స్నేహితులు, బంధువుల ఇంటికి వెళ్లే టప్పుడు ప్రత్యేకంగా పిల్లల్ని గుర్తించుకుని ఏవైనా తీసుకెళ్తారు. పిల్లలంటే ప్రత్యేక ప్రేమ కనబరుస్తారు. అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టి పిల్లలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రేమ చాటుకున్నారు. ఏడాదికి రూ.15 వేలు ఇస్తూ వారి చదువులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. “పిల్లలూ… ఎందాకైనా చదవండి. మీ మేనమామగా అండగా ఉంటా” అని గొప్పగా భరోసా ఇచ్చారు. ఇదంతా ఏడాది ముచ్చటే అయ్యింది.
కాలం గడిచేకొద్ది మేనమామ భరోసా తగ్గిపోతోంది. అమ్మ ఒడి కాస్త …కుదింపు ఒడిగా మారుతోంది. జగన్ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో లబ్ధి తగ్గిపోతోంది. వైసీపీ ఎన్నికలకు ముందు అమ్మఒడి పథకం గురించి బాగా ప్రచారం చేసింది. పిల్లల్ని చదివించడానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని జగన్ ఊరూరా ప్రచారం చేశారు.
2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. 2020 నుంచి అమ్మఒడి అమలుకు శ్రీకారం చుట్టారు. మొదటిసారి రూ.15 వేలు చొప్పున తల్లుల ఖాతాలో ప్రభుత్వం వేసింది. ఆ తర్వాత 2021లో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.వెయ్యి తగ్గించి రూ.14 వేలు అందజేసింది. తాజాగా మరో వెయ్యి తగ్గించి రూ.13 వేలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల మరుగు దొడ్ల నిర్వహణ పేరుతో రూ.2 వేలు కోత విధించడం గమనార్హం.
మొదట్లోనే రూ.10 వేలు ఇచ్చినా ఎవరూ బాధపడేవారు కాదు. అలాంటిది పిల్లలకిచ్చే సొమ్ములో రూ.2 వేలు కోత విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల చదువుకు రూ.13 వేలు ఇవ్వడం కంటే, రూ.2 వేలు తీసుకోవడం అసంతృప్తికి గురి చేస్తుంది. మరుగుదొడ్డ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని, పిల్లలకిచ్చే సొమ్మును లాక్కోవడం ఏంటని తల్లులు ప్రశ్నిస్తున్నారు.
మాట ఇచ్చి తప్పడం మేనమామకు తగునా? అని తల్లులు నిలదీస్తున్నారు. పిల్లల సొమ్మును లాక్కోడానికి మనసెలా వచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చివరికి విద్యార్థుల సొమ్ముకు ఎసరు పెట్టే దయనీయ స్థితి రాష్ట్రంలో నెలకుందనేది కఠిన వాస్తవం.
సొదుం రమణ