ఓటర్ల నమోదుకు ఆధార్ కార్డు తప్పని సరి కాదంటూనే మళ్లీ ఇవ్వాలని ఎన్నికల సంఘం చెప్పడం చర్చకు దారి తీసింది. ఆధార్ కార్డు ఇవ్వాలంటే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోననే భయం ప్రజల్లో వుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు ఒకటి నుంచి ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు.
ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదుకు ఆధార్ కార్డు ఇవ్వాలని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇక్కడే అందరికీ అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆధార్ అడగడానికి కారణాలను రాష్ట్ర ఎన్నికల అధికారి చెప్పుకొచ్చారు. ఓటర్ల గుర్తింపును ఖరారు చేయడానికి, ఒక వ్యక్తి పేరు ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదు కాకుండా చూడటంలో భాగంగా ఆధార్ అవసరమని ఆయన అంటున్నారు.
అయితే ఇది స్వచ్ఛందమని ఆయన చెబుతున్నప్పటికీ, ఆచరణలో అందుకు విరుద్ధంగా సాగుతున్నట్టు సమాచారం. ఆధార్ లేనిదే ఓటు నమోదు చేయనట్టు చెబుతున్నారు.
ఆధార్ నంబరు కోసం ఫారమ్ 6 బి తీసుకొచ్చి, మరోవైపు తప్పనిసరి కాదని చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటనే ప్రశ్నలొస్తున్నాయి. అయితే ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉండేలా చర్యలు తీసుకునేందుకైతే అభ్యంతరం లేదని, దుర్వినియోగం అవుతుందనే ఆందోళన కొత్త ఓటర్లలో నెలకుంది.
అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.