ఏపీ అధికార పార్టీ… వైసీపీలో క్రేజీ యువ నాయకుడు ఎవరంటే, కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరే వినిపిస్తుంది. వైసీపీ యువనేతల్లో సిద్ధార్థ్‌కు ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఈ తరానికి తగినట్టు అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యం, ప్రత్యర్థులపై బాణాల్లాంటి విమర్శలు చేయడంలో సిద్ధార్థ్ తర్వాతే ఎవరైనా.
ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్‌కు గట్టి మద్దతుదారుడిగా బైరెడ్డి నిలిచారు. తనకు ఎంతో నమ్మకంగా ఉంటున్న బైరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఏపీ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ (శాప్) గా జగన్ ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. కొత్త కేబినెట్‌లో కొలువు దక్కించుకున్న వారిలో తాను అభిమానించే నేతలకు శుభాకాంక్షలు చెప్పడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీ నుంచి టీడీపీకిలోకి వెళుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. నందికొట్కూరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే ఆర్ధర్‌తో విభేదాల వల్ల పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు విస్తృత ప్రచారం సాగుతోంది. అంతేకాదు, ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో కూడా ఆయన భేటీ అయ్యారని, త్వరలో కండువా కప్పుకోనున్నారనే ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని బైరెడ్డి వర్గీయులు గట్టిగా చెబుతున్నారు.
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్ధర్ ఉన్నప్పటికీ, పెత్తనం అంతా బైరెడ్డిదే అనే విషయం అందరికీ తెలుసు. రిజర్వ్ నియోజకవర్గం కావడంతో తప్పని సరి పరిస్థితుల్లో ఆర్ధర్‌ను వైసీపీ నిలిపింది. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా బైరెడ్డికి ఉన్న పలుకుబడి దృష్ట్యా ఆయనకు సముచిత స్థానం కల్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బైరెడ్డి వర్గానికే 80 శాతం సీట్లు ఇచ్చారనేది వాస్తవం. బైరెడ్డితో ఆర్ధర్‌కు ఇబ్బందులే తప్ప, ఎమ్మెల్యే వల్ల ఆయన బయటికి వెళ్లే పరిస్థితి వుండదు. అయితే కర్నూలు జిల్లా వైసీపీలో బలమైన యువనాయకుడైన బైరెడ్డి పార్టీని వీడుతారనే ప్రచారం… కేవలం ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్‌గా బైరెడ్డి అభిమానులు చెబుతున్నారు.
తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన వైఎస్ జగన్‌తో జీవితాంతం వెంట నడుస్తానని పలుమార్లు బైరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. బైరెడ్డి బలమైన నాయకుడు కావడం వల్లే ఆయన టీడీపీలోకి వెళ్తారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని ఆయన అభిమానులు చెబుతున్నారు.