మాజీ మంత్రి వివేకా హత్య కేసులో విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసులో సీబీఐ కక్షపూరితంగా తమను ఇరికిస్తోందని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి వాపోతున్న సంగతి తెలిసిందే. ఇదే వాదనను వైసీపీ ముఖ్య నేతలు కూడా బలంగా వినిపిస్తున్నారు. సీబీఐ విచారణ చివరి దశకు చేరినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల విచారణ కీలకంగా మారింది.
ఇప్పటికే పలు దఫాలు సీబీఐ విచారణను అవినాష్‌రెడ్డి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌రెడ్డి విన్నపాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. దీంతో ఆయన అరెస్ట్‌పై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ భాస్కర్‌రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. అసలు హత్య కేసులో నిందితుడైన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తమను నేరస్తులుగా చేయాలని సీబీఐ ఎలా చూస్తోందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ భాస్కర్‌రెడ్డి పిటిషన్‌లో కీలక అంశం ఉంది. సీబీఐ చెప్పినట్టుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారనేది భాస్కర్‌రెడ్డి ప్రధాన వాదన. దస్తగిరిని ఢిల్లీలో రెండు నెలలో పెట్టుకుని సీబీఐ తాము చెప్పినట్టు నడుచుకోవాలని నేర్పినట్టు అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పిటిషన్‌లో దస్తగిరి కేంద్రంగా భాస్కర్‌రెడ్డి వాదన వినిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
వివేకా హత్య కేసులో ఎ-4 నిందితుడైన దస్తగిరి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను బెయిల్‌పై వుండడాన్ని భాస్కర్‌రెడ్డి ప్రశ్నిస్తుండడం గమనార్హం. వైఎస్ భాస్కర్‌రెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు స్పందన… ఈ కేసుపై ప్రభావం చూపుతుంది. అది ఏంటో తెలియాల్సి వుంది.