కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్టుగా ఉంది.. ఏపీ సర్కారు చేసిన పని. మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చి సుమారు ఆరునెలలు దాటుతోంది. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని, సిఆర్డిఎ ఒప్పందంలో ఉన్నట్టుగా రైతులకు వారి వాటా స్థలాలు అప్పగించాలని, పనులు ప్రారంభించాలని హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది. రాజధాని విషయంలో శాసనసభకు నిర్ణయాల హక్కులేదనే మాట కూడా ప్రస్తావించింది.
హైకోర్టు తీర్పు రాబోతున్న నేపథ్యంలో అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ చాలా హడావుడిగా స్పందించారు. సిఆర్డీయే రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. సిఆర్డీయేను పునరుద్ధరించారు. అయితే పనుల విషయంలో మాత్రం ముందడుగు పడలేదు. సిఆర్డీయే రద్దు నిర్ణయం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వర్తించదు అనే పరిస్థితి కల్పించారు. అయితే మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గినట్టేనా అనే సందేహాలు ప్రబలంగా వినిపించినప్పుడు.. అప్పటికి గత్యంతరంలేక వెనక్కి తగ్గినప్పటికీ.. మరింత పటిష్టమైన, న్యాయపరమైన ఇబ్బందులు లేని మూడు రాజధానుల బిల్లును కొత్తగా రూపొందించి మళ్లీ సభ ముందుకు తెస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.
అయితే.. ఈ ఆరునెలల వ్యవధిలో చాలా చాలా పరిణామాలు చాలా సహజంగా జరుగుతూ వచ్చాయి. అమరావతి రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. మరోవైపు మూడు రాజధానులకు అనుకూలమైన, అలా ఉండాలని కోరుకుంటున్న ప్రాంతాలకు, వర్గాలకు చెందిన ప్రజలు మాత్రం.. జగన్ కొత్త- పటిష్టమైన బిల్లు ఎప్పుడు తేబోతున్నారా అని ఎదురుచూస్తూ వచ్చారు. తాజాగా శాసనసభ సమావేశాలు మొదలైన సమయంలో కూడా.. ఈ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించి కొత్త బిల్లు వస్తుందని వారంతా ఎదురుచూశారు. ఈ విషయంపై సభలో చర్చ కూడా జరిగింది.
ఇక బిల్లు వస్తుందని అంతా అనుకుంటూ ఉన్న సమయంలో.. ఏపీ సర్కారు.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఇప్పుడు సుప్రీంను ఆశ్రయించింది. రాజధానిని నిర్ణయించుకునే అధికారం శాసనసభకు లేదని అనడం శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అని పిటిషన్లో పేర్కొంది. ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.
కొత్తగా జగన్ ఏదో చేసేస్తారని అంతా ఎదురుచూస్తూ ఉంటే… ఆరునెలల తర్వాత.. ఏపీ సర్కారు సుప్రీం కోర్టుకు వెళ్లడం కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్టుగా ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు. అయినా సుప్రీంకు వెళ్లిన తర్వాత.. ఆ వ్యవహారం ఈ ప్రభుత్వపు పదవీకాలం ముగిసేలోగా తేలుతుందా? అనే సందేహాలు కూడా పుడుతున్నాయి. తేలకపోతే గనుక.. వచ్చే ఎన్నికలు మూడు రాజధానులకు రెఫరెండంగానే జరుగుతాయని అనుకోవాలి.