ప్చ్‌…అవినాష్ బెయిల్ ర‌ద్దు అవుతుంద‌నుకుంటే!

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిని వైసీపీ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు అవినీతి కేసులో అరెస్ట్ చేసి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు పంపింది. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు వార్త…

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిని వైసీపీ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు అవినీతి కేసులో అరెస్ట్ చేసి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు పంపింది. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు వార్త విని ఆనందించాల‌ని టీడీపీ నాయకులు, కార్య‌కర్త‌లు అనుకున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు కేసు విచార‌ణ‌కు రావ‌డం  అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్‌పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఒక్క అవినాష్‌రెడ్డి మ‌నిహా మిగిలిన వారంతా జైల్లోనే ఉన్నారు. తెలంగాణ హైకోర్టు అవినాష్‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని స‌వాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

ఇవాళ సుప్రీంకోర్టులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంటుంద‌ని టీడీపీ వ‌ర్గాలు ఆశించాయి. అయితే వివేకా కుమార్తె త‌ర‌పున వాదించాల్సిన లాయ‌ర్ సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేరు. ఈ విష‌యాన్ని సుప్రీంకోర్టు దృష్టికి సునీత తీసుకెళ్లి వాయిదా వేయాల‌ని కోర‌డం గ‌మ‌నార్హం. సునీత విజ్ఞ‌ప్తి మేర‌కు కేసు విచార‌ణ‌ను మూడు వారాల‌కు వాయిదా వేసింది. అవినాష్ బెయిల్ ర‌ద్దుకు మ‌ద్ద‌తుగా సీబీఐ కూడా కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. ఇదిలా వుండ‌గా సునీత త‌ర‌పు వాదించే సిద్ధార్థ లూథ్రా  తాజాగా చంద్ర‌బాబునాయుడి కేసులో వాదించేందుకు విజ‌య‌వాడ వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ఆదివారం ఏసీబీ కోర్టులో ఆయ‌న వాద‌న‌లు స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. దీంతో చంద్ర‌బాబుకు జైలు త‌ప్ప‌లేదు. బాబుకు బెయిల్‌, ఇత‌రత్రా న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను లూథ్రా చూస్తుండ‌డంతో ఢిల్లీ వెళ్ల‌డానికి కుదర్లేద‌ని స‌మాచారం. ఏది ఏమైనా అవినాష్‌రెడ్డి బెయిల్‌పై అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోక‌పోవ‌డం వైసీపీకి ఆనందాన్ని, టీడీపీకి దుఃఖాన్ని మిగిల్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.