ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగింది. వైసీపీ గద్దె దిగింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత, నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టనున్నారు. ఇవన్నీ శరవేగంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాజీనామాలు వచ్చి వుంటే, వెంటనే ఆమోదించాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం మారిన వెంటనే, నామినేటెడ్ పోస్టులను పట్టుకుని ఇంకా వైసీపీ నేతలు గబ్బిలాల మాదిరిగా వేలాడ్డం విమర్శలకు దారి తీస్తోంది. వైసీపీ హయాంలో వచ్చిన పదవులకు రాజీనామాలు చేయకుండా, ఇంకా అట్లే కొనసాగడం ఏం నైతికమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రాజ్యాంగ పదవులంటూ కొందరు వైసీపీ సార్లు, మేడమ్‌లు కొనసాగడం విడ్డూరంగా వుందని సొంత పార్టీ నేతలు సైతం విమర్శిస్తున్నారు. మాటలు మాత్రం కోటలు దాటేలా మాట్లాడుతూ, పదవుల దగ్గరికి వచ్చే సరికి, రాజ్యాంగబద్ధమనో, ఇంకో పేరు చెప్పి, కొనసాగడానికి మనసు ఎలా ఒప్పుతుందని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. తమతో గెంటివేతకు గురి కాకుండా, పెద్దరికంగా వైదొలిగితే మంచిదని వారు హితవు చెబుతున్నారు.