ఏం కిత‌కిత‌లు…కామెడీనా మ‌జాకా!

వారాహి యాత్ర వ‌ల్ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ల్ల సాధించింది ఏదైనా వుందంటే…త‌న‌ను తాను త‌క్కువ చేసుకోవ‌డం. రాజ‌కీయాల్లో హ‌త్య‌లుండ‌వు, ఆత్మ‌హ‌త్య‌లే వుంటాయ‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ఈ మాట‌కు నిలువెత్తు ఉదాహ‌ర‌ణ‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను చెప్పుకోవ‌చ్చు. వారాహి…

వారాహి యాత్ర వ‌ల్ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ల్ల సాధించింది ఏదైనా వుందంటే…త‌న‌ను తాను త‌క్కువ చేసుకోవ‌డం. రాజ‌కీయాల్లో హ‌త్య‌లుండ‌వు, ఆత్మ‌హ‌త్య‌లే వుంటాయ‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ఈ మాట‌కు నిలువెత్తు ఉదాహ‌ర‌ణ‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను చెప్పుకోవ‌చ్చు. వారాహి యాత్ర మొద‌లు పెట్టిన త‌ర్వాత నిర్వ‌హించిన ఒక‌ట్రెండు బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన‌కు ఒక్క అవకాశం ఇవ్వాల‌ని, ముఖ్య‌మంత్రిగా మంచి ప‌నులు చేస్తాన‌ని వేడుకున్నారు.

అంత‌కు ముందు మాట్లాడిన మాట‌ల‌కు, యాత్ర‌లో చెబుతున్న దానికి తేడా క‌నిపించ‌డంతో, ప‌వ‌న్ మారార‌ని సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, సామాన్య ప్ర‌జ‌లు భావించారు. ఆ త‌ర్వాత ఎల్లో ప‌త్రిక‌ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌నేది ఉత్తుత్తిదేన‌ని, కేవ‌లం అభిమానుల కోసం అలా మాట్లాడాన‌ని స్ప‌ష్టం చేయ‌డంతో జ‌న‌సేన నిరుత్సాహ‌ప‌డింది. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లోని గొప్ప‌త‌నం ఏమిటంటే త‌న గురించి లోకం ఏమ‌నుకుంటుందో అస‌లు ప‌ట్టించుకోరు.

చంద్ర‌బాబు ఏమ‌నుకుంటున్నార‌నేది ఆయ‌న‌కు కావాలి. జ‌నం జ‌న‌సేన వెంట నిలిస్తే, ఆ పార్టీని తీసుకెళ్లి చంద్ర‌బాబు కాళ్ల వ‌ద్ద పెడ్తాన‌ని ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రోక్షంగా చెబుతున్నారు. ఒకే బ‌హిరంగ స‌భ‌లో ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతున్న ప‌వ‌న్‌ను జ‌నం లైట్ తీసుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్‌పై ద్వేషాన్ని వెళ్ల‌గ‌క్కేందుకే ఆయ‌న జ‌నంలోకి వ‌చ్చార‌ని ఫిక్స్ అయ్యారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో కొంచెమైనా స్పృహ వుంటే త‌న‌ను విప్ల‌కారుడిగా అభివ‌ర్ణించుకుంటారా? ఇంకా న‌యం త‌న‌ను మావోయిస్ట్‌గా చెప్పుకోలేదు. ఇలాంటివి ప‌వ‌న్ మాట్లాడుతుంటే జ‌నం న‌వ్వుకోకుండా ఎలా వుండ‌గ‌ల‌రు. అందుకే వెండితెర హీరో ప‌వ‌న్‌ను రాజ‌కీయ తెర‌పై జ‌నం క‌మెడియ‌న్‌గా చూస్తున్నారు. తాజాగా ఆయ‌న నోటి నుంచి మ‌రికొన్ని ఆణిముత్యాలు జాలువారాయి. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం జ‌న‌సేన నాయ‌కుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌వ‌న్ మాట్లాడుతూ 2008 నుంచి రాజ‌కీయాల్లో వున్నాన‌న్నారు. మార్పు కోసం పంతం ప‌ట్టి కొన‌సాగుతున్న‌ట్టు ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.  

పదవుల కోసం పార్టీని తాకట్టు పెట్టలేమన్నారు. రాజకీయాలంటే ఎంతసేపు బూతులు తిట్టుకోవడం, డబ్బులు సంపాదించు కోవడంగా మార్చేశారని, అందరి దృష్టి, దిష్టి గోదావరి జిల్లాలపైన పడిందన్నారు. దీని నుంచి విముక్తి కల్పించేందుకు గోదావరి జిల్లాల నుంచి పోరాటం మొదలు పెట్టానని ఆయ‌న అన్నారు. టీడీపీ కోసం జ‌న‌సేన‌ను తాక‌ట్టు పెట్టిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌ళ్లీ తానే ఆ విష‌య‌మై నీతిసూక్తులు చెప్ప‌డాన్ని కామెడీ అంటారు.

అలాగే రాజ‌కీయాల్లో బూతులు తిట్టుకోవ‌డం గురించి ప‌వ‌న్ చెబితే జ‌నం వినాల్సిన ఖ‌ర్మ ఏర్ప‌డింది. వైసీపీ నేత‌ల్ని చెప్పుతో కొడ్తానంటూ, వాటిని చేతికి తీసుకుని చూపించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా రాజ‌కీయాల్లో సంస్కార‌వంత‌మైన భాష గురించి మాట్లాడితే వినాల్సిన ప‌రిస్థితి. నిత్యం తోలు తీస్తా, తాట తీస్తా, మ‌క్కులు విరగ్గొడుతా అంటూ వార్నింగ్‌లు ఇచ్చే ప‌వ‌న్‌క‌ల్యాణ్ …బూతులపై నీతులు చెప్ప‌డం చూస్తే…హ‌వ్వా న‌వ్వి పోదురు గాక అంటార‌నే వెర‌పు కూడా ఆయ‌న‌కు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. రాజ‌కీయాల్లో ప‌వ‌న్ కిత‌కిత‌లు మామూలుగా లేవు. పాల్‌ను మించిపోయేలా కామెడీని పండిస్తున్నారు.