రాజధాని అనేది అమరావతిలో మాత్రమే ఉండాలి మరెక్కడా అలాంటి అభివృద్ధి కూడా ఉండకూడదు అనే నినాదంతో గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతం నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి వరకు సాగిస్తున్న పాదయాత్రకు భద్రత కల్పించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతోంది. శాంతి భద్రతలపరంగా ఎంతో సున్నితమైన ఈ విషయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నానా పాట్లు పడుతున్నారు. యాత్ర చేస్తున్న వాళ్లు నిబంధనలు పాటించకపోవడం.. వారి యాత్ర పట్ల స్థానికంగా ప్రతి చోటా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం జరుగుతోంది. ఈ రెండింటి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా చూడడంలో పోలీసులు సఫలమవుతున్నారు గాని అందుకోసం చాలా కష్టపడుతున్నారు.
శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేయడం, ఉద్యమం చేయడం మాత్రమే తమ లక్ష్యంగా పేర్కొంటూ కోర్టును ఆశ్రయించిన అమరావతి కార్యకర్తలు ఆ మాట ఎంత మేరకు నిలబెట్టుకుంటున్నారన్నది ప్రశ్నార్థకం. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని రావడం అనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన పట్ల ఏ ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే సంబరాలు చేసుకున్నదో అదే ఉత్తరాంధ్ర ప్రాంతం యొక్క మనోభావాలను గాయపరిచేలాగా అరసవెల్లికి వీరు యాత్ర నిర్వహించడం తొలినుంచి వివాదాస్పదంగానే ఉంది.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ యాత్ర పట్ల స్థానికులు నిరసనలు తప్పవు కాబట్టి ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడుతుందని అది అదుపు తప్పకుండా చూడాలంటే అనుమతులు నిరాకరించడమే మేలని పోలీసు శాఖ భావించింది. కానీ అమరావతి కార్యకర్తలు కోర్టును ఆశ్రయించారు. తాము తమ పాదయాత్రను చాలా శాంతి యుతంగా చేయదలుచుకున్నట్టు అక్కడ హామీ ఇచ్చారు. అటు నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ఆచరణలో వారు కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారా అనేదే అనుమానాస్పదంగా ఉంది.
బౌన్సర్లను పెట్టుకుని పాదయాత్ర ప్రారంభించిన అమరావతి కార్యకర్తలు అడుగడుగునా రెచ్చగొట్టే ధోరణిలోనే సాగుతున్నారని అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ యాత్ర పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేకత ఉందన్న విషయం స్పష్టం. అయితే యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్న ప్రదేశాలలో వెళుతున్నప్పుడు, ఈ అమరావతి కార్యకర్తలు రెచ్చగొట్టే తీరులో వ్యవహరించడం చర్చినీయాంశం అవుతోంది. గుడివాడ సంఘటనలు ఇందుకు తాజా ఉదాహరణ.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదుగా యాత్ర వెళుతున్నప్పుడు కొంచెం నియంత్రణలో ఉండవలసిందిగా పోలీసులు చేసిన విజ్ఞప్తులను ఈ అమరావతి కార్యకర్తలు పెడచెవిన పెట్టారు. వైసిపి ఆఫీసు ముందు యాత్రలో వాహనంలో పాటలు వద్దని పోలీసులు వారిస్తే.. వాళ్లు వాహనం దిగి మరీ పాటలు పాడుతూ ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య పరిస్థితి అదుపుతప్పిపోకుండా చూసేందుకు పోలీసులు నానా పాట్లు పడవలసి వచ్చింది. ఇరు వర్గాలకు సర్ది చెప్పాల్సి వచ్చింది.
అయితే ఈ కష్టాలన్నీ పోలీసులు ముందుగా ఊహించినవే. అందుకే వాళ్ళు అనుమతులు నిరాకరించారు కూడా. అయితే కోర్టు ఆదేశించిన తర్వాత ఈ యాత్రకు ఆది నుంచి రక్షణ కవచం లాగా పోలీసు యంత్రాంగమే పనిచేస్తూ ఉంది. యాత్ర వెళుతున్న ప్రాంతాలలో వైసీపీ ప్రాబల్యం ఉన్నచోట ఎంతగా వ్యతిరేకతలు ఉన్నప్పటికీ అవి ఘర్షణలుగా మారకుండా కేవలం పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇదే వ్యవహారాన్ని పోలీసులు అతి భయంకరంగా ఆంక్షలు విధిస్తూ యాత్రను తొక్కేయాలని చూస్తున్నారని ఒకవైపు విమర్శలు వస్తున్నాయి.
పోలీసులు నిబంధనలు అంటూ పచ్చ మీడియా కారుకూతలు కూయడం పరిపాటి అయిపోయింది. పోలీసులు మాత్రం సంయమనం వీడడం లేదు. ఎవరేం అంటున్నప్పటికీ శాంతి భద్రతల పరిరక్షణ ఒక్కటే తమ కర్తవ్యం గా సాగుతున్నారు. అయితే అమరావతి కార్యకర్తలు ఎదుటివారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడమే వారికి చిరాకు తెప్పిస్తోంది.
ప్రస్తుతానికి గుడివాడ సమీపంలోనే అమరావతి పాదయాత్ర సాగుతోంది. ఇంకా ఒకటి రెండు రోజుల వరకు వైసిపి నాయకుల ప్రతిఘటనలను మించి ప్రజా వ్యతిరేకత వారికి స్వానుభవంలోకి రాకపోవచ్చు. కానీ ఆ తర్వాత మాత్రం పరిస్థితి ఇదే తీరుగా ఉండబోదు. స్థానిక ప్రజలు కూడా వీరి యాత్రకు నిరసనగా తమ తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఆ సంగతి స్పృహలో ఉంచుకొని అమరావతి కార్యకర్తలు కూడా సంయమనం పాటించాలి.
గుడివాడలో రెచ్చగొట్టినట్టుగానే ప్రతి చోటా తమను వ్యతిరేకించే వారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాం.. అని అంటే ఇబ్బందులు తప్పక పోవచ్చు. పోలీసులు నిరంతరం భద్రత కల్పిస్తూనే ఉన్నారు కానీ, వారు చెప్పిన మాట వినకుండా భద్రత వలయాన్ని ఛేదించుకుని బయటకు వెళ్లి ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం అమరావతి కార్యకర్తలకు భంగపాటు ఎదురవుతుంది.