విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి వంశీకుడు కేంద్ర మాజీ మంత్రి అయిన అశోక్ గజపతి రాజు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తగా మంత్రిగా అయిన కొండపల్లి శ్రీనివాస్ తో పాటు అంతా కలసి ఆయనను అభినందించారు. ఈసారి పుట్టిన రోజు వేళకు ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో అంతా పసుపు దనంతో పరవశంగా రాజు గారి బర్త్ డే వేడుకలు జరిగాయి. రాజా వారు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వచ్చిన వారు అంతా రాజు గారు గొప్ప పదవులలో రాణించాలని కోరుకున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆశించారు.
రాజు గారికి గొప్ప పదవులు అంటే ఏమిటి అన్న చర్చకు తెర లేచింది. ఆయన చూడని పదవులు లేవు. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప అని పదవులూ ఆయన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేపట్టారు కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ పదవిని ఇప్పటికి పదేళ్ల క్రితమే ఆయన చేపట్టారు.
ఈసారి ఎన్నికల్లో పోటీ కూడా ఆయన చేయలేదు. మరి గొప్ప పదవులు అంటే ఏమిటి అంటే అదే గవర్నర్ పదవి అని అంటున్నారు. ఆయనను గవర్నర్ గా ఏదో ఒక రాష్ట్రానికి నియమిస్తారు అని ఈ మధ్యనే వార్తలు వస్తున్నాయి. రాజ్ భవన్ లో రాజా వారు ఉంటేనే గౌరవం అని అంతా ఆనాటి నుంచే అనుకుంటున్నారు.
ఆయన గొప్పతనానికి అదే అసలైన చిరునామా అని భావిస్తున్నారు. అందుకే అశోక్ పుట్టిన రోజు వేళ ఆయన గొప్ప పదవులు అన్న మాటలు వినిపించాయని అంటున్నారు. టీడీపీ కోటాలో ఒక గవర్నర్ పోస్ట్ దక్కనుంది అన్నది ప్రచారం సాగుతోంది. ఆ పదవిని అశోక్ కి ఇస్తారని అనుకుంటున్నారు. అదే జరిగితే మాత్రం అశోక్ అదృష్టవంతులే అని చెప్పాలి.
టీడీపీ ఫౌండర్లలో ఒకరు అయిన అశోక్ చంద్రబాబు సీఎం కావడానికి ఇతోధికంగా కృషి చేసిన వారు. ఒక దశలో ముఖ్యమంత్రి రేసులో వినిపించిన పేరు కూడా ఆయనది. అటువంటి ఆయనకు గవర్నర్ పదవి ఇస్తే ఏడు పదులు దాటిన ఈ వయసులో ఆయన హుందా తనానికి ఆయన ఘనమైన వంశానికి అదే అసలైన మణిహారం అవుతుందని అంటున్నారు. ఈసారి పుట్టిన రోజుకు ఆయన కేంద్ర మాజీ మంత్రి. వచ్చే ఏడాది నాటికి గవర్నర్ గా వస్తారా అంటే కాలమే జవాబు చెప్పాలి. రాజు గారి పుట్టిన రోజు గిఫ్ట్ ఇచ్చేది ఎవరు అన్నదే ఇపుడు ఆసక్తిని గొలుపుతున్న విషయం.