ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ అంటూనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయనకు మరో లేఖ రాశారు. ఈసారి మాత్రం కాస్తా గట్టిగానే పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. అభిమానుల చేత బండ బూతులు తిట్టించడం మగతనం కాదని.. సినిమాలోనే హీరో తప్ప రాజకీయాల్లో హీరో కాదనే విషయం గుర్తించాలని హితవు పలికారు.
దమ్ము, ధైర్యం ఉంటే మీరు తిట్టండి అని.. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిదని పవన్‌పై విరుచుపడ్డారు. మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదంటూనే. కాకినాడలో పోటీ చేయడం చేతకాకపోతే పిఠాపురంలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. ఒంటరి వాడిని..ఏమన్నా పడతాననే గర్వమా అని పవన్ ను ప్రశ్నించారు. వంగవీటి రంగా హత్య సమయంలో జరిగిన అల్లర్లలో అరెస్టై, కేసులు ఎదుర్కొంటున్నవారిని ఎప్పుడైనా పరామర్శించారా..? అంటూ విమర్శించారు.
కాగా పవన్ బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుండి ముద్రగడ, వైసీపీ కాపు ఎమ్మెల్యేలు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడినే టార్గెట్‌గా వ్యక్తిగత విమర్శలు చేయడంతో రెండు రోజుల క్రితం పవన్‌కు ముద్రగడ లేఖ రాస్తూ.. వ్యక్తిగత విమర్శలు, బూతులు మాట్లాడటం తగ్గించుకోవాలని హితవు చెప్పడంతో.. జనసేన నాయకులు ముద్రగడకు మనీయార్డర్లు పంపుతూ, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ అవమానిస్తున్న విషయం తెలిసిందే.