వైసీపీలో బేరగాళ్ల దందాకు తెరలేచింది. ఇప్పటికే ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ఇక పార్టీలో వివిధ విభాగాలకు సంబంధించి పదవుల భర్తీకి అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ బాధ్యులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్లలో జరగనున్న ఎన్నికల యుద్ధానికి అన్ని రకాలుగా సైన్యాన్ని సిద్ధం చేసుకోడానికి నియామకాలు చేపట్టేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే పార్టీలో పదవుల భర్తీని సొమ్ము చేసుకునేందుకు కొందరు బేరగాళ్లు తెరపైకి వచ్చారు.
వైసీపీ, ప్రభుత్వ పెద్దలను నిత్యం కలుస్తూ, అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ, తమకు బాగా పలుకుబడి ఉన్నట్టు ఓ సానుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు. దీన్ని సంపాదనకు మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి బేరగాళ్లలో ఆడ, మగ అనే తేడా లేదు.
తాజాగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో పని చేయడానికి యాక్టివిస్టులు దరఖాస్తు చేసుకోవాలనే ప్రకటన వెలువడింది. అలాగే బూత్‌స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ అన్ని పదవులను అక్టోబర్‌లోపు నియమించడానికి చర్యలు తీసుకోవాలని స్వయంగా జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వీర మహిళలు, వీర పురుషులుగా చెప్పుకునే వారే దందాకు తెరలేపడం తీవ్ర విమర్శలకు గురవుతోంది.
ఇలాంటి వారు తమ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఎవరైనా సోషల్ మీడియాలో పని చేయాలని అనుకుంటుంటే, తమను సంప్రదించాలని, వివరాలను పంపాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. తీరా వివరాలు పంపాక, ఫలానా వాళ్లు తమకు బాగా తెలుసని, ఫలానా పోస్టు ఇప్పిస్తే ఎంతిస్తావని బేరం పెడుతున్నారనే వార్తలొస్తున్నాయి. పార్టీపై అభిమానంతో ఏదైనా చేయాలనే ఉత్సాహాన్ని కూడా చంపేలా సదరు బేరగాళ్లు ప్రవర్తిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
మరికొందరు వైసీపీ బూత్, గ్రామ, మండల, జిల్లా స్థాయి పదవులు ఆశిస్తూ… పార్టీలో కొందరు దళారులను ఆశ్రయిస్తున్నారు. పదవుల కోసం సదరు దళారి నాయకులను ఆశ్రయించగా… హోదాను బట్టి డబ్బు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఈ దందాకు తెరలేచింది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కె.నారాయణ స్వామి ఏకంగా ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.
వైఎస్సార్సీపీ పదవులు, సంస్థాగత నియామకాలన్నీ విజయవాడ కేంద్ర కార్యాలయం నుంచే వెలువడుతాయని డెప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. కొంత మంది కార్యకర్తలు, నాయకులు అపోహ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. చివరికి పార్టీ అభిమానుల్ని కూడా దోచుకోడానికి కొందరు వైసీపీ దళారులు వెనుకాడకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీకి వీర విధేయులుగా పెద్ద నాయకుల వద్ద పోజులు కొడుతూ, క్షేత్రస్థాయిలో పదవులను అమ్మకానికి పెడుతున్న వారిని ఇప్పటికైనా దూరం పెడతారా? లేక వ్యాపారం చేసుకొమ్మని ప్రోత్సహిస్తారా? అనేది వారిష్టం.