గౌతు ఫ్యామిలీకి సిసలైన సవాల్

శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న ఫ్యామిలీకి పేరుంది. వారిది రాజకీయ కుటుంబం. ఇక గౌతు లచ్చన్న అంటే దేశమంతా ఎరిగిన బీసీ నాయకుడు. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న యోధుడు. సర్దార్ బిరుదు దక్షిణాదిన పొందిన…

శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న ఫ్యామిలీకి పేరుంది. వారిది రాజకీయ కుటుంబం. ఇక గౌతు లచ్చన్న అంటే దేశమంతా ఎరిగిన బీసీ నాయకుడు. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న యోధుడు. సర్దార్ బిరుదు దక్షిణాదిన పొందిన ఏకైక నాయకుడు ఆయన కృషీకార్ పార్టీ తరఫున 1951 నుంచి 1972 దాకా ఇరవై ఒక్క ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఏకధాటిగా నెగ్గారు.

ఇక ఆయన చివరిసారిగా 1978లో జనతా పార్టీ తరఫున అదే సోంపేట నుంచి అయిదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన కుమారుడు గౌతు శ్యామ సుందర శివాజీ అదే సోంపేట నుంచి 1985తో మొదలుపెట్టి 2004 దాకా 24 ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా అయిదు దఫాల పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఇక 2009ల అసెంబ్లీ సీట్ల పునర్ విభజనలో గౌతు ఫ్యామిలీ షిఫ్ట్ అయింది.

అయితే 2009 ఎన్నికల్లో పలాసాలో గౌతు శివాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జుట్టు జగన్నాయకులు చేతిలో ఓటమి పాలు అయ్యారు. 2014లో మాత్రం వైసీపీ మీద శివాజీ గెలిచారు. ఇక 2019 ఎన్నికల వేళ గౌతు శ్యామ సుందర శివాజీ కూతురు గౌతు శిరీష పోటీ చేస్తే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన లోకల్ డాక్టర్ సీదరి అప్పలరాజు 16 వేల ఓట్ల భారీ తేడాతో ఓడించారు

అది లగాయితూ మూడేళ్ళుగా డాక్టర్ గారు పలాసాలో బాగానే పాతుకుపోయారు. అక్కడ ఆయన సామాజికవర్గమైన మత్య్సకారులు ఎక్కువ. పైగా డాక్టర్ అప్పలరాజు జోరు పెంచి మరీ పలాసాలో వైసీపీని పటిష్టం చేశారు.ఇక ఆయన చేతిలో మంత్రి పదవి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయనే గెలుస్తారు అని అంటున్నారు.

దానికి తోడు అసలే పలాసాలో టీడీపీకి పట్టు తక్కువ. ఇపుడు సీదరి వల్ల తమ ఉనికికి ముప్పు వస్తుందేమో అన్న ఆందోళనతోనే పలాసాకు టీడీపీ చినబాబు అయిన లోకేష్ కూడా వచ్చేలా సీన్ క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక పలాసాలో అడ్డూ అదుపూ లేకుండా ప్రభుత్వ స్థలాలు భూములు ఆక్రమణలు చోటు చేసుకున్నాయని, వాటిని అన్నింటినీ కూకటి వెళ్ళతో పెకిలిస్తామని మంత్రి గారు అంటున్నారు.

తమ వారు ఎవరైనా ఉంటే టీడీపీ నేతలు ఆ లిస్ట్ ఇస్తే బుల్డోజర్లు అక్కడ కూడా పంపిస్తామని ఆయన క్లారిటీగానే సవాల్ చేస్తున్నారు. పలాసాలో పసుపు పార్టీ కాంతులు మసకబారడంతోనే రాజకీయ దుమారం రేపి లబ్ది పొందాలని చూస్తున్నారు అనే మంత్రి గారి వర్గీయులు అంటున్నారు. ఏతా వాతా చూస్తే  గౌతు ఫ్యామిలీకి మూడవతరంలో సవాల్ సీదరి అప్పలరాజు గారి రూపంలో ఎదురైంది అని అంటున్నారు.