హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో చుట్టూ టీడీపీ అలుపెరగకుండా తిరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలనే డిమాండ్ కూడా ఆ పార్టీ నుంచి వచ్చింది. ఆ ఎపిసోడ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని ఉద్యమించే రోజులు కూడా సమీపంలోనే ఉన్నాయని తెలుస్తోంది. అయితే మాధవ్ ఎపిసోడ్‌కు సంబంధించి అనంతపురం ఎస్పీ ఫకీరప్ప క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో ఒరిజినల్ కాదని తేల్చేశారు.
అయితే ఎస్పీ క్లారిటీపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత అద్భుతమైన అర్థాన్ని కనుగొన్నారు. మాధవ్ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుంచి అనిత 24/7 అనే లెవెల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్నారు. మహత్తర కార్యాన్ని తలకెత్తుకున్న అనితకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు పెరిగినట్టు సమాచారం. అలాగే ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీలో మరే మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వకుండా మాధవ్‌కు సంబంధించి బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకుని ఊరూవాడా తిరుగుతూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారామె.
ఈ నేపథ్యంలో ఇవాళ అనిత మీడియాతో మాట్లాడుతూ కీలక అంశం చెప్పారు. గోరంట్ల మాధవ్‌కు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప క్లీన్‌చిట్ ఇవ్వలేదన్నారు. ఒరిజినల్ వీడియో లేదని మాత్రమే చెప్పారనే సంగతి ఆమె కనుక్కోవడంతో భలేభలే అంటూ అభిమానులు చప్పట్లు కొడుతున్నారు. ఒరిజినల్ వీడియో దొరికితే విచారణ జరిపి చర్య తీసుకుంటామని ఎస్పీ చెప్పారన్నారు.
మాధవ్‌కు సంబంధించి నిత్య వార్తా స్రవంతిని అందించేందుకు అనిత త్వరలో యూట్యూబ్ చానల్ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆమె అభిమానులు అంటున్నారు. మొత్తానికి అనంతపురం ఎస్పీ క్లారిటీని అర్థం చేసుకున్న ఏకైక నాయకురాలు అనితే అని చెప్పక తప్పదు.