న్యాయ‌స్థానంలో వైసీపీకి రెండో అద్భుత విజ‌యం

న్యాయ‌స్థానంలో వైసీపీకి వ‌రుస‌గా రెండో అద్భుత విజ‌యం ద‌క్కింది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇంటి స్థలాల పంపిణీపై ఏపీ హైకోర్టు శుక్ర‌వారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో 45 వేల నుంచి దాదాపు 50…

న్యాయ‌స్థానంలో వైసీపీకి వ‌రుస‌గా రెండో అద్భుత విజ‌యం ద‌క్కింది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇంటి స్థలాల పంపిణీపై ఏపీ హైకోర్టు శుక్ర‌వారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో 45 వేల నుంచి దాదాపు 50 వేల మంది పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీకి అడ్డంకులు తొల‌గిన‌ట్టైంది. ఇటీవ‌లే సుప్రీంకోర్టులో వైసీపీ స‌ర్కార్‌కు భారీ ఊర‌ట ల‌భించ‌డం మ‌రిచిపోక‌నే, మ‌రోసారి అలాంటిదే హైకోర్టులో ల‌భించ‌డం విశేషం. దీంతో వైసీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.

చంద్ర‌బాబునాయుడు రాజ‌ధాని అమ‌రావ‌తిలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, వాటి నిగ్గు తేల్చ‌డానికి ఏపీ స‌ర్కార్ సిట్ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. సిట్ ఏర్పాటుపై టీడీపీ నేత‌లు మొద‌ట హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టులో టీడీపీ నేత‌ల‌కు అనుకూల తీర్పు వ‌చ్చింది. సిట్ ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోల‌ను ర‌ద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. 

అయితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వ అక్ర‌మాల‌పై విచార‌ణ‌కు ఏర్పాటు చేసిన సిట్ ఉద్దేశాల‌ను హైకోర్టు స‌రిగా అర్థం చేసుకోలేద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. అవినీతిపై విచార‌ణ‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ షాక్ నుంచి టీడీపీ తేరుకోక‌నే మ‌రొక భారీ దెబ్బ ప‌డింది.

అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ నిమిత్తం ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో నెం.45ను స‌వాల్ చేస్తూ కొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇటీవ‌ల వాద‌న‌లు ముగిశాయి. ఉత్కంఠ‌కు తెర‌దించుతూ కాసేప‌టి క్రితం హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. జీవో నంబ‌ర్ 45ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పుకు లోబడి ఇళ్ల ప‌ట్టాల పంపిణీ ఉండాలని స్ప‌ష్టం చేసింది.

పిటిషన్‌పై  విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరికో, ఒక వర్గానికో రాజ‌ధాని పరిమితం కాదని స్ప‌ష్టం చేశారు. అభివృద్ధిలో భాగంగానే రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తోంద‌ని చీఫ్ జ‌స్టిస్ అభిప్రాయ‌ప‌డ్డారు. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం స‌రైంది కాద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. ప్ర‌స్తుతం రాజధాని భూములు సీఆర్డీఏవని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స్ప‌ష్టం చేశారు. భూములతో వాటిని ఇచ్చిన వారికి సంబంధం లేద‌ని చీఫ్ జ‌స్టిస్ పేర్కొన్నారని స‌మాచారం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారని అన్నారు. కానీ  నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమ‌ని చీఫ్ జ‌స్టిస్ తేల్చి చెప్పారు.  

హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 45 వేల నుంచి 50 వేల మంది పేద‌ల‌కు ఒక్కొక్క‌రికి సెంట్ స్థ‌లం చొప్పున ఇచ్చేందుకు ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ‌కు దిగింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటి స్థ‌లాల పంపిణీకి శ్రీ‌కారం చుట్టే అవ‌కాశం ఉంది. పేద‌ల‌కు రాజ‌ధానిలో ఇళ్లు ఉండేలా చేయాల‌న్న జ‌గ‌న్ సంక‌ల్పం ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌నుంది. అలాగే అడ్డుకోవాల‌నే ప్ర‌య‌త్నాల‌కు న్యాయ‌స్థానం చెక్ పెట్టిన‌ట్టైంది.