హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మానసిక స్థితిపై ఆయన ప్రత్యర్థి, వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజకీయ బాంబు పేల్చారు. పోలీస్ అధికారైన ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేసిన వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్ ప్రోత్సహించారు. తాజాగా దివంగత వైఎస్సార్‌పై బాలయ్య హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు.
ఇందులో భాగంగా ఇక్బాల్ కాస్త దూకుడు పెంచారు. బాలయ్య మానసిక పరిస్థితిపై ఆయన సంచలన కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాలయ్య మానసిక స్థితి సరిగా లేదని ఆయన విమర్శించారు. గతంలో బాలయ్యకు మానసిక స్థితి సరిగా లేదని వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం, ఎమ్మెల్యేగా కొనసాగుతుండడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఆలోచనలో వున్నట్టు ఇక్బాల్ సంచలన విషయాలు చెప్పారు.
ఓ సినీ నిర్మాతను రివాల్వర్‌తో కాల్చిన కేసులో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ పుణ్యంతోనే బాలకృష్ణ బయటపడ్డారని ఇక్బాల్ చెప్పుకొచ్చారు. సినిమాలు, రాజకీయాల్లో బాలకృష్ణ ఉన్నాడంటే అది ముమ్మాటికీ వైఎస్సార్ చలువ వల్లే అని ఇక్బాల్ తెలిపారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మతిస్థిమితం కోల్పోయినట్టు తమ దగ్గర ఆధారాలున్నాయని ఎమ్మెల్సీ తేల్చి చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు మానసిక రోగులు అనర్హులనే సంగతి తెలిసిందే. గతంలో ఓ కేసు నుంచి బయట పడేందుకు బాలయ్య తాను మానసిక రోగి అని సర్టిఫికెట్ తెచ్చుకోవడం విధితమే. అదే అంశాన్ని వైసీపీ నేతలు తెరపైకి తెచ్చి బాలయ్యతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు.