రాజకీయాల్లోకి వచ్చిన వారు అంచనాలు విశ్లేషణలు చెబుతారు. కానీ జోస్యాలు మాత్రం చెప్పరు. వాటిని ఎపుడూ నమ్ముకోరు. 2019 ఎన్నికల ముందు జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక జోస్యమే చెప్పేశారు. జగన్ ఈ జన్మలో సీఎం కాలేడని. కానీ ఫలితాలు చూస్తే అది పక్కా చిలక జోస్యమని తేలిపోయిందని వైసీపీ నేతలే విమర్శించారు.
ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ మరో జోస్యం వదిలారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకు 60 సీట్ల కంటే ఎక్కువ రావు అని. దానికి మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ముందు మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పు సేనానీ అని. అది అయిపోయింది. ఇపుడు జన సైనికులు కూడా జోస్యం చెప్పేస్తున్నారు.
విశాఖ ఎయిర్ పోర్టు ఘటన సాక్షిగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదు, ఇది పక్కా అని అంటున్నారు. ఈ మధ్యన విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ మంత్రుల మీద దాడి జరిగింది. దానికి సంబంధించి జనసేన నాయకుల మీద కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదంతా తప్పు అని తమపైన కావాలనే కేసులు పెట్టారని జనసేనాని నుంచి సైన్యమంతా చెబుతూ వస్తోంది.
మంత్రుల మీద వారే దాడి డ్రామా ఆడించి తమ మీద నేరాన్ని నెడుతున్నారు అని వారు అంటున్నారు. అందువల్లనే విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలు పారవని, వైసీపీ ఈసారి ఓడిపోతుంది అని జనసైనికులు ఘంటాపధంగా చెబుతున్నారు. 2017లో కోడి కత్తి దాడి కేసు లాంటిదే ఇది కూడా అని పోలిక తెస్తున్నారు. నాడు సానుభూతి వెల్లువెత్తి వైసీపీ గెలిచింది కానీ ఈసారి అంతా రివర్స్ అవుతుందని, రాష్ట్ర రాజకీయాలను విశాఖ ఎయిర్ పోర్టు తాజా ఘటన మార్చుతుంది అని అంటున్నారు.
ఇది మరో చిలకజోస్యంగానే వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. తమ మంత్రుల మీద దాడి చేసి పైగా నిందలు తమ మీద వేస్తున్నారని, ఇపుడు జోస్యాలు కూడా చెప్పడమేంటని మండిపడుతున్నారు. ప్రతీ ఎన్నిక ముందూ జోస్యాలు చెబుతూ వస్తున్న జనసేన ఈసారి కూడా చిలకజోస్యంతో ఫల్టీ కొట్టడం ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్ని జోస్యాలు చెబుతున్నా తాము గెలుస్తామని మాత్రం జనసేన నాయకులు ఎక్కడా చెప్పకపోవడమే విడ్డూరమని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.