అచ్చెన్నకు చాన్స్ వచ్చెన్ !

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడుకు ఇపుడు బాధ్యత‌ పెరిగింది. ఇంతకాలం ఆయన ఆ పోస్టులో ఉన్నా శ్రీకాకుళం జిల్లాకే ఎక్కువగా పరిమితం అయిపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. అదే టైం లో ఆయనకు…

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడుకు ఇపుడు బాధ్యత‌ పెరిగింది. ఇంతకాలం ఆయన ఆ పోస్టులో ఉన్నా శ్రీకాకుళం జిల్లాకే ఎక్కువగా పరిమితం అయిపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. అదే టైం లో ఆయనకు ఆ చాన్స్ రానీయకుండా చంద్రబాబు లోకేష్ బాబు ఏపీ అంతటా తిరుగుతున్నారు. తండ్రీ తనయులు ఇద్దరూ ఒకరు జాతీయ ప్రెసిడెంట్, మరొకరు జాతీయ ప్రధాన కార్యదర్శి.

ఏపీ ప్రెసిడెంట్ సంగతేంటి అంటే పెద్దగా  ఏమీ లేదు అనే అంటూ వచ్చారు. ఇపుడు జాతీయ అధ్యక్షుడు జైలుపాలు అయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా రాజమండ్రిలోనే ఉంటూ తండ్రిని బెయిల్ మీద తీసుకుని వచ్చే పనిలో ఉన్నారని అంటున్నారు.

ఏపీలో పార్టీని నడిపించాలంటే నాయకుడు కావాలి. ఆ నాయకుడిని ఆల్ రెడీ చంద్రబాబే నియమించారు. అలా అచ్చెన్నాయుడుకు చాన్స్ వచ్చెన్ అని అంటున్నారు. ఆయన విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలసి వినతిపత్రం సమర్పించారు. బాబుని అకారణంగా అరెస్ట్ చేశారని ఫిర్యాదు చేశారు. బయటకు వచ్చి మీడియా ముందు చాలా విషయాలే మాట్లాడారు. బాబు అరెస్ట్ వైసీపీని మరణశాసనం అన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు. జనసేనతో కలసి తాము పోటీ చేస్తామని చెప్పారు.

రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇలా బోలెడు విషయాలు మీడియాకు చెప్పిన అచ్చెన్న చంద్రబాబు వంటి నిజాయతీపరుడైన నేత మరొకరు లేరని కితాబు ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో టీడీపీకి ఇపుడు స్ట్రాంగ్ లీడర్ షిప్ కావాలి. బీసీ నేత ఉత్తరాంధ్రా వంటి వెనకబడిన జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చెన్న ఇపుడు ఆ బలమైన నాయకత్వాన్ని అందిపుచ్చుకుని బాబు జైలులో ఉన్న వేళ పార్టీని కదం తొక్కించాలి.

అచ్చెన్న ఆ పని చేయగలిగితే ఫ్యూచర్లో టీడీపీలో బీసీ సీఎంగా రేసులో ఉండగలరు. ఈ గోల్డెన్ చాన్స్ ని అచ్చెన్న సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు. అచ్చెన్న నాయకత్వ పటిమకు ఇది నిదర్శనం కావాలని అంటున్నారు. అచ్చెన్న మీడియా ముందు మాటలు అయితే స్ట్రాంగ్ గానే ఉంటాయి. కార్యక్షేత్రంలో ఆయన పని తీరు, ఆయన వ్యూహాలు ఇపుడు ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది అంటున్నారు. 

అచ్చెన్న అలా లీడ్ తీసుకుని ముందుకు సాగితే టీడీపీ లో కొత్త కధ మొదలవుతుందని కూడా అంటున్నారు. అచ్చెన్న అందుకు రెడీనో కాదో అన్నదే అందరి మాటగా ఉంది.