అసెంబ్లీ అంటే స్పీకర్ దే. అసెంబ్లీ మీద సర్వాధికారాలూ స్పీకర్ కి ఉంటాయి. ఆయన నిర్ణయమే ఫైనల్. అంతటి ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయనకు మాజీ సీఎం జగన్ లేఖ రాసి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అలా వైసీపీని మెయిన్ అపొజిషన్ పార్టీగా నోటిఫై చేయాలని కోరారు. ఒక విధంగా చూస్తే ఇది అభ్యర్ధన. ఆయన దానికి తనదైన వాదనలు కూడా వినిపించారు.
అధికార టీడీపీ అయితే ససేమిరా అంటోంది. జగన్ లేఖ తరువాత వరసబెట్టి టీడీపీ మంత్రులు కానీ ఇతర నేతలు కానీ చేస్తున్న కామెంట్స్ చూస్తే జగన్ ఒట్టి ఎమ్మెల్యే మాత్రమే అని తీసి పక్కన పెడుతున్నారు. వారు అలాగే మాట్లాడవచ్చు. వారిది ఒక రాజకీయ పార్టీ.
కానీ జగన్ అభ్యర్థన చేసింది రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ కి. ఇపుడు అయ్యన్న నిర్ణయమే ఎవరికైనా శిరోధార్యం. ఆయన కనుక వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తూ నోటిఫై చేస్తే ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి.తాను స్పీకర్ చెయిర్ లోకి వచ్చాక తనకు పార్టీలు ఉండవు, రాజకీయాలు ఉండవు అని అయ్యన్న చెప్పుకున్నారు. ఇపుడు ఆయన పెద్దరికానికి అసలైన పరీక్ష ఎదురవుతోంది. ఢిల్లీ అసెంబ్లీలో కేవలం మూడు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి ఇచ్చారు. ఆప్ నియమించిన స్పీకర్ ఈ స్వతంత్ర నిర్ణయం తీసుకున్నారు.
స్పీకర్ గా అయ్యన్న ఏపీ అసెంబ్లీ సజావుగా నడిపించాలని అనుకుంటున్నారు. విపక్షం గొంతు కూడా గట్టిగా వినిపిస్తేనే సభ సంపూర్ణంగా రాణిస్తుంది. అలా కాకుండా పోతే అర్ధమే ఉండదు. అటు అధికార టీడీపీ ఇటు విపక్ష వైసీపీ ఉంటే న్యాయమూర్తి పాత్రలో అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన ఈ విషయంలో స్పందించే తీరుని బట్టి ఏపీ అసెంబ్లీ ముందు ముందు సాగే విధానం ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది అని అంటున్నారు.