బాబు చేయాల్సిన డిమాండ్ అయ్యన్న నోటి వెంట…!

సాధారణంగా ఏపీలో ఏమి జరిగినా వెంటనే దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ముడి పెట్టేసి నానా విమర్శలు చేయడం టీడీపీకి అలవాటు. ఇక చంద్రబాబు అయితే గత నాలుగేళ్ళుగా జగన్ని రాజీనామా చేయమని…

సాధారణంగా ఏపీలో ఏమి జరిగినా వెంటనే దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ముడి పెట్టేసి నానా విమర్శలు చేయడం టీడీపీకి అలవాటు. ఇక చంద్రబాబు అయితే గత నాలుగేళ్ళుగా జగన్ని రాజీనామా చేయమని ఎన్ని సార్లు కోరారో తెలిసిన విషయమే. ఇపుడు జగన్ సొంత ఇలాకాలో ఆయన దగ్గరి వారిని సీబీఐ అరేస్ట్ చేసింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్ అయిన నేపధ్యంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సీరియస్ డిమాండ్ ఒకటి చేశారు. జగన్ వెంటనే తన సీఎం పదవిని రాజీనామా చేయాలని, అధికారం నుంచి దిగిపోవాలన్నదే ఆ డిమాండ్.

జగన్ సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో మరో చిన్నాన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ భాస్కరరెడ్డి ప్రమేయం ఉందని భావిస్తూ సిబిఐ అరెస్టు చేసిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అందువల్ల విలువలు విశ్వసనీయత గురించి తరచూ మాట్లాడే జగన్ రెడ్డికి ఏమాత్రం నైతికత ఉన్నా తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి పదవికి రాజీనామా చేయాలని అయ్యనపాత్రుడు కోరారు.

అంతే కాదు, నాలుగు సంవత్సరాలు పాటు ముద్దాయిని కాపాడుకుంటూ వచ్చినా చివరికి సిబిఐ అధికారులు అరెస్ట్ చేసారని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా అయ్యన్న విమర్శలు చేయవచ్చు కానీ జగన్ని రాజీనామా చేయమనడమే వింతగా ఉందని అంటున్నారు. పైగా వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అభియోగాలు మోపి అరెస్ట్ చేసింది.

కోర్టులో విచారణ జరిగి తీర్పు వచ్చి ఆయనే దోషి అంటే అపుడు కధ వేరుగా ఉంటుంది. ఇంతలోనే ఏదో జరిగినట్లుగా జగన్ పదవి నుంచి దిగిపోవాలని అయ్యన్న అంటున్నారు అంటే ఇది రాజకీయం కోసం చేసే డిమాండ్ తప్ప మరేమీ కాదని వైసీపీ నేతలు అంటున్నారు. 

అయ్యన్న నోటి వెంట నుంచి ఈ డిమాండ్ రావడం ఆశ్చర్యం కాదు కానీ ఈపాటికే చంద్రబాబు ఈ డిమాండ్ చేసి ఉండాలి. మరి ఆయన కంటే ముందే అయ్యన్న రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు కూడా ఏమీ ఊరుకోరని, తొందరలోనే ఈ మొత్తం వ్యవహారం మీద తనదైన రియాక్షన్ ఇస్తారని అంటున్నారు అయ్యన్న వరకూ చూస్తే జగన్ రెడ్డి గద్దె దిగాలని కోరడం ద్వారా విపక్షాలకు ఒక రకమైన డైరెక్షన్ ఇచ్చారనుకోవాలి.