ఏపీ బీజేపీ పరిస్థితి ఎలా ఉందో పార్టీ వారికీ తెలుసు. జనాలకు తెలుసు. నోటాను దాటుదామని ఎంత ప్రయత్నం చేస్తున్నా కుదరని పరిస్థితి ఉంది. అలాంటి బీజేపీకి ఆశాకిరణంలా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరారు. ఆయన ఎందుకు చేరారు, బీజేపీ ఎందుకు చేర్చుకుంది అన్నది నిదానంగా తెలియనుంది.
ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి వంటి బిగ్ షాట్ చేరారని, ఏపీలో బీజేపీ బలోపేతం అయిందని, థర్డ్ ఫోర్స్ గా ఏపీ రాజకీయ తెరపైన అవతరిస్తుందని కమలనాధులు అపుడే కలలు కనడం మొదలెట్టేశారు.
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అయితే కిరణ్ చేరడం ఆరంభం మాత్రమే ముందు ముందు భారీ ఎత్తున నేతలు బీజేపీలో చేరుతారు చూస్తూ ఉండండి అంటూ ఊరించేశారు. ఏపీ బీజేపీలో చేరే ఆ బడా నేతలు ఎవరు అంటే సస్పెన్స్ అంటున్నారు బీజేపీ నేతలు.
నిజంగా బీజేపీకి అంత సీన్ ఉంటే 2014 లోనే బీజేపీలో నేతలు క్యూ కట్టుకుని వచ్చి వాలాలి కదా అన్న సెటైర్లు పడుతున్నాయి. బీజేపీ పెద్దలు మాత్రం మా టైం ఇపుడు వచ్చిందని అంటున్నారు ఏపీ తెలంగాణ రెండు చోట్లా బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని జీవీఎల్ జోస్యం చెప్పేశారు.
ఏపీలో రీసెంట్ గా జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటునే బీజేపీ నిలబెట్టుకోలేక డిపాజిట్లు కూడా పోగొట్టుకుని చతికిలపడింది. ఆ చోట నుంచే ఏపీలో అధికారం మాదే అని బీజేపీ నేతలు జబ్బలు చరచడం మాత్రం రాజకీయ అత్యాశను కూడా దాటిపోయింది అంటున్నారు.
ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే పరమావధి. బీజేపీ అలా ఆశపడడంలో తప్పు లేదు కానీ ఆ దిశగా ఆ పార్టీ ఇన్నేళ్ళ కాలంలో ఏమి చేసిందన్నది నేతలు ఆలోచించుకోవాలని అంటున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్న జగన్ ఏమైనా సొంత సొమ్ము ఖర్చు చేస్తున్నారా, ఆయన దాన వీర శూర కర్ణా అంటున్నారు జీవీఎల్. జగన్ అయినా మోడీ అయినా చంద్రబాబు అయినా ఖజానా నుంచే ఖర్చు చేస్తారు. పేదలకు ఇవ్వాలన్న ఆలోచన ప్రయారిటీ ఇవన్నీ జగన్ క్రెడిట్ అన్నదే ఇక్కడ చూడాలి అంటున్నారు.
ఉమ్మడి ఏపీ సీఎం గా మూడేళ్ళు పనిచేసి గత కొన్నేళ్ళుగా లైం లైట్ లో లేని కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కి మాత్రం రాజకీయ ఆశాకిరణంగా మారిపోయారు. కిరణ్ బాటలో చాలా మంది నేతలు అంటున్నారు. ఎవరొస్తారో చూడాల్సిందే.