రాష్ట్రానికి ఏం చేశావో చెప్ప‌య్యా…!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడ‌తార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ముందు రాష్ట్రానికి ఏం చేశావో చెప్పి, త‌ర్వాత దేశం సంగ‌తి…

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడ‌తార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ముందు రాష్ట్రానికి ఏం చేశావో చెప్పి, త‌ర్వాత దేశం సంగ‌తి గురించి మాట్లాడాల‌ని డిమాండ్ చేశారు. బండి సంజ‌య్ శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ టైమ్‌పాస్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

అయితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చ‌న్నారు. అయితే టీఆర్ఎస్ నేత‌గా, ప్ర‌భుత్వాధినేత‌గా తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు కేసీఆర్ అది చేస్తా, ఇది చేస్తాన‌ని జాతీయ ప‌ర్య‌ట‌న చేసినా, ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని దెప్పి పొడిచారు.

కేంద్రంతో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఎనిమిదేళ్ల పాల‌న పూర్తి చేసుకున్నార‌న్నారు. మోదీ ఎనిమిదేళ్ల పాలన, అలాగే  కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అని బండి సవాల్‌ విసర‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. వారసత్వ, అవినీతి పార్టీలు దేశంలో అంతమైపోతున్నాయని అన్నారు. తెలంగాణను కులాలు, మతాలు, వర్గాల పేరుతో కేసీఆర్ విచ్ఛిన్నం చేశారని సంజయ్ దుయ్య‌బ‌ట్టారు.

తెలంగాణ‌లో మ‌సీదుల‌ను త‌వ్వాల‌ని, శవాలొస్తే మీవి…. శివం వస్తే మావి అందుకు మీరు సిద్ధమా? అని స‌వాల్ విసిరిన బండి సంజయ్‌…  కేసీఆర్ విచ్ఛిన్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

బీజేపీ పునాదులే మ‌తంపై ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని అంద‌రికీ తెలుసు. అలాంటిది ప్ర‌త్య‌ర్థుల‌పై ఆ కోణంలో విమ‌ర్శ‌లు చేయ‌డం ఒక్క బీజేపీ నేత‌ల‌కే చెల్లింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.