టీటీడీ కేవలం ఆధ్మాత్మిక విషయాల ప్రచారానికే పరిమితం కాలేదు. పిల్లలకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పించడంలోనూ ముందు వరుసలో వుంది. ఈ నేపథ్యంలో మొదటిసారిగా టీటీడీ డిగ్రీ కళాశాలల్లో మొదటిసారి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సు ప్రవేశ పెట్టనుంది. ఈ కోర్సుపై ఇవాళ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించనుంది.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న డిగ్రీ కళాశాలలు అటానమస్ హోదాలో మొదటిసారి అడ్మిషన్లను సిద్ధమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల నడుస్తున్నాయి. వీటితో కొత్తగా డిగ్రీ ఆనర్స్ కోర్సులో ప్రవేశాలకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూన్ మొదటి వారంలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విభాగాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చదవాల్సిన అవసరం లేదు. పీహెచ్‌డీలో చేరేందుకు ఏపీఆర్‌సెట్ రాసేందుకు అర్హులు. కొత్తగా ప్రవేశ పెట్టనున్న ఆనర్స్ డిగ్రీ కోర్సు గురించి విస్తృతంగా ప్రచారం చేసేందుకు రాయలసీమ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఆనర్స్ డిగ్రీకి భారీ డిమాండ్ వుంది. పీజీ కోర్సు చేరాల్సిన అవసరం ఉండదు. అలాగే దేశ, విదేశాల్లో ఎమ్మెస్ చేయడానికి ఆనర్స్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. ఇంటర్‌లో మెరిట్ మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇవ్వనున్నారు.