ఆంధ్ర‌జ్యోతిది అదో తుత్తి…

ఏపీ సీఐడీ పోలీసులు న‌మోదు చేసిన రాజ‌ద్రోహం కేసుకు సంబంధించి ఆంధ్ర‌జ్యోతి రాత‌లు చ‌దివితే…కింద ప‌డ్డా త‌మ‌దే పైచేయి  అన్న‌ట్టుంది. కేసు విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టులో ఊహించినంత‌గా ఊర‌ట ల‌భించిక‌పోయినా, విజ‌యం సాధించిన‌ట్టు ప్ర‌చారం…

ఏపీ సీఐడీ పోలీసులు న‌మోదు చేసిన రాజ‌ద్రోహం కేసుకు సంబంధించి ఆంధ్ర‌జ్యోతి రాత‌లు చ‌దివితే…కింద ప‌డ్డా త‌మ‌దే పైచేయి  అన్న‌ట్టుంది. కేసు విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టులో ఊహించినంత‌గా ఊర‌ట ల‌భించిక‌పోయినా, విజ‌యం సాధించిన‌ట్టు ప్ర‌చారం చేసుకోవ‌డం ఆ రెండు ఎల్లో చాన‌ళ్ల‌కు, ఆంధ్ర‌జ్యోతికే చెల్లింది. 

‘రాజద్రోహం లెక్క తేలుస్తాం’  అనే బ్యాన‌ర్ శీర్షిక‌తో ప్ర‌చురించిన క‌థ‌నాన్ని చ‌దివితే…క‌మెడియ‌న్ ఏవీఎస్ పాపుల‌ర్ డైలాగ్ ‘అదో తుత్తి’ గుర్తు రాకుండా ఉండ‌దు. కేసు వివ‌రాల‌ను, సుప్రీంకోర్టు ఆదేశాల‌ను తెలుసుకుంటే ఎవ‌రైనా ఆంధ్ర‌జ్యోతి స‌మ‌ర్థ‌న‌పై ఓ అంచ‌నాకు రావ‌చ్చు.

సీఐడీ త‌మ‌పై న‌మోదు చేసిన రాజ‌ద్రోహం కేసును కొట్టి వేయ‌డంతో పాటు ఈ కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల‌న్నీ నిలిపివేస్తూ మ‌ధ్యం త‌ర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఏబీఎన్‌, టీవీ5 సుప్రీంకోర్టులో వేర్వేరుగా దాఖ‌లు చేసిన వ్యాజ్యాల‌పై సోమ‌వారం విచార‌ణ జ‌రిగింది. ఇందులో భాగంగా గ‌త కొంత‌కాలంగా దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో మీడియా సంస్థ‌ల‌పై న‌మోదు అవుతున్న రాజ‌ద్రోహం కేసుల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇందులో భాగంగా  జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  

మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛ కోణంలో ‘రాజద్రోహం’ కేసులు మోపడానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది. ఐపీసీ సెక్షన్‌ 124ఏ (రాజద్రోహం), 153 (వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం), 505 (ప్రజలను భయాందోళనలకు గురి చేయడం)ల పరిధిని, పరిమితిని స్పష్టీకరిస్తూ తగిన భాష్యం చెబుతామని ప్రకటించింది .

‘వార్తలు, కథనాలు ప్రసారం చేయడం టీవీ చానళ్ల హక్కు. ఆ ప్రసారాలను రాజద్రోహంగా పరిగణించలేం. ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శా రాజద్రోహం కిందకు రాదు. ఏబీఎన్‌, టీవీ5పై పెట్టిన కేసును పరిశీలిస్తే… మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరిగిందని ప్రాథమికంగా స్పష్టమవుతోంది’ అని సుప్రీంకోర్టు అన్న‌ట్టు ఆంధ్ర‌జ్యోతిలో రాసుకొచ్చారు.

రాజ‌ద్రోహం కేసుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల‌ను బ్యాన‌ర్ చేసిన ఆంధ్ర‌జ్యోతి, త‌మ‌పై న‌మోదైన ఆ కేసును ఎత్తివేయ‌డానికి నిరాక‌రించ‌డంపై స‌న్నాయి నొక్క‌డం గ‌మ‌నార్హం. దర్యాప్తుపై స్టే విధించాలని ఏబీఎన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరగా అందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించిన‌ట్టు ఆవేద‌న‌తో రాసుకొచ్చారు. 

కేవ‌లం  ఆ చాన‌ళ్లు , సంబంధిత వ్య‌క్తుల విష‌యంలో త‌దుప‌రి బ‌ల‌వంత‌పు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని సీఐడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు స్టే నిరాక‌రించిన నేప‌థ్యంలో ద‌ర్యాప్తు య‌థాత‌థంగా జ‌రగ‌నుంది. ఏ ఉప‌శ‌మ‌నం కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారో, అది ఆ రెండు చాన‌ళ్ల‌కు ద‌క్క‌లేదు. అంటే సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 

కేవ‌లం అరెస్ట్‌ల నుంచి ఊర‌టే త‌ప్ప‌, విచార‌ణ నుంచి కాద‌నేది సుస్ప‌ష్టం. ర‌ఘురామ‌కృష్ణంరాజు కేసులో ఆ రెండు చాన‌ళ్ల ప్ర‌తినిధులు ఏపీ సీఐడీ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కాక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింది. చివ‌రికి దేశ వ్యాప్తంగా న‌మోద‌వు తున్న రాజ‌ద్రోహం కేసుల‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్య‌ల‌తో ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్‌, టీవీ5 సంతృప్తి ప‌డాల్సి వ‌చ్చింది. 

మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరిగిందని ప్రాథమికంగా స్ప‌ష్ట‌మ‌వుతోంద‌నే సుప్రీంకోర్టు వ్యాఖ్య‌తో స్టే పొందినంత ఆనందాన్ని అనుభూతి చెందాల్సి వ‌చ్చింది.