చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభకు సభాపతి అయ్యారు. ఆయనది ఏకగ్రీవ ఎన్నిక. శనివారం నాడు ఆయన ఆ బాధ్యతలను కూడా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న అత్యంత సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. ఆయన ఇప్పుడు ఏడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో ఒక దఫా ఎంపీ కూడా అయ్యారు. అంతటి సీనియర్ కు స్పీకరు పోస్టు సబబే అని అంతా చెప్పుకొచ్చారు.
ఇదంతా నాణేనికి ఒకవైపు! రెండో వైపున తెలుగుదేశం పార్టీలో అమితమైన నోటి దూకుడు, బహిరంగ వేదికల మీద బూతులు మాట్లాడే అలవాటు ఉన్న అతి కొద్ది మంది నాయకుల్లో అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. ప్రతిపక్షంలో ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎన్నెన్ని బూతులు తిట్టారో లెక్కేలేదు. ఆయన బూతు పాండిత్యం మీద యావత్ తెలుగుదేశం మరియు కూటమి నాయకులకు కూడా అవగాహన ఉంది.
ఇంకో రకంగా చెప్పాలంటే.. తనను అత్యంత హేయమైన భాషలో తిడుతూ ఉండే అయ్యన్నపాత్రుడును కావాలనే స్పీకరుగా చేశారని.. అలాంటి వ్యక్తి ఎదుట సభలో ఉండకూడదనే ఉద్దేశంతోనే.. ఆగ్రహించిన జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా పులివెందులకు వెళ్లినట్టుగా కూడా ఒక ప్రచారం ఉంది. అయితే అయ్యన్న నోటిదూకుడు లేదా బూతుల ప్రావీణ్యం గురించి.. నియామకం తర్వాత ఆయనను అభినందించడానికి సభలో ప్రసంగించిన కూటమి నాయకులు అందరూ కూడా ప్రస్తావించడం విశేషం.
అయ్యన్నపాత్రుడును అభినందించడానికి సభలో మాట్లాడిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, సత్యకుమార్ అందరూ కూడా.. ఆయన దూకుడు, మాటతీరు భాష గురించి నర్మగర్భంగా ప్రస్తావించారు. అల్లరి చేసే పిల్లవాడినే క్లాస్ లీడర్ చేసినట్లుగా అయిందని ఒకరు, అల్లరి చేసే లీడర్ లాగా కాకుండా, అల్లరిని అణిచేసే ప్రిన్పిపాల్ లా వ్యవహరించాలని ఒకరు, తిట్టే బాధ్యత ఇప్పుడు ఆయనకు లేదని సభ్యులు ఒకరినొకరు తిట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నదని ఒకరు, మనం వాడే భాష మనుషుల్ని అతికించడానికి పనిచేయాలే తప్ప విడగొట్టడానికి కాదని ఇండైరక్టుగా మరొకరు.. అందరూ అయ్యన్న తిట్టే తిట్లు, వాడే భాష గురించే మాట్లాడారు.
మరొకవైపు నుంచి ఈ ప్రసంగాలను గమనించినప్పుడు.. వారందరూ ఆయనను ఎన్నిక చేసిన కూటమి నాయకులే అయినప్పటికీ.. ఆయనను పొగుడుతున్నారో తప్పుపడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి అయ్యన్నపాత్రుడు సభాపతిగా తన ప్రస్థానం ప్రారంభించారు. ముందుముందు సభా నిర్వహణ ఎలా ఉంటుందో చూడాలి.