కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ బహిరంగ సభలో పాల్గొన్నారు, మాట్లాడారు. మోడీ సర్కారు తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి గురించి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా.. విశాఖలో అమిత్ షా సభ జరిగింది.
సాధారణంగా అయితే.. మోడీ భజన వరకే ఈ సభ పరిమితం కావాలి. అయితే ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయనే అర్థం ధ్వనించేలా.. జగన్ సర్కారు మీద అమిత్ షా నిప్పులు చెరగుతారా? లేదా? అనే చర్చ ఇవాళ సాయంత్రం దాకా జరిగింది. అందరూ ఆయన మాటలకోసం ఎదురు చూశారు.
జగన్ వ్యతిరేక దళాలు కోరుకుంటున్నట్టే.. అమిత్ షా, ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు. నిన్న జెపి నడ్డా శ్రీకాళహస్తిలో చేసిన విమర్శల స్క్రిప్టు కాపీనే అమిత్ షా మళ్లీ చదివారు. అదనంగా కాస్త లోకల్ ఫ్లేవర్ కోసం వైజాగ్ కబ్జాలనే పాయింట్ యాడ్ చేశారు. వాటన్నింటి సంగతి పక్కన పెడితే.. సభాముఖంగా ఆయన రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు ఇచ్చిన టార్గెట్ విషయమే ఇప్పుడు ప్రధానంగా అందరికీ కనిపిస్తోంది. అందరినీ కన్ఫ్యూజ్ చేస్తోంది.
ఎన్నికల ప్రస్తావన రాకుండా సాధారణంగా ఏ సభా ముగియదు కాబట్టి.. అమిత్ షా కూడా.. మోడీ 3.0 సర్కారు ఎంత ఘనమైన మెజారిటీతో నెగ్గి.. 2024లో ఏర్పడబోతున్నదో తన ప్రసంగంలో వెల్లడించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో మోడీ సర్కారు 300 సీట్లు గెలిచి మళ్లీ అధికారం చేపడుతుందని అన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 20 సీట్లు గెలవాలని ఆయన లక్ష్యాన్ని నిర్దేశించారు. మోడీ మరోసారి ప్రధాని కావడానికి ఏపీ బీజేపీ నాయకులు ఆ మాత్రం పెద్ద కానుక ఇవ్వాలన్నట్టుగా సూచించారు.
ఈ మాటను గమనించిన వాళ్లు.. అసలు ఏపీలో ఎన్ని లోక్ సభ సీట్లు ఉన్నాయో అమిత్ షాకు తెలుసా? అని సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో 20 సీట్లలో బిజెపి డిపాజిట్లు తెచ్చుకునేలా బలపడాలి అనే మాట చెప్పబోయి.. 20 సీట్లు గెలవాలి అని పొరబాటుగా చెప్పేశారేమో అని జోకులు వేసుకుంటున్నారు.
అయినా అమిత్ షా రాష్ట్రంలో భారతీయజనతా పార్టీకి ఉన్న బలం ఏమిటో వాస్తవ పరిస్తితులను పరిగణనలోకి తీసుకోకుండా.. అలా ఎలా చెప్పగలిగారో అనేది అందరికీ అనుమానం కలుగుతోంది. ఇలాంటి మాటల వల్ల తాను నవ్వుల పాలు అవుతాననే సంగతి ఆయనకు తెలియదా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంకో తమాషా ఏంటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీని కూడా గెలవాలి.. అనే తరహా లక్ష్యాలను అమిత్ షా చెప్పనేలేదు. 20 ఎంపీ సీట్లలో పార్టీ గెలవడం అంటే.. ఇంచుమించుగా 140 అసెంబ్లీ స్థానాల్లో వారు ఆధిక్యం చూపించగలగాలి. ఆ మేర బలం ఉండాలి. 140 కాదు కదా.. కనీసం 40 అసెంబ్లీ సీట్లలో డిపాజిట్ తెచ్చుకోగల పాటి బలం బిజెపికి ఉన్నదా? అనేది ప్రజల ప్రశ్న. డిపాజిట్ సంగతి కూడా తర్వాత.. కనీసం 40 సీట్లలో వెతుకులాట అవసరం లేకుండా బిజెపి అభ్యర్థులను ప్రకటించగలదా? అని ప్రజలు అంటున్నారు.