మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కామెంట్స్ రెండు నియోజక వర్గాల్లో రాజకీయాల్లో అలజడి రేపుతున్నాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల నుంచి లేదా కడప ఎంపీగా పోటీ చేయమని బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే, అందుకు తగ్గట్టు చేస్తానని ఆయన చేసిన కామెంట్స్ టీడీపీలో గుబులు రేపాయి. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు అభ్యర్థులను టీడీపీ-జనసేన కూటమి ప్రకటించలేదు. బీజేపీతో పొత్తు తేలిన తర్వాతే ఈ రెండు నియోజకవర్గాలపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి టీడీపీనే బరిలో దిగనుంది.
జమ్మలమడుగులో టీడీపీ ఇన్‌చార్జ్ భూపేష్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి స్వయాన అన్న కుమారుడే భూపేష్. గత ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా ఓడిన తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. అలాగే మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. దీంతో జమ్మలమడుగులో టీడీపీకి ఏ దిక్కూ లేనప్పుడు భూపేష్ ముందుకొచ్చారు. పార్టీ పగ్గాలు తీసుకుని ధైర్యంగా జనంలోకి వెళ్లారు. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి ఆ సీటును ఆశిస్తుండడంపై భూపేష్ ఆగ్రహంగా ఉన్నారు.
జమ్మలమడుగు కాకపోతే ప్రొద్దుటూరు ఇవ్వాలని ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రొద్దుటూరు టీడీపీలో నాలుగు వర్గాలున్నాయి. టీడీపీ ఇన్‌చార్జ్ జి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, సీఎం సురేష్ తదితర నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు వేర్వేరుగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరుపై ఆదినారాయణరెడ్డి కన్నేయడాన్ని ప్రొద్దుటూరు టీడీపీ నాయకులెవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆదినారాయణరెడ్డికి టికెట్ ఇస్తే, అందరూ కలిసి ఓడించేందుకు వెనుకాడని పరిస్థితి. రాజకీయ స్వార్థంతో వ్యవహరించే ఆదినారాయణరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.