తెలుగు వాళ్లు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రెవేటీకరణ జరగకుండా అడ్డుకోవాలని తీవ్రమైన పోరాటం చేస్తున్న సమయం లోనే.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గెలిచిన ఒక ఎంపీ ఉక్కు శాఖకు మంత్రి కావడం అనేది యాదృచ్ఛికం కాకపోచ్చు.
కానీ.. భూపతిరాజు శ్రీనివాస వర్మ.. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఈ రాష్ట్ర చరిత్రలో జరిగిన పోరాటాలను, ఆ పోరాటాలలో అప్పటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పాల్గొన్న చారిత్రక అంశాలను గుర్తుంచుకొని.. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ జరగకుండా చూడడం గురించి ఆలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కేంద్రంలోని మోడీ సర్కారు ఒక నిర్ణయం తీసుకోవడంలో ఆయా శాఖలను పర్యవేక్షిస్తున్న మంత్రులు, సహాయ మంత్రులకు పెద్ద పాత్ర ఉంటుందని గానీ.. నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించగల, అడ్డు చెప్పగల, వ్యతిరేకించగల ధైర్యం ఉంటుందని గానీ మనం ఊహించలేం. ఆ రకంగా చూసినప్పుడు.. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చేయగలిగింది కూడా పరిమితమే.
కానీ, విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ ఎపిసోడ్ ను ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే సంగతి ఇప్పటికే కేంద్ర పాలకుల దృష్టిలో ఉంది. ప్రెవేటీకరణ జరగకుండా చూస్తానని.. కూటమిలో ఇప్పుడు ఒక కీలక భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వారికి హామీ ఇచ్చి ఉన్నారు. చంద్రబాబునాయుడు తన సహజశైలిలో ఏ విషయం తేల్చి చెప్పకుండా నాటకం ఆడారు గానీ.. విశాఖ ఉక్కు కు న్యాయం చేయాల్సిన బాధ్యత వీరిపై ఉంది.
శ్రీనివాస వర్మ ఉక్కు శాఖలో మంత్రి అయినప్పటికీ.. స్వయంగా నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. కానీ.. కేంద్రాన్ని అనునయంగా ఒప్పించేలా, ఆయన పవన్ కల్యాణ్ సాయం కూడా తీసుకుని ఇద్దరూ కలిసి విశాఖ ఉక్కు కోసం ఒక అడుగు ముందుకు వేయడం అసాధ్యం కాదు. కేంద్రంలోని ప్రభుత్వంలో రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న చంద్రబాబునాయుడు కూడా ఈ విషయంలో చొరవచూపిస్తే ఇంకా సంతోషం.
ఎవరు ఏమైనా మాయ చేయండి.. కానీ.. ఏపీ ప్రజల కోరిక తీరేలా.. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ జరగకుండా చూడండి అని ప్రజలు ఆశిస్తున్నారు.