జ‌గ‌న్‌పై ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అలిగారా?

వైసీపీ కీల‌క స‌మావేశానికి మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి గైర్హాజ‌ర‌య్యారు. దీంతో ఆళ్ల వైఖ‌రి స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌త కొంత కాలంగా వైసీపీ కార్య‌క‌లాపాల‌కు కూడా ఆయ‌న దూరంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. రానున్న…

వైసీపీ కీల‌క స‌మావేశానికి మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి గైర్హాజ‌ర‌య్యారు. దీంతో ఆళ్ల వైఖ‌రి స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌త కొంత కాలంగా వైసీపీ కార్య‌క‌లాపాల‌కు కూడా ఆయ‌న దూరంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇవ్వ‌ర‌నే సంకేతాలు రావ‌డంతో ఆళ్ల అల‌క‌పాన్పు ఎక్కిన‌ట్టు స‌మాచారం. 2014,2019ల‌లో వ‌రుస‌గా ఆయ‌న మంగ‌ళ‌గిరి నుంచి ఎన్నిక‌య్యారు.

2019లో నారా లోకేశ్‌పై గెలుపొంద‌డంతో తెలుగు స‌మాజం దృష్టిని ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆక‌ర్షించారు. నారా లోకేశ్‌ను ఓడిస్తే ఆళ్ల‌కు త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తాన‌ని గ‌తంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ అమ‌లుకు నోచుకోలేదు. రెండు కేబినెట్‌లో అయినా త‌న‌కు చోటు ద‌క్కుతుంద‌ని ఆళ్ల ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ప్ప‌టికీ, చివ‌రికి సీఎం మొండిచేయి చూపారు. మ‌రోవైపు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి బ‌దులు మ‌రొక‌రిని మంగ‌ళ‌గిరి బ‌రిలో నిలిపాల‌ని సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మంగ‌ళ‌గిరిలో చేనేత సామాజిక వ‌ర్గం బ‌లంగా వుంది. ఇప్ప‌టికే ప‌లువురు చేనేత నాయ‌కుల్ని వైసీపీలో చేర్చుకున్నారు. గంజి చిరంజీవిని లోకేశ్‌పై నిల‌బెట్ట‌నున్న‌ట్టు విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లోకేశ్‌ను ఓడించాలంటే అభ్య‌ర్థి మార్పు త‌ప్ప‌ద‌నే నిర్ణ‌యానికి జ‌గ‌న్ రావ‌డంతోనే, ఆయ‌న మదిలోకి మ‌రొక‌రు వ‌చ్చార‌ని స‌మాచారం.

దీంతో త‌న‌కు టికెట్ ఇవ్వ‌ర‌నే కార‌ణంతో ఆళ్ల అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ్టి కీల‌క స‌మావేశానికి కూడా ఆళ్ల డుమ్మా కొట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అస‌లు వాస్త‌వం ఏంటో ఆళ్ల చెబితేనే తెలుస్తుంది. లేదంటే త‌న‌పై సాగుతున్న ప్ర‌చారమే నిజ‌మ‌వుతుంద‌ని ఆళ్ల గ్ర‌హించాలి.