ప్రస్తుతం తెలంగాణ అంతటా అభయహస్తం ట్రెండ్ నడుస్తోంది. ఎవ్వర్ని కదిపినా 6 గ్యారెంటీలకు అప్లయ్ చేశావా లేదా అనే ఎంక్వయిరీ మాత్రమే వినిపిస్తోంది. రేషన్ కార్డులు, ఓటర్ కార్డులతో ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రజలంతా అభయహస్తం అప్లికేషన్లతో కనిపిస్తున్నారు.
సరిగ్గా ఈ ట్రెండ్ ను తమ మోసాలకు ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యారు సైబర్ కేటుగాళ్లు. అనుకోవడమే కాదు, ఆల్రెడీ అమల్లో పెట్టారు కూడా. తెలంగాణలో చాలామందికి ఇప్పుడు కొన్ని కాల్స్ వస్తున్నాయి. అవేంటంటే.. మీ అభయహస్తం అప్లికేషన్ ప్రాసెస్ అయింది, 6 గ్యారెంటీలకు మీరు అర్హత సాధించారంటూ అట్నుంచి వాయిస్ వినిపిస్తోంది.
అప్లికేషన్ ను చివరిదశలో ప్రాసెస్ చేయాలంటే ఓటీపీ చెప్పాలని, ఆ ఓటీపీ చెబితే అభయహస్తం 6 గ్యారెంటీలు అందుకోవచ్చంటూ చెబుతున్నారు. అయితే ఇది అభయహస్తం కాదు, సైబర్ మోసం. ఓటీపీ చెబితే అంతే సంగతులు.
ఈమధ్య ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో కొంతమందికి ఈ తరహా కాల్స్ వచ్చాయి. చాలామంది ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగానే ఉన్నారు. కొంతమంది మాత్రం ఓటీపీలు చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. మరికొన్ని జిల్లాలో అభయహస్తం పేరిట లింక్స్ వస్తున్నాయి. ఆ లింక్ పై క్లిక్ చేసి వివరాలు నింపితే, నేరుగా ఇంటికే అభయహస్తం పేరిట కార్డ్ వస్తుందని చెబుతున్నారు. కొంతమంది ఈ లింక్స్ క్లిక్ చేసి మోసపోతున్నారు.
ఈ మోసాలపై అధికారులు, పోలీసులు స్పందించారు. అభయహస్తం పేరిట ఓటీపీలు చెప్పమని, లింక్స్ క్లిక్ చేయమని అడిగే కాల్స్ కు స్పందించొద్దని పోలీసులు చెబుతున్నారు. అటు అధికారులు కూడా అభయహస్తం అప్లికేషన్లను అన్ లైన్ చేసే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, ఆన్ లైన్ లోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి కాల్స్ రావనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు.