వైసీపీకి తాను దూరమే అనే సంకేతాల్ని ఆ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చారు. వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి నియమితులైన నేపథ్యంలో ఆయన పరిచయ కార్యక్రమం ఇవాళ ఆధ్యాత్మిక నగరంలో ఓ హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యేలు డాక్టర్ గురుమూర్తి, భూమన కరుణాకరరెడ్డి, సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు ఎమ్మెల్యేలు సంజీవయ్య, ఆదిమూలం, వరప్రసాద్, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే తనయుడు మోహిత్‌రెడ్డి, నియోజకవర్గాల పరిశీలకులు హాజరయ్యారు.
కానీ తిరుపతి జిల్లా పరిధిలోని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మాత్రం హాజరు కాలేదు. ఇటీవల ఆయన సొంత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీకి నష్టం కలిగించేలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే తరహాలో జగన్ సర్కార్‌పై దారుణ వ్యాఖ్యలు చేస్తుండడంపై వైసీపీ పెద్దలు ఆగ్రహించారు. దీంతో ఆయన ప్లేస్‌లో రాంకుమార్‌రెడ్డిని ఇన్చార్జ్గా నియమించారు.
ఇక మీదట వెంకటగిరిలో అధికారిక కార్యక్రమాలన్నీ రాంకుమార్‌రెడ్డి కనుసన్నల్లోనే జరగాలని వైసీపీ పెద్దలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని అధికారులు, పార్టీ నాయకులంతా రాంకుమార్‌రెడ్డి వద్దకు క్యూకడుతు న్నారు. ఈ పరిణామాల్ని ముందే ఊహించిన ఆనం రాంనారాయణరెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
కానీ ఇవాళ్టి సమావేశానికి గైర్హాజరుతో తన ఉద్దేశాన్ని పార్టీకి ఆయన తెలియజేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం, అనంతరం బయటికి వెళ్లడానికే సిద్ధమైనట్టు సమాచారం. అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ, వైసీపీ సమావేశాలకు వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.