపడం విశేషం. ఇది అసలు సీన్ అని ఆయన ఉత్సాహంగా తన పార్టీ శ్రేణులు చూపిస్తూ మురిసిపోయారు. ఇన్ని కోట్ల మంది హృదయాల్లో జగన్ వున్నాడనేది నిజం అని ఆయన గొప్పగా చెప్పారు.
జగన్ ఏనాడూ ఒంటరి కాదని అన్నారు. ప్రత్యర్థుల సైన్యం పొత్తులు, ఎల్లో పత్రికలు, టీవీలు అని ఆయన చెప్పారు. కానీ తనకున్న తోడు ఏమిటంటే… “నా ధైర్యం, నా బలం” అని గర్వంగా చెప్పారు. పైనున్న దేవుడు, మీరంతా గుండెల్లో పెట్టుకోవడమే తన తోడుగా జగన్ చెప్పారు. ఇది నాయకుడి మీద నమ్మకం నుంచి పుట్టిన సైన్యంగా ఆయన అభివర్ణించారు. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే స్పందన, ప్రేమ ఎలా వుంటుందనేందుకు ఇదే నిదర్శనం అని ఆయన అన్నారు.
జరగబోయే ఎన్నికల క్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు(వైసీపీ శ్రేణులు), అర్జునుడిని నేను, మన ప్రభుత్వం చేసిన మంచి పనులే అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద పడదామని జగన్ పిలుపు ఇచ్చారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికి మనం చేస్తున్న మంచితనం, అభివృద్ధి మీద అని ప్రజానీకాన్ని ఆలోచింపజేశారు.
రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి తాను ముఖ్యమంత్రి అయ్యాక, మన వైసీపీ ప్రభుత్వం వచ్చాక మాత్రమే అని పదేపదే జగన్ చెప్పారు. కానీ కళ్లున్నా ఈర్ష్యతో ఉన్న ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదన్నారు. అబద్ధాల పునాదుల మీద ప్రత్యర్థులు ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు.
ఈ ఎన్నికలు ఎందుకంత ముఖ్యమో ఇంటింటికి వెళ్లి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేవి కాదన్నారు. ఈ ఎన్నికలు 57 నెలలుగా రాష్ట్రంలో అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్‌ని నిర్ణయించేవిగా ఆయన అభివర్ణించారు. ప్రతి అవ్వాతాత, ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి ప్రాంతం, ప్రతి రైతన్న భవిష్యత్ ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని గ్రహించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
57 నెలల కాలంలో జగనన్న మనకోసం 124 సార్లు బటన్ నొక్కాడని, జగనన్న కోసం మనం ఒక్కసారి కేవలం రెండు బటన్లు నొక్కలేమా? అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు. జగన్‌కు ఓటు వేయకపోవడమూ అంటే , ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే సంక్షేమ పథకాల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టు అవుతుందని ఇంటింటికి వెళ్లి చెప్పాలని జగన్ కోరారు.
ఒకవేళ ప్రతిపక్షాలకు ఓటు వేస్తే గత ఎన్నికల్లో పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని జగన్ హెచ్చరించారు. సైకిల్ ఎక్కి టీ గ్లాస్ (జనసేన గుర్తు) పట్టుకుని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ప్రతి ఇంటికీ వస్తుందని ఆయన వెటకరిస్తూ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. అబద్ధాలు, మోసాలతో ఓ డ్రాక్యులా మాదిరి తలుపు తట్టి ప్రజల రక్తం తాగుతుందని అన్నారు. 2024 ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే ఆ చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదన్నారు. చంద్ర గ్రహణాలు ఉండవన్నారు.