వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు. వైసీపీ పార్టీకి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని తన పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల తన నియోజకవర్గంలో తగిన సమయాన్ని కేటాయించడం లేదనే ఉద్దేశ్యంతో రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుండి తప్పకుంటున్నాట్లు చెబుతున్నా… గత కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల దృష్టా తను రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవల సీఎం జగన్ పర్యటనలో బాలినేనికి తీవ్ర అవమానం జరిగిన విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో ఆయనను పదవి నుంచి తప్పించినప్పటి నుండి బాలినేని అసంతృప్తిలో ఉన్నారు. ఆ సయమంలో సీఎం జగన్ తో భేటీ జరగడంతో మళ్లీ పార్టీలో యాక్టీవ్ అయ్యారు. అయితే తాజాగా తనకు పార్టీ అప్పగించిన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఐదారు పర్యాయాలు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా.. దివంగత వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ సొంతంగా పార్టీని స్థాపించారు. ఆ సమయంలో మంత్రి పదవిని కూడా వదులుకుని జగన్ వెంట బాలినేని నడిచారు. 2012లో ఒంగోలు ఉప ఎన్నికలో వైసీపీ తరపున బాలినేని గెలుపొందారు.
మంత్రి పదవి కోసం బంధుత్వాలను కూడా కాదనుకునే రోజుల్లో, వరుసకు అల్లుడైన జగన్ కోసం తాను మంత్రి పదవి వదిలేశారు.. తీరా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి జిల్లాల్లో తన కంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనను తప్పించిన ఘనత సీఎం జగన్ కే చెల్లుతుంది.