స్పెష‌ల్ స్టేట‌స్ ప్లీజ్‌….!

ఏపీకి ప్ర‌త్యేక హోదా (స్పెష‌ల్ స్టేట‌స్‌) ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీకి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాలంటూ ప్ర‌తిప‌క్ష నేత‌గా…

ఏపీకి ప్ర‌త్యేక హోదా (స్పెష‌ల్ స్టేట‌స్‌) ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీకి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాలంటూ ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్ ఉద్య‌మించిన సంగ‌తి తెలిసిందే. విద్యార్థుల‌తో పెద్ద ఎత్తున స‌మావేశాలు నిర్వ‌హించారు. అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబునాయుడు ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీకి అంగీక‌రించారు.

దీంతో మోదీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదాను అట‌కెక్కించింది. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఏమొస్తుంద‌ని, దాన్ని పొందిన రాష్ట్రాలు బాగుప‌డ్డాయా? అని అసెంబ్లీ వేదిక‌గా సీఎం హోదాలో చంద్ర‌బాబు నాటి ప్ర‌తిప‌క్ష వైసీపీని నిల‌దీశారు. అయితే ప్ర‌త్యేక హోదా రాష్ట్రానికి రాకపోవ‌డానికి ప్ర‌ధాన దోషిగా చంద్ర‌బాబును జ‌గ‌న్ నిల‌బెట్ట‌డంలో స‌క్సెస్ సాధించారు.

త‌న‌కు 25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్ర‌త్యేక హోదా తీసుకొస్తాన‌ని జ‌గ‌న్ న‌మ్మ‌బ‌లికారు. వైసీపీకి 22 సీట్లు క‌ట్ట‌బెట్టారు. కానీ కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని, త‌మ అవ‌స‌రం ఆ పార్టీకి లేక‌పోవ‌డంతో ప్ర‌త్యేక హోదాపై డిమాండ్ చేసే ప‌రిస్థితి లేద‌ని సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మొద‌ట్లోనే జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌పుడు మొక్కుబ‌డిగా ప్ర‌ధాని మోదీ, కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రికి విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించ‌డం త‌ప్ప వైసీపీ పోరాటం చేస్తున్న ప‌రిస్థితి లేదు. తాజాగా అల్లూరి సీతారామ‌రాజు జ‌యంతి వేడుక‌ల‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోదీకి రాష్ట్ర ప్ర‌భుత్వ స‌మ‌స్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. 

ఇందులో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ప్ర‌ధాన అంశంగా ఉంది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెల‌పాల‌ని,  రూ.34,125.5 కోట్లు రీసోర్స్‌ గ్యాప్‌ కింద గ్రాంటుగా ఇవ్వాలని, తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించడంతో పాటు మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌ధానికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.