మాజీ మంత్రి, దాదాపు ఏడువందల వరకు ఉన్న విద్యాసంస్థలకు అధినేత నారాయణ ను అరెస్టు చేయడంపై ఇప్పుడు రాష్ట్రమంతా గగ్గోలెత్తుతోంది. మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయనను కిడ్నాప్ తరహాలో అరెస్టు చేశారని, కొడుకు వర్ధంతి కార్యక్రమానికి వెళ్లి అక్కడి క్రతువు పూర్తి చేసిన తర్వాత అరెస్టు చేయవచ్చునని నారాయణ అడిగినా కూడా పట్టించుకోకుండా పోలీసులు అరెస్టు చేశారని వార్తలు వస్తున్నాయి.
అయితే పేపర్ లీకేజీ సంఘటనలు చోటుచేసుకున్నప్పటినుంచి జరిగిన పరిణామాలను గమనిస్తోంటే.. నారాయణ పోలీసులకు దొరక్కుండా పారిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడే పోలీసులు అరెస్టు చేసినట్టుగా అర్థమవుతోంది. అయితే జనంలో సానుభూతి పొందడానికి కొడుకు వర్ధంతి కార్యక్రమం అనే సాకు చెబుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
టెన్త్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాలకు సంబంధించి.. నారాయణ విద్యాసంస్థల వారి పాత్ర ఉందనే సంగతి చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. ఒక నారాయణ సంస్థలోని ఉద్యోగి లీకేజీ చేయించారా? లేదా, సంస్థ సూచనల మేరకు, సంస్థలోని పెద్దల స్కెచ్ మేరకు అతను లీకేజీ కుట్రలో పావు అయ్యాడా? అనేది పోలీసు విచారణలో తేలుతుంది.
లీకేజీకి పాల్పడినట్లుగా తేలిన వ్యక్తి అందులో భాగస్వామినా? పావునా? అనేది కీలకం. ఆ సంగతి తేలేముందు.. ఆ విద్యాసంస్థకు చెందిన యజమానిని కూడా విచారించడం అవసరం. అందుకే ఆటోమేటిగ్గా.. మాజీ మంత్రినారాయణ పేరు కూడా పోలీసు కేసులోకి ఎక్కింది.
తన మీద పోలీసు కేసు నమోదైందని తెలియగానే.. మాజీ మంత్రి నారాయణ జాగ్రత్త పడ్డారు. ఆయన తను ఎక్కడున్నదీ పోలీసులు ట్రాక్ చేయకుండా ఉండడానికి తన ఫోను స్విచాఫ్ చేసేశారు. ఫోన్ ఆన్ లో ఉంటే.. సెల్ టవర్ లొకేషన్ ట్రాక్ చేయడం ద్వారా పోలీసులు పట్టుకుంటారని అలా స్విచాఫ్ చేశారు. మరో నెంబరు వాడడం మొదలెట్టారు.
ఈ అతి జాగ్రత్తే ఆయన మీద ప్రధానంగా అపనమ్మకం ఏర్పడడానికి, అనుమానాలు పెరగడానికి కారణం అవుతోంది. ఎందుకంటే. పోలీసుల కేసులో పేరు ఉండడం పెద్ద నేరం కాదు. అయితే.. తాను పరిశుద్ధుడననే నమ్మకం ఆయనకుంటే.. విచారణను ఎదుర్కొని తన సత్యశీలతను నిరూపించుకోవాలి. నారాయణ అలా చేయలేదు. ఫోను స్విచాఫ్ చేసి కూర్చున్నారు.
పోలీసు కేసులో తమ పేరు ఎక్కిన తర్వాత.. అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి చట్టపరంగా ఉండే అనేకానేక వక్రమార్గాలు తెలుగుదేశం నాయకులకు చాలా బాగా తెలుసు. వారు అనేక సందర్భాల్లో కోర్టును ఆశ్రయించి.. అరెస్టు కాకుండా ముందే ఆదేశాలు తెచ్చుకున్న సందర్భాలు అనేకం.
జరిగిన లీకేజీ నేరంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని అనిపిస్తే నారాయణ కూడా ఆ రీతిగా కోర్టును ముందే ఆశ్రయించి.. అరెస్టు అనేదే జరగకుండా ఆదేశాలు తెచ్చుకుని ఉండొచ్చు. ఆ పని చేయకపోవడంకూడా.. ఆయన పాత్రపై అనుమానాలు పెంచుతోంది.
తన ఫోను ఆపేసిన తర్వాత.. మరో ఫోనును వాడడం అనేది ఆయన చేసిన తప్పు. ఇంకో ఫోను వాడితే ఆ సంగతి పోలీసులు తెలుసుకోగలరనే అవగాహన లేకపోవడం ఆయన దొరికిపోవడానికి దారితీసింది.
ఫోను స్విచాఫ్ చేసి.. భార్యతో సహా వెళ్లిపోతున్న సమయంలోనే ఆయన పోలీసులకు దొరికారు. ఇలా జరిగిన సంఘటనల క్రమాన్ని గమనించిన ఎవ్వరికైనా సరే.. నేరంలో నారాయణ పాత్ర ఉన్నదనే అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆయనకు బెయిలు కూడా లభించింది. ఇక ముందుముందు విచారణలో తను సచ్ఛీలుడనని ఆయన ఎలా నిరూపించుకుంటారో చూడాలి.