ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు వైసీపీ నుంచి కౌంట‌ర్ ఏదీ?

క‌నుచూపు మేర‌లో ఎన్నిక‌లున్న వేళ ప్ర‌తిప‌క్షాల నేత‌ల రోడ్లెక్కి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు దీటుగా కౌంట‌ర్ ఇచ్చే నాయ‌కులు వైసీపీలో క‌నిపించ‌డం లేదు. ఇదే తెలంగాణ‌లో గ‌మ‌నిస్తే… కేసీఆర్…

క‌నుచూపు మేర‌లో ఎన్నిక‌లున్న వేళ ప్ర‌తిప‌క్షాల నేత‌ల రోడ్లెక్కి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు దీటుగా కౌంట‌ర్ ఇచ్చే నాయ‌కులు వైసీపీలో క‌నిపించ‌డం లేదు. ఇదే తెలంగాణ‌లో గ‌మ‌నిస్తే… కేసీఆర్ ఇంటి నుంచి బ‌య‌టికి రాక‌పోయినా, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌, మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు, ఇలా చాలా మంది నాయ‌కులే క‌నిపిస్తారు. వైసీపీ ఖర్మేమో గానీ, ప్ర‌తిప‌క్షాల విమర్శ‌లు జ‌నాల్లోకి పోతుంటే, చేసిన మంచి కూడా చెప్పుకోలేని ద‌య‌నీయ స్థితిలో అధికార పార్టీ వుంది.

జ‌గ‌న్‌ది రాక్ష‌స పాల‌న‌, త‌న‌ది దేవ‌త‌ల పాల‌న‌గా చంద్ర‌బాబు మంచినీళ్లు తాగినంత సులువుగా చెబుతున్నారు. అయ్యా బాబూ… మీది రాక్ష‌స పాల‌న కాబ‌ట్టే ఘోరంగా ఓడించార‌ని అధికార ప‌క్షం నుంచి దీటైన కౌంట‌ర్ కొర‌వ‌డింది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌న రాతియుగాన్ని త‌ల‌పిస్తోంద‌ని, స్వ‌ర్ణ‌యుగం రావాలంటే టీడీపీ-జ‌నసేన పాల‌న రావాల‌ని చంద్ర‌బాబు ప్ర‌జ‌లకు అప్పీల్ చేస్తున్నారు. ర‌ద్దులు, గుద్దులు, నొక్కుడు, బొక్కుడు, కూల్చివేత‌లు, దాడులు, అక్ర‌మ కేసులు మిన‌హాయిస్తే, జ‌గ‌న్ పాల‌న‌లో ఏముంద‌ని చంద్ర‌బాబు నిలదీత‌కు స‌రైన స‌మాధానం అధికార ప‌క్షం నుంచి లేదు.

ఇదే జ‌గ‌న్ ఒక్క విమ‌ర్శ చేసినా, వెంట‌నే చంద్రబాబు గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఇటీవ‌ల ఒక స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ త‌న కుటుంబంలో చిచ్చు పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చారు. మీ ఇంట్లో గొడ‌వ‌లకు ఇత‌రుల మీద ప‌డి ఏడ‌వ‌డం ఏంటో అర్థం కాద‌ని చుర‌క‌లు అంటించారు. ప‌నిలో ప‌నిగా మ‌రికొన్ని విమ‌ర్శ‌లు కూడా చేశారు. వివేకా హ‌త్య కేసులో అస‌లు నిందితుల‌ను కాపాడుతూ, ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల‌పై కేసులు పెట్టించార‌ని ఆరోపించారు.

వివేకా కుమార్తె సునీత‌ను వేధిస్తున్నార‌ని, రేపోమాపో సొంత చెల్లెలు ష‌ర్మిల‌పై కూడా కేసు పెట్టినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని విమ‌ర్శించారు. చివ‌రికి రాయ‌ల‌సీమ ద్రోహి జ‌గ‌న్ అంటూ, తాను హీరోగా ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్ప‌ని చంద్ర‌బాబు, తాను ఆ ప‌రిశ్ర‌మ‌ను ప్రారంభిస్తే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ప‌నులు ముందుకు సాగ‌డం లేద‌ని విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

సీమ సాగునీటి స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకున్న ఏకైక నాయ‌కుడు ఎన్టీఆర్ మాత్ర‌మే అని చెప్ప‌డం ద్వారా, దివంగ‌త వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రాజెక్టుల గురించి మ‌రిచిపోయేలా బాబు ఎత్తుగ‌డ వేశారు. సీమ‌కు వైఎస్సార్ హ‌యాంలో ఏం జ‌రిగిందో అధికార ప‌క్షం నుంచి దీటుగా చెప్పేవాళ్లు క‌రువ‌య్యారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యాన్ని వైఎస్సార్ పెంచ‌గా, చంద్ర‌బాబు అడ్డుకున్నార‌నే వాస్త‌వాల్ని ఎవ‌రు చెప్పాలి? ఎందుకుంటే ఇది రాయ‌ల‌సీమ‌కు ప్రాణంతో స‌మానం. అలాంటి గొప్ప ప‌ని వైఎస్సార్ చేశార‌ని, దాన్ని మ‌రింత‌గా అభివృద్ధి చేయాల‌ని జ‌గ‌న్ సంక‌ల్పించార‌నే సంగ‌తుల్ని ఎవ‌రు చెప్పాలి?

ఇదే సంద‌ర్భంలో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి, లోకేశ్, అచ్చెన్నాయుడు త‌దిత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల విమ‌ర్శ‌లు అద‌నం. అంద‌రి నోట జ‌గ‌న్ రాక్ష‌స పాల‌న సాగిస్తున్నార‌నే.

సీఎం జ‌గ‌న్ మాత్రం ఇంత కాలం ప‌రిపాల‌న అంటూ తాడేప‌ల్లి నివాసానికే ప‌రిమితం అయ్యారు. ఇప్పుడు అభ్య‌ర్థుల ఎంపిక పేరుతో బ‌య‌టికి రావ‌డం లేదు. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు మాత్రం య‌థేచ్ఛ‌గా సాగిపోతున్నాయి. అంద‌రికీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డే స‌మాధానం చెబుతున్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు స‌జ్జ‌ల కౌంట‌ర్ ఇస్తే, జ‌నంలోకి ఏ మేర‌కు పోతుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఏపీలో ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిస్థితులు ఇట్లున్నాయి.

ప్ర‌తిప‌క్షాల నోళ్లు మూయించేలా త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ నోరు తెర‌వాల‌ని వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. క‌నీసం రానున్న రోజుల్లో అయినా వారి కోరిక నెర‌వేరుతుంద‌ని ఆశిద్దాం.