విశాఖ జిల్లా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు లేటెస్ట్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కలిశారు. అయితే ఆయన వెంట కుమారుడు నందేశ్ కూడా ఉన్నారు. తన కొడుకుని వెంటబెట్టుకుని తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీస్ కి రావడం ఇపుడు రాజకీయాల్లో చర్చగా ఉంది.
తన కుమారుడిని జగన్ కి పరిచయం చేసిన అవంతి అనేక విషయాలు చర్చించారని తెలుస్తోంది. అవంతి కొడుకు నందేశ్ అవంతీ గ్రూప్స్ కి వైఎస్ చైర్మన్ గా ఉన్నారు. అవంతి తరఫున అన్ని వ్యాపారాలను ఆయన చూసుకుంటున్నారు.
గత కొన్నేళ్ళుగా అవంతి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కానీ కొడుకు ఎక్కడా కనిపించలేదు. ఆయనకు ఆ ఆసక్తి కూడా ఉన్నట్లు తోచదు. కుమార్తె ప్రియాంక అయితే గత ఏడాది జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ గా నెగ్గారు. ఒక విధంగా తండ్రికి రాజకీయ వారసురాలు ఆమె మాత్రమే అనుకున్నారు.
ఇపుడు సడెన్ గా కొడుకు ఎంట్రీ ఇచ్చారు. జగన్ కి పుష్పగుచ్చం ఇచ్చి మరీ తన గురించి చెప్పుకున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో నందేశ్ పోటీ చేస్తారా. భీమిలీ నుంచి అవంతి ప్లేస్ లో కొడుకే బరిలోకి దిగుతారా అన్న దాని మీద వైసీపీలో చర్చగా ఉంది. జగన్ యూత్ అంటున్నారు. అందుకే అవంతి తెలివిగానే కొడుకుని వెంటబెట్టుకుని వచ్చారని అంటున్నారు. మరి జగన్ ఏమంటారో.